Oct 10,2023 07:12

              చైనా వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో 107 పతకాలు సాధించిన భారత ఆటగాళ్లు దేశ క్రీడా చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించారు. హాంగ్‌ జౌ లో గత నెల 23న అద్భుతంగా ఆరంభమైన ఆసియా క్రీడలు ఆదివారం ముగియగా మన దేశం 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలను తన ఖాతాలో వేసుకొని అత్యుత్తమ సామర్ధ్యాన్ని ప్రదర్శించడం హర్షణీయం. దేశానికి పతకాలు సాధించి పెట్టిన అథ్లెట్లు అభినందనీయులు. 2018లో 70 పతకాలు సాధించగా సెంచరీ దాటాలన్న లక్ష్యంతో మన 665 మంది అథ్లెట్ల బృందం అనుకున్న దానికన్నా ఏడు పతకాలు ఎక్కువే సాధించింది. ఈ విజయం వెనుక క్రీడాకారుల అకుంఠిత దీక్ష, పట్టుదల, కృషి ఎంతో ఉంది. గత ఆసియాడ్‌ కంటే 37 పతకాలు ఎక్కువ సాధించి నాల్గవ స్థానంలో నిలవడం గొప్ప విషయం. అథ్లెటిక్స్‌, ఆర్చరీ, రోయింగ్‌, షూటింగ్‌, కబడ్డీ, హాకీ, క్రికెట్‌, స్వ్కాడ్‌, టేబుల్‌టెన్నిస్‌ తదితర క్రీడల్లో మన వాళ్లు అంచనాలకు మించి రాణించారు. క్రికెట్‌లో మనకు ఛాంపియన్‌సిప్‌ రావడం గర్వకారణం. పతకాల సాధనలో తెలుగు క్రీడాకారులు గణనీయమైన పాత్ర పోషించడం సంతోషించదగిన విషయం.
           ఆసియా క్రీడలు ప్రపంచంలో ఒలింపిక్స్‌ తర్వాత అతిపెద్ద బహుళ క్రీడల ఈవెంట్‌. హాంగ్‌ జౌలో 45 దేశాల నుంచి 40 రకాల క్రీడల కోసం 12 వేల మందికిపైగా అథ్లెట్లు పాల్గొన్నారు. పతకాల జాబితాలో 383 పతకాలతో చైనా మొదటి స్థానంలో నిలవగా రెండవ స్థానాన్ని జపాన్‌, మూడవ స్థానాన్ని దక్షిణ కొరియా దక్కించుకున్నాయి. ఎప్పుడో 1951లో మన దేశం రెండవ స్థానాన్ని, 1962లో మూడవ స్థానాన్ని దక్కించుకుంది. తదుపరి ఇప్పుడు ఇన్నేళ్లకు నాల్గవ స్థానం వచ్చింది. మన ఆటగాళ్లు ప్రదర్శించిన ప్రతిభ మరో ఎనిమిది మాసాల్లో జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌కు ప్రేరణ అవుతుందని ఆశించవచ్చు. టోక్యో ఒలింపిక్స్‌లో మనకు ఒక పసిడి, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు లభించాయి. ఒక విధంగా చెప్పాలంలే ఒలింపిక్స్‌లో భారత్‌ ప్రదర్శన పేలవంగానే ఉంటోంది. ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్‌లో మన వాళ్లు ఆరు స్వర్ణాలు, 14 రజతాలు, 9 కాంస్యాలతో సత్తా చాటారు. భారత్‌ బలంగా ఉన్న మరో క్రీడ షూటింగ్‌. ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, ఆరు కాంస్యాలతో మంచి ప్రోత్సాహాన్నిచ్చింది. రెజ్లింగ్‌, బాక్సింగ్‌, రోయింగ్‌, సెయిలింగ్‌, బ్యాడ్మింటన్‌లో సైతం ఆశలు చిగురిస్తున్నాయి. తగిన రీతిలో సన్నద్ధమయితే పతకాల సాధన పెద్ద కష్టమేం కాదని ఆసియన్‌ గేమ్స్‌ ద్వారా నిరూపితమైంది.
           ఏ విషయాన్నైనా తన గొప్పతనంగా ప్రచారం చేసుకోవడం మోడీ ప్రభుత్వానికి అలవాటైన విద్య. ఆసియన్‌ గేమ్స్‌ను సైతం అదే విధంగా వాడుకుంటోంది. వాస్తవానికి ఆసియా క్రీడల్లో చైనా గత నాలుగు దశాబ్దాలుగా తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. 1982లో మొదటిసారి జపాన్‌ను వెనక్కినెట్టి మొదటి స్థానం ఆక్రమించినప్పటి నుంచి 11 పర్యాయాలుగా నెంబర్‌ వన్‌ స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. టోక్యో ఒలింపిక్స్‌లోనూ ఒక్క పసిడి పతకం తేడాతో అమెరికా తర్వాతి స్థానంలో నిలిచింది. అందుక్కారణం అక్కడి ప్రభుత్వం క్రీడలకిచ్చే ప్రోత్సాహమని ప్రపంచం యావత్తు వక్కాణిస్తోంది. కానీ మన దేశంలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. బడ్జెట్‌లో స్పోర్ట్స్‌ కేటాయింపు ఎక్కడో చివరన నామమాత్రంగా ఉంటుంది. పలు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. కె.జి. నుంచే కంప్యూటర్‌, ఎంసెట్‌, కోచింగ్‌లతో బాలల మెదళ్లను కలుషితం చేస్తున్న కార్పొరేట్‌-ప్రైవేటు విద్యా వ్యవస్థ తామరతంపరలా పుట్టుకొచ్చాక ఆట స్థలాలు, ఆటలకు స్థానం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులుండవు. కనీస మౌలిక వసతులు కల్పించకుండా ఒలింపిక్స్‌లో రాణించాలన్న ఆశ అత్యాశే అవుతుంది. పతకాలు సాధించి దేశ ప్రతిష్టను ఇనుమడింప జేసిన మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల వ్యవహారం తెలిసిందే. రెజ్లర్లు రోడ్డెక్కినా, చివరికి పతకాలు తిరిగి ఇచ్చేస్తామన్నా నిందితుడైన తమ పార్టీ ఎం.పి.పై మోడీ ప్రభుత్వం ఈగ వాలకుండా రక్షిస్తోంది. బిసిసిఐ సహా వివిధ క్రీడల అసోసియేషన్లు, సంస్థల్లో రాజకీయ జోక్యం, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతం, వేధింపులు, లలిత్‌ మోడీ వంటి వారి ఉదంతాలు, డోపింగ్‌లు, మ్యాచ్‌ ఫిక్సింగ్‌లు క్రీడాకారులు దూరం కావడానికి కారణమవుతున్నాయి. మన వాళ్లలో ప్రతిభకు కొదవ లేదని ఆసియా క్రీడలు తేటతెల్లం చేశాయి. ప్రభుత్వ ఇతోధిక ప్రోత్సాహం, మౌలిక వసతులు ఉంటే ఏదైనా సాధిస్తారు. ప్రభుత్వాలు ఈ తర్కాన్ని మర్చిపోవడం వారి ఉద్దేశపూరిత బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.