Sep 18,2023 09:52
  • ఇండియా ఫోరమ్‌ బలోపేతం, విస్తరణకు నిర్ణయం

న్యూఢిల్లీ : భారత రిపబ్లిక్‌, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకిక వ్యవస్థలు, ప్రజల ప్రాధమిక హక్కులు, పౌరహక్కుల పరిరక్షణ కోసం బిజెపిని గద్దె దించాలని సిపిఎం పొలిట్‌ బ్యూరో పిలుపునిచ్చింది. శని, ఆది వారాల్లో న్యూఢిల్లీలో జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశం కేంద్రంతో పాటు, వివిధ రాష్ట్రాల్లో కూడా బిజెపిని గద్దెనుండి దించడం ద్వారానే వ్యవస్థల పరిరక్షణ సాధ్యమవుతుందని తెలిపింది. దీనికోసం ప్రతిపక్షాలు ఏర్పాటు చేసుకున్న ఇండియా ఫోరమ్‌ను బలోపేతం చేయడంతో పాటు, మరింత విస్తరించాలని పేర్కొంది. పాట్నా, బెంగళూరు, ముంబయిల్లో జరిగిన ఇండియా ఫోరమ్‌ సమావేశాల్లో సిపిఎం అనుసరించిన వైఖరికి పొలిట్‌బ్యూరో ఆమోదముద్ర వేసింది. ఇండియా ఫోర్‌మ్‌ను విస్తరించడంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలను నిర్వహించాల్సిఉందని తెలిపింది. భాగస్వామ్య పార్టీల నాయకులు చర్చించి అన్ని నిర్ణయాలు చేస్తారని, అయితే, వాటి అమలుకు ఆటంకం కలిగించేలా నిర్మాణ రూపాలు వుండరాదని పేర్కొంది.దేశవ్యాప్తంగా వరుస బహిరంగ సభలను నిర్వహించి, ప్రజలను చైతన్యవంతం చేయాలంది.
 

                                                           జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిపై 

జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఇటీవల ఉగ్రవాద దాడిలో మరణించిన కల్నల్‌ మన్‌ప్రీత్‌సింగ్‌, మేజర్‌ అశిష్‌ దోన్‌చాక్‌, డివైఎస్‌పి హుమాయున్‌ ముజుమల్‌ భట్‌కు పొలిట్‌బ్యూరో శ్రద్ధాంజలి ఘటించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. కాశ్మీర్‌లో శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్న మోడీ ప్రభుత్వ వాదనల్లోని డొల్లతనాన్ని ఈ దాడి బహిర్గతం చేసిందని పేర్కొంది.
 

                                                                  త్రిపురలో ప్రజాస్వామ్యం ఖూనీ

త్రిపురలో ప్రజాస్వామ్యం హత్యకు గురైందని పొలిట్‌బ్యూరో ఆందోళనను వ్యక్తం చేసింది. సెప్టెంబర్‌ 5న రెండు త్రిపుర అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బిజెపి పూర్తిస్థాయిలో రిగ్గింగ్‌ చేసిందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, చట్టాన్ని అమలు చేయాల్సిన వ్యవస్థలో ప్రత్యక్ష పర్యవేక్షణలో అసాధారణ స్థాయిలో భయాత్పాతాలను సృష్టించారని పేర్కొంది. ఈ ఎన్నికలను రద్దు చేసి, పటిష్ట చర్యల మధ్య తిరిగి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేసింది.

                                                                         ఇసిల నియామకంపై...

