జొహానెస్‌బర్గ్ : గాజాపై ఇజ్రాయిల్ సాగిస్తున్న సామూహిక హత్యాకాండకు నిరసనగా దక్షిణాఫ్రికా టెల్ అవీవ్ నుంచి తన రాయబారులను వెనక్కి పిలిపించింది. గాజాలో పరిస్థితిపై సంప్రదింపులు జరిపేందుకు రాయబారులను వెనక్కి రప్పించాలని కేబినెట్ నిర్ణయించినట్లు మంత్రి కుంబుడో నిత్సావెహ్ని మంగళవారం నాడిక్కడ మీడియాకు తెలియజేశారు. ఇజ్రాయిల్ అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని, తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని దక్షిణాఫ్రికా ఇప్పటికే హెచ్చరించింది.
స్టార్మర్ వైఖరికి నిరసనగా 11 మంది లేబర్ పార్టీ కౌన్సిలర్లు రాజీనామా
కాల్పుల విరమణ డిమాండ్‌ను మొండిగా తిరస్కరిస్తూ, ఇజ్రాయిల్‌కు వత్తాసు పలుకుతున్న లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ తీరుపై ఆ పార్టీలోనే తిరుగుబాటు మొదలైంది. స్టార్మర్ వైఖరి పార్టీ మౌలిక లక్ష్యాలకు విరుద్ధమంటూ బర్న్‌లీ కౌన్సిల్‌కు చెందిన 11 మంది కౌన్సిలర్లు మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా బ్రిటిష్ ప్రజలు గత నాలుగు వారాలుగా వీకెండ్లలో భారీ ర్యాలీలు జరుపుతున్నా స్టార్మర్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్నారు. నాయకత్వ మైండ్ సెట్ ఏమిటో అర్థం కావడం లేదన్నారు. రెండు దేశాల పరిష్కారాన్ని తుంగలో తొక్కేందుకు ఇజ్రాయిల్ నిరంతరం కుట్రలు పన్నుతోందని, క్రిస్టియన్లను, ముస్లింలను తమ సొంత గడ్డ నుంచి తరిమేయాలని చూస్తోందని వారు విమర్శించారు. ఇంత జరుగుతున్నా కాల్పుల విరమణ గురించి మాట్లాడకుండా 'హ్యుమానిటేరియన్ పాజ్' గురించి స్టార్మర్ మాట్లాడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి చెత్తవాగుడు వాగుతున్న ఆయన వెంటనే పార్టీ పదవి నుంచి తప్పుకోవాలని పలువురు లేబర్ పార్టీ సభ్యులు డిమాండÊ చేస్తున్నారు. స్టార్మర్ నీతి బాహ్యమైన చర్యలను భరించలేకే తాము పార్టీ నుంచి వైదొలగుతున్నామని వారు తెలిపారు.