హరారే: జింబాబ్వేలో జరిగిన విమాన ప్రమాదంలో భారత మైనింగ్ వ్యాపారవేత్త, ఆయన కుమారుడితో సహా ఆరుగురు మృతి చెందారు. బంగారం, బొగ్గు, నికెల్, రాగిని శుధ్ది చేసే డైవర్సిఫైడ్ మైనింగ్ కంపెనీ రియోజిమ్ యజమాని హర్పాల్ రంధావా ప్రయాణిస్తున్న ఈ ప్రైవేట్ విమానం నైరుతి జింబాబ్వేలోని వజ్రాల గని సమీపంలో కూలిపోయినట్లు జింబాబ్వే మీడియా వెల్లడించింది. రియోజిమ్ కి చెందిన సెస్నా 206 విమానం జింబాబ్వే రాజధాని హరారే నుంచి మురోవా వజ్రాల గనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విమానంలోని సింగిల్ ఇంజిన్ లో సాంకేతిక లోపమే దీనికి కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. చనిపోయిన వారిలో నలుగురు విదేశీయులు కాగా.. మిగిలిన ఇద్దరు జింబాబ్వేకు చెందిన వారని పోలీసుల నివేదికను ఉటంకిస్తూ ప్రభుత్వ యాజమాన్య పత్రిక హెరాల్డ్ పేర్కొంది.