'ఎన్నికల కమిషనర్ల నియామకం, సంబంధిత అంశాలకు సంబంధించిన ముసాయిదా బిల్లును మోడీ సర్కారు ఇటీవల సర్క్యులేట్‌ చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఎన్నికల కమిషనర్‌లను.. ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తి తో కూడిన ఎంపిక కమిటీ నియమించాలంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఈ బిల్లు తోసిపుచ్చింది. ఈ బిల్లును పార్లమెంటు ప్రత్యేక సెషన్‌లో ఆమోదించడం ద్వారా ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ప్రధాన మంత్రి నామినేట్‌ చేసే కేంద్ర క్యాబినెట్‌ మంత్రితో భర్తీ చేయనున్నారు. ఇది ఎన్నికల కమిషన్‌పై ప్రభుత్వ ఆధిపత్యానికి దారితీస్తుంది. ఇది అప్రజాస్వామికమైనది. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించాలనే రాజ్యాంగ ఆదేశాన్ని బలహీనపరుస్తుంది'' అని వివరించింది. ఈ బిల్లును రాజ్యసభలో వ్యతిరేకించి ఓడించాలని ఇండియా ఫోరమ్‌లోని అన్ని పార్టీలను కోరింది.

                                                                                    జి-20 పై

జి-20 సమ్మిట్‌ తర్వాత మోడీ తనను తాను 'గ్లోబల్‌ సౌత్‌' నాయకుడిగా చెప్పుకుంటున్నారని,అదే సమయంలో గ్లోబల్‌ సౌత్‌ దేశాలు క్యూబాలోని హవానాలో నిర్వహించిన సమ్మిట్‌కు హాజరు అవుతానని ప్రకటించిన భారత విదేశాంగ మంత్రి గైర్హాజరయ్యారని పేర్కొంది. ఈ చర్య ద్వారా భారత్‌ అమెరికాకు మరింత విధేయ భాగస్వామి అయిందని తెలిపింది. గ్లోబల్‌ సౌత్‌ దేశాల సమావేశాలకు కనీసం మంత్రిని కూడా పంపలేని ప్రభుత్వాధినేత గ్లోబల్‌ సౌత్‌ నాయకుడు ఎలా అవుతాడని పొలిట్‌బ్యూరో ప్రశ్నించింది.

                                                                       అదాని అవినీతిపై ..

అదానీ గ్రూప్‌ తన కంపెనీల స్టాక్‌ ధరలను తారుమారు చేయడంపై తాజా సాక్ష్యాలు వెల్లడైన నేపథ్యంలో దీనిపై లోతైన విచారణ జరపాలని పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యాన్ని కోరింది.
         వార్తపత్రికల్లో వచ్చిన కథనాలు వినోద్‌ అదానీకి చెందిన ఇద్దరు సన్నిహితులు బెర్ముడాలో పెట్టుబడి నిధిని ఎలా సమీకరించారని ప్రశ్నించింది. అదానీ కంపెనీల్లో మిలియన్‌ డాలర్ల షేర్లను కొనుగోలు చేయడానికి షెల్‌ కంపెనీలను ఎలా ఏర్పాటు చేశారో వివిధ పత్రికలువెల్లడించాయనీ పేర్కొంది. ఈ వ్యవహారంపై 2014 వరకు అనేక వివరాలు సేకరించిన సెబి మోడీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత విచారణను పక్కనపెట్టినట్లు వచ్నిన కథనాలను ప్రస్తావించింది.

                                                                    ఒకే దేశం.. ఒకే ఎన్నికపై

'ఇది మన రాజ్యాంగంలో పొందుపరిచిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, ఫెడరలిజంపై బహుముఖ దాడిని చేస్తుంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వాన ఎనిమిది మంది సభ్యులతో ఒక కమిటీని మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు ఎలా నిర్వహించాలన్న విషయమై ఈ కమిటీ సిఫార్సు చేస్తుంది. దీనికోసం రాజ్యాంగానికి అనేక ముఖ్యమైన సవరణలు చేయాల్సి వస్తుంది. దాంతో పాటు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాల పదివీకాలం గణనీయంగా తగ్గిపోతుంది. భవిష్యత్తులో ఏదైనా రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వం మెజార్టీని కోల్పోయినప్పుడు లోక్‌సభతో కలిసిఎన్నికలు నిర్వహించడానికి ఆ ప్రభుత్వ పదవీ కాలాన్ని పొడిగించాల్సి వస్తుంది. ఇది చట్ట విరుద్దం. ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం కల్పించకుండా కేంద్ర పాలన విధిస్తే అది ప్రజాస్వామ్య వ్యతిరేకమవుతుంది. అందువల్ల ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది,