Jun 04,2023 09:53

న్యూఢిల్లీ : టెలికాం, లోహ, వాహన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో రెండు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు కోలుకున్నాయి. మేలో వాహన విక్రయాలు, జిఎస్‌టి వసూళ్లు మెరుగ్గా నమోదుకావడం సెంటిమెంట్‌ను బలపరిచింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు పెరిగి 82.31 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 1.74 శాతం లాభపడి 75.57 వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా సూచీలు మెరుగ్గా ట్రేడయ్యాయి.
           సెన్సెక్స్‌ ఉదయం 62,601.97 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ప్రారంభ ట్రేడింగ్‌లో 62,719.84 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. అనంతరం ఒకదశలో 62,379.86 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయింది. మళ్లీ కోలుకుని 118.57 పాయింట్ల లాభంతో 62,547.11 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 46.35 పాయింట్లు పెరిగి 18,534.10 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 18,478.40- 18,573.70 పాయింట్ల మధ్య కదలాడింది. వారం ప్రాతిపదికన చూస్తే.. సెన్సెక్స్‌ 45.42 పాయింట్లు, నిఫ్టీ 34.75 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.
            మేలో వాహన విక్రయాలు 7 శాతం పెరగడంతో హీరో మోటోకార్ప్‌ షేరు 3.25 శాతం లాభంతో రూ.2,891.95 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.1,819.11 కోట్లు పెరిగి రూ.57,793.21 కోట్లకు చేరింది.
           సెన్సెక్స్‌ 30 షేర్లలో 20 మెరిశాయి. టాటా స్టీల్‌ 1.93%, మారుతీ 1.73%, ఎం అండ్‌ ఎం 1.71%, సన్‌ఫార్మా 1.20%, ఎల్‌ అండ్‌ టీ 1.19%, టైటన్‌ 1.16%, భారతీ ఎయిర్‌టెల్‌ 0.98%, ఎస్‌బీఐ 0.79% చొప్పున లాభపడ్డాయి. ఇన్ఫోసిస్‌, విప్రో, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, రిలయన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.58% వరకు నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో లోహ 1.71%, స్థిరాస్తి 1.33%, టెలికాం 1.06%, వాహన 0.98%, పరిశ్రమలు 0.85%, వినియోగ 0.83%, కమొడిటీస్‌ 0.73%, ఆరోగ్య సంరక్షణ 0.72% పెరిగాయి. ఐటీ, టెక్‌, యుటిలిటీస్‌, ఇంధన, చమురు-గ్యాస్‌ నీరసపడ్డాయి. బీఎస్‌ఈలో 2181 షేర్లు లాభపడగా, 1364 స్క్రిప్‌లు నష్టపోయాయి.