'తక్షణమే కాల్పుల విరమణ', 'స్వతంత్ర పాలస్తీనా', 'స్వేచ్ఛా గాజా' వంటి నినాదాలు అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి పశ్చిమ దేశాలతో సహా ప్రపంచ వ్యాపితంగా హోరెత్తుతున్నాయి. వారాంతంలో వేలాది మందితో పాలస్తీనా సంఘీభావ ర్యాలీలు జరుగుతున్నాయి. భారత్‌లో మితవాద మోడీ ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదిరించి ఈ సంఘీభావ ర్యాలీలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. అమెరికా, ఇండియా రక్షణ, విదేశాంగ మంత్రుల (2+2 ) సమావేశం కోసం భారత్ వచ్చిన అమెరికా మంత్రులకు నిరసన సెగ గట్టిగా తగిలేలా ఈ మూడు రోజులు దేశ వ్యాపిత నిరసనలకు వామపక్షాలు పిలుపునివ్వడం ముదావహం.
గత నెలరోజులుగా యుద్ధట్యాంక్‌లు, ఫిరంగులు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలను వెంటనిడుకుని ఇజ్రాయిల్ సేనలు సాగిస్తున్న కార్పెట్ బాంబింగ్‌లో 4,000 మందికిపైగా పిల్లలు, 2,500 మంది దాకా మహిళలు, 500 మంది వృద్ధులతో సహా 10,000 మంది పాలస్తీనీయులు మరణించారు. అంటే మొత్తం మరణాల్లో 70 శాతం దాకా అమాయక పౌరులేనన్నది స్పష్టం. మరో 30,000 మంది గాయపడ్డారు. తాగునీరు, ఆహారం, మందులు, విద్యుత్‌ను బంద్ చేసిన ఇజ్రాయిల్ అమానుషత్వానికి ఆకలితో మరింత మంది బలికానున్నారు. 3,50,000 మంది సాయుధ రిజర్వు దళాలతో గాజాలోని పౌర ఆవాస ప్రాంతాలను, స్కూళ్లు, ఆసుపత్రులు, మసీదులను ఇజ్రాయిల్ ధ్వంసం చేస్తోంది. గాజాను సర్వనాశనం చేసేందుకు అణు బాంబు ప్రయోగించే విషయం కూడా పరిశీలిస్తున్నామని యూదు దురహంకార మంత్రి అమిచారు ఎలియాV్‌ా చేసిన బెదిరింపులు నెతన్యాహు ప్రభుత్వ ఫాసిస్టు పోకడలు మానవాళికే విపత్తుగా పరిణమించనున్నాయి. ఈ పాపంలో అమెరికాకు వాటా ఉంది. ఇజ్రాయిల్‌కు వందలకోట్ల డాలర్ల మారణాయుధాలు సమకూరుస్తూ, రెండు దేశాల ఏర్పాటు పరిష్కారాన్ని తుంగలో తొక్కుతున్నది. గాజా నుంచి పాలస్తీనీయులను ఈజిప్టుకో, ఇతర ఎడారి ప్రాంతాలకో పూర్తిగా తరిమేసి దానిని పూర్తిగా ఆక్రమించేలా ఇజ్రాయిల్‌ను ఎగదోస్తున్నది. అమెరికా విదేశాంగ మంత్రి పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్సాస్‌తో తాజాగా జరిపిన భేటీలో గాజా నుంచి హమాస్‌ను పూర్తిగా తరిమేసిన తరువాత అక్కడ పాలస్తీనా అథారిటీ పాత్ర గురించి చర్చించినట్లు వార్తలొచ్చాయి. నేడు గాజా, రేపు వెస్ట్‌బ్యాంక్. ఇదీ అమెరికా, ఇజ్రాయిల్ దుష్ట పన్నాగం. ప్రపంచ ప్రజానీకం అంతా వ్యతిరేకిస్తున్నా ఈ ఆధిపత్య శక్తులు పాలస్తీనాకు వ్యతిరేకంగా తమ కుట్రలు నిరంతరం సాగిస్తూనే ఉన్నాయి. దాడి జరిగిన వెంటనే ఆగమేఘాల మీద అక్కడికి వెళ్లిన అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని సునాక్, జర్మనీ ఛాన్సలర్ షుల్జ్ తదితరులు ఇజ్రాయిల్‌కు వత్తాసు పలికారు. కాల్పుల విరమణ పిలుపును తిరస్కరిస్తున్న వారి సరసన మోడీ కూడా చేరడం దారుణం. కాల్పుల విరమణ పాటించాలని, పౌరులందరికీ రక్షణ కల్పించాలని, తక్షణమే మానవతా సాయం చేయాలని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ చేసిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరైంది. ఇప్పుడీ 2+2 సమావేశం పేరుతో అమెరికా అనుకూల, ఇజ్రాయిల్‌ను సమర్ధించే విధానాన్ని పచ్చిగా ముందుకు తీసుకెళ్లేందుకు మోడీ ప్రభుత్వం యత్నిస్తున్నది. అమెరికాతో సహవాసం చేసిన ఏ దేశమూ బాగుపడలేదు. తనకు సాంకేతికపరంగా ఎక్కడ పోటీ వస్తుందోనని మిత్రదేశమైన జపాన్‌ను అది తొక్కిపడేసింది. అటువంటి అమెరికాకు జూనియర్ భాగస్వామిగా భారత్ మారడం భారత దేశ ప్రయోజనాలకే విఘాతం. మోడీ ఏలుబడిలో 2018 నుంచి అమెరికా, ఇండియా విదేశాంగ, రక్షణ మంత్రుల మధ్య (2+2) సమావేశాలు ఏటా జరుగుతున్నాయి. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశం సందర్భంగా గాజాలో పశ్చిమ దేశాల అండతో ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణకాండకు వ్యతిరేకంగా పెద్దయెత్తున ఉద్యమించాలి. స్వతంత్ర పాలస్తీనా ఏర్పడకుండా ఇజ్రాయిల్ భద్రత, శాంతి ఉండదనే విషయాన్ని మరోసారి చాటి చెప్పాలి. అంతర్జాతీయ సంఘీభావ ఉద్యమాన్ని బలోపేతం చేయడం ద్వారా పశ్చిమాసియాలో యూదు దురహంకార ఇజ్రాయిల్‌కు, దానికి మద్దతు ఇస్తున్న అమెరికా, ఇతర పశ్చిమ దేశాల కుట్రలను తిప్పికొట్టాలి.