Nov 17,2023 11:06
  •  కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌
  • తిరుపతిలో సెంట్రల్‌ జిఎస్‌టి కమిషనరేట్‌ కార్యాలయానికి భూమిపూజ

ప్రజాశక్తి - తిరుపతి టౌన్‌ : జిఎస్‌టి వసూళ్లలో గణనీయమైన పురోగతి సాధించామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. రూ. 36.11 కోట్లతో తిరుపతిలో నిర్మించనున్న సెంట్రల్‌ జిఎస్‌టి కమిషనరేట్‌ (సిజిఎస్‌టి భవన్‌) నూతన కార్యాలయ భవనాన్ని సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ (సిబిఐసి) సభ్యులతో కలిసి చైర్మన్‌ సంజరు కుమార్‌ అగర్వాల్‌ భూమిపూజ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వర్చువల్‌ విధానంలో నిర్మలా సీతారామన్‌ మాట్లాడారు. తిరుపతి సిజిఎస్‌టి కమిషనరేట్‌ వైజాగ్‌ జోనల్‌ చీఫ్‌ కమిషనరేట్‌ పరిధిలో ఉంటుందని తెలిపారు. వైజాగ్‌ జోనల్‌ చీఫ్‌ కమిషనర్‌ వారు జిఎస్‌టి వసూళ్లే కాకుండా కస్టమ్స్‌, సెంట్రల్‌ ఎక్సైజ్‌ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని, బంగారం, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌ వంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారికి శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. తిరుపతి సిజిఎస్‌టి కమిషనరేట్‌ పరిధిలో తిరుపతి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాలు ఉన్నాయని, ఇందులో ఎక్కువ శాతం మౌలిక సదుపాయాల పరిశ్రమలు, వివిధ పరిశ్రమల ద్వారా జిఎస్‌టి వసూళ్లలో గణనీయమైన పురోగతి ఉందని తెలిపారు. తిరుపతి కమిషనరేట్‌ పరిధిలో సుమారు 57,173 జిఎస్‌టి పన్ను చెల్లింపుదారులు ఉన్నారని చెప్పారు. గత సంవత్సరం జిఎస్‌టి ట్యాక్స్‌ కలెక్షన్లు రూ. 8264 కోట్లుగా ఉందని, ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ నాటికి రూ.5019 కోట్లను వసూళ్లు చేశారని, గత సంవత్సరాలను గమనిస్తే మూడు వందల శాతం వృద్ధి ఉందని తెలిపారు. దీనికి ప్రధానంగా ఇక్కడ ఉన్న ప్యాసింజర్‌ వాహనాల తయారీ పరిశ్రమలు, ఆటోమోటివ్‌ బ్యాటరీ పరిశ్రమలు, సిమెంట్‌ పరిశ్రమలు ప్రధానంగా కాంట్రిబ్యూట్‌ చేస్తున్నాయని, శ్రీసిటీ పరిశ్రమల యొక్క కాంట్రిబ్యూషన్‌ కూడా ఒక ముఖ్య కారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిబిఐసి జోనల్‌ సభ్యులు వివేక్‌ నిరంజన్‌, ఎడిజి సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ హైదరాబాద్‌ రేంజ్‌ శిశిర్‌ భన్సాల్‌, తదితరులు పాల్గొన్నారు. అనంతరం చంద్రయాన్‌-3 నమూనా జ్ఞాపికలను వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అతిథులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిజిఎస్‌టి, సిబిఐసి సీనియర్‌ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు. వాణిజ్య, పరిశ్రమల సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ అధికారులు, శ్రీసిటీ ఎండి రవి సన్నారెడ్డి పాల్గొన్నారు.