Oct 15,2023 06:58

            'యుద్ధం అంటే ఏమిటో నాకు తెలుసు. మనుషులు చనిపోవడం చూశాను. పిచ్చెత్తిపోవడం, ఆసుపత్రిలో నరకం అనుభవించడం చూశాను. కానీ వీటన్నిటి కన్నా ఘోరాతిఘోరమైన విషయం మరొకటి ఉంది. యుద్ధం అంటే వికృతమైన సామూహిక, మానసిక వైకల్యం' అంటాడు కవి, విప్లవ రచయిత, జర్నలిస్టు జాన్‌ రీడ్‌. యుద్ధం... అనాగరికం, అమానుషం. యుద్ధం ఒక విధ్వంసం. అది వినాశనానికి ప్రతిరూపం. మానవ ప్రపంచానికి ఒక మాయని గాయం. యుద్ధాల వల్ల సామ్రాజ్య స్థాపన కంటే... అవి చేసిన నష్టాలే ఎక్కువ. సామ్రాజ్యాల్ని నిర్మించిన వారిని చరిత్ర మర్చిపోయి ఉండొచ్చు. కానీ విధ్వంసం సృష్టించిన వాళ్లను, ఆ విధ్వంసం ఆనవాళ్లను మాత్రం ఎప్పటికీ మర్చిపోదు. ఎందుకంటే- యుద్ధాలకు ముగింపు పలికేదీ లేదు. చితులను పేర్చడం ఆపిందీ లేదు. గడచిన యుద్ధాలు చేసిన గాయాల మచ్చలింకా పచ్చిగానే వున్నాయి. సామ్రాజ్యవాద నీడ అలముకున్న ప్రతిచోట... ఏదోక రూపంలో యుద్ధక్రీడ తచ్చాడుతునే వుంటుంది. 'యుద్ధం ఎప్పుడు వచ్చినా, తొలుత మరణించేది సత్యమే' అంటాడు అమెరికన్‌ రాజనీతిజ్ఞుడు హైరమ్‌ వారెన్‌ జాన్సన్‌. యుద్ధోన్మాదం తలకెక్కిన నియంతలకు, సామ్రాజ్యవాదులకు సత్యంతో పనిలేదు. హితోక్తులు రుచించవు. వారికి కావాల్సింది ఆధిపత్యం... పెద్దన్న పెత్తనం. యుద్ధ నష్టం దేశాల మధ్యనే కాదు- నడిరోడ్డున పడే కుటుంబాల ఛిద్ర రూపం. ఈ నష్టం ఒకరోజుదో, ఒక సంవత్సరానిదో కాదు... కోల్పోయిన ఒక జీవిత కాలానిది.
              యుద్ధం రావడానికి కారణాలు అనేకం వుండొచ్చు. కానీ యుద్ధం కారణంగా నలిగిపోయేది... మరణించేది సామాన్యులే. 'మనిషి పుట్టుకతో స్వేచ్ఛాజీవి... కానీ, ప్రతిచోటా సంకెళ్లలో చిక్కుకున్నాడు' అంటాడు రూసో. ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అధిపత్యం అతి ప్రమాదకరమైన ఆయుధంగా మారినచోట మనిషి స్వేచ్ఛ, హక్కుల కాదు... దేశాల స్వేచ్ఛ, హక్కులు కూడా హననం కావించబడుతున్నాయి. బలమైన దేశం బలహీన దేశాన్ని కబళించడానికి అన్నిరకాల ఎత్తులు వేస్తున్నది. ఉక్రెయిన్‌ - రష్యాల మధ్య ఘర్షణ ఇంకా కొనసాగుతుండగానే, ఇజ్రాయిల్‌ - పాలస్తీనాల మధ్య ఘర్షణ మొదలైంది. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో జీవితాలు నిరాదరణకు గురవుతున్నాయి. తినడానికి తిండిలేక, నిలువ నీడలేక చిన్నా పెద్ద తేడాలేకుండా భయోత్పాతంతో వణికిపోతున్నారు. వేలాదిమంది యువకులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోతున్నారు. 'వయసు మళ్లిన వారు యుద్ధాలను ప్రకటిస్తారు. అయితే... ఆ యుద్ధాల్లో ప్రాణాలు పోగొట్టుకునేది యువకులే' అంటాడు హెర్బర్ట్‌ హూవర్‌ అనే అమెరికన్‌ రాజనీతిజ్ఞుడు. యుద్ధాల వల్ల అనర్థాలు తప్ప ఒరిగేదేమీ వుండదని ప్రపంచవ్యాప్తంగా అనేకమంది శాంతిగాముకులు, రాజనీతిజ్ఞులు చెబుతూనే వున్నారు. యుద్ధానికి ఉవ్విళ్లూరే పాలకుల ధోరణిని ఎద్దేవా చేస్తూ... 'రాజులు చరిత్రకు బానిసలు' అంటాడు టాల్‌స్టారు తన 'వార్‌ అండ్‌ పీస్‌' నవలలో. యుద్ధమనేది ఏదైనా... అది మానవ వినాశనానికి దారిస్తుంది.
             మహాకవి శ్రీశ్రీ అంటాడు... 'ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం/ నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం' అని. ప్రపంచంలో దుర్బలులను పీడించే బలవంతుల జాతి వున్నంత వరకు, ఒకవైపు శాంతి వచనాలు వల్లిస్తూనే, మరోవైపు అణ్వాయుధ వ్యాపారం సాగిస్తున్నంత వరకూ ప్రపంచంలో ఏదోక మూల ఘర్షణలు, యుద్ధాలు జరుగుతూనే వుంటాయి. 'రణరంగం కానిచోటు భూ/ స్థలమంతా వెదకిన దొరకదు.../ గతమంతా తడిసె రక్తమున,/ కాకుంటే కన్నీళులతో' అంటాడు శ్రీశ్రీ. ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనా యుద్ధం సమర్థనీయం కాదు. 'యుద్ధాన్ని వాయిదా వేయడమే మంచిది' అని ఓ కవి అన్నట్టుగా... యుద్ధాన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకించాలి. యుద్ధమంటే నాశనమని, యుద్ధమంటే విధ్వంసమనీ, యుద్ధమంటే సర్వ జీవరాశుