Sep 13,2023 07:01

           దేశ రాజధానిని మూసేసి రెండు రోజుల పాటు అత్యంత ఆర్భాటంగా నిర్వహించిన జి-20 సదస్సు ముగిసింది. మోడీ ప్రభుత్వ కపటత్వం బయటపడింది. వర్థమాన దేశాల ప్రయోజనాలను కాపాడే మొనగాడిగా నిలవాల్సిన భారత్‌, సంపన్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లే సాధనంగా వ్యవహరించింది. ఉక్రెయిన్‌ యుద్ధంపై బాలి సదస్సులో రష్యాను దురాక్రమణదారు వంటి పరుష పదజాలాన్ని ప్రయోగించిన జి-20 వేదిక ఈ సారి స్వరాన్ని తగ్గించింది. అదే గొప్ప విజయంగా మోడీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. రష్యా విదేశాంగ మంత్రి లావ్‌రోవ్‌, చైనా ప్రధాని లీ కియాంగ్‌ లేవనెత్తిన అభ్యంతరాలను అంగీకరించిన మీదటే డిక్లరేషన్‌ ఆమోదం పొందింది. ఉక్రెయిన్‌ యుద్ధాన్ని సాకుగా చేసుకుని అమెరికా విధించిన ఆంక్షలను చాలా దేశాలు లెక్కచేయడం లేదు. భారత్‌తో సహా పలు దేశాలు రష్యా నుంచి చౌకగా చమురు స్థానిక కరెన్సీలో పొందుతున్నాయి. అందుకే రష్యాకు వ్యతిరేకంగా జి-20లోని సభ్య దేశాలను కూడగట్టాలన్న అమెరికా ఎత్తులు ఇక్కడ పారలేదు. 14 వేల పదాలకు పైగా ఉన్న ఈ డిక్లరేషన్‌ వర్థమాన, పేద దేశాలను వెంటాడుతున్న సమస్యలపై దృష్టి పెట్టింది లేదు. మోడీని విశ్వగురుగా ప్రపంచం గుర్తించిందనడానికి జి-20 సదస్సు అధ్యక్ష బాధ్యతలు లభించడమేనని బిజెపి ప్రచారం చేసుకోవడం మరో వంచన. జి-20కి అధ్యక్ష బాధ్యతలు గతసారి ఇండోనేషియా నిర్వహించింది. వచ్చే ఏడాది బ్రెజిల్‌ నిర్వహించబోతున్నది. ఈ అధ్యక్ష బాధ్యతలు రోటీన్‌గా ఒక దేశం తరువాత మరొక దేశానికి అప్పగించబడతాయి. ఇందులో మోడీ ప్రభుత్వ గొప్పతనమేమీ లేకున్నా, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో దీనిని ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి పొందాలని బిజెపి చూస్తున్నది. విశ్వగురు తన గొప్పతనాన్ని చాటుకోడానికి ఈ శిఖరాగ్ర సదస్సు నిర్వహణకు ముందు ఢిల్లీలో 25కిపైగా మురికివాడలను, దుకాణాలను బుల్డోజర్లతో నేలమట్టం చేసి, రాజధానిలో పేదరికాన్ని ప్రపంచ దేశాలకు కనిపించకుండా దాచిపెట్టారు. ఇదీ మన విశ్వగురు ఘనత! చీటికీి మాటికీ నెహ్రూను ఆడిపోసుకునే మోడీ ప్రభుత్వం చివరికి భారత్‌, ఆఫ్రికా సంబంధాల మెరుగుదలకు ఆయన చూపిన బాటనే అనుసరించింది. బ్రిక్స్‌లో రెండు ఆఫ్రికన్‌ దేశాలకు కొత్తగా సభ్యత్వం కల్పించగా, జి-20 యాభై అయిదు దేశాల ఆఫ్రికన్‌ యూనియన్‌కు జి-20లో భాగస్వామ్యం కల్పించింది. ఆఫ్రికా దేశాల ప్రవేశం గతంలో ఉన్న అసమతుల్యతను సరిచేసింది. అమెరికా ఒత్తిడి మేరకు రైలు, నౌకా మార్గాలను అనుసరిస్తూ భారత్‌-మధ్య ఆసియా-యూరప్‌ ఆర్థిక కారిడార్‌ను ప్రధాని మోడీ ప్రకటించారు. ఆర్థిక, వాణిజ్యమే ఈ కారిడార్‌ లక్ష్యమైతే ఆక్షేపించాల్సిన అవసరం లేదు. కానీ, చైనా వన్‌ బెల్ట్‌, వన్‌ రోడ్‌కు పోటీగా జి-7 దేశాలు గతంలో ప్రకటించిన కారిడార్ల తరహాలోనే అమెరికా ప్రోద్బలంతో దీనిని ముందుకు తెచ్చినట్లుగా అనిపిస్తుంది.
           1999లో ఆగేయాసియాలో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించడంలో సంపన్న దేశాల కూటమి జి-7 విఫలమైన నేపథ్యంలో ఈ జి-20ని అవి తెరపైకి తీసుకొచ్చాయి. 2008లో ప్రపంచ ఆర్థిక మాంద్యం తలెత్తినప్పుడు ఆ భారాలను వర్థమాన దేశాలపైకి నెట్టివేసేందుకు ఈ వేదికను ఉపయోగించుకున్నాయి. భారత్‌ను కేంద్రంగా చేసుకుని చైనాను కట్టడి చేసేందుకు ఇండో-పసిఫిక్‌ వ్యూహాన్ని రచించిన అమెరికా ఇప్పటికే క్వాడ్‌, ఆకస్‌ వంటి కూటములను ఏర్పాటు చేసి ఆ దిశగా పావులు కదుపుతోంది. బైడెన్‌ భారత్‌లో అడుగు పెట్టడానికి ముందే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే యాపిల్స్‌, పౌల్ట్రీ ఉత్పత్తులపై కస్టమ్స్‌ సుంకాన్ని 20 శాతం మేర తగ్గించేసింది. దీంతో కాశ్మీర్‌లో యాపిల్‌ రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. అమెరికా నౌకాదళం, కేంద్రప్రభుత్వరంగ సంస్థ మసాగోవ్‌ డాక్‌షిప్‌ బిల్డర్స్‌ లిమిటెడ్‌ మధ్య జరిగిన ఒప్పందం మన దేశ సార్వభౌమత్వానికి గొడ్డలిపెట్టు.
           సామాజిక, ఆర్థిక, రాజకీయ, పర్యావరణ సంబంధమైన అసమానతలు, జీవ వైవిధ్యానికి ఎదురవుతున్న ముప్పు వంటి అంశాలపై డిక్లరేషన్‌లో ప్రస్తావించినా వాటి అమలుకు సంబంధించి ఎలాంటి నిర్దిష్ట ప్రణాళికలు కానీ, యంత్రాంగాన్ని కానీ ఏర్పాటు చేయలేదు.
          నెలల తరబడి మణిపూర్‌లో జాతులు, మతాల మధ్య మారణహోమం సాగుతున్నా నోరు మెదపని విశ్వగురు అంతర్జాతీయ వేదికలపై ఒక భూమి, ఒక భవిష్యత్తు, వసుధైక కుటుంబం గురించి లెక్చర్‌ దంచడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనం. వైట్‌ హౌస్‌ నుంచి పదేపదే అభ్యర్థనలు ఉన్నప్పటికీ, బైడెన్‌, మోడీ సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు చేసి, అమెరికా జర్నలిస్టులకు ప్రశ్నలు అడిగే అవకాశం కల్పించేందుకు అనుమతించలేదు. మొత్తంగా జి 20 శిఖరాగ్ర సమావేశం ప్రచార ఆర్భాట వేదికగానే మిగిలిపోయింది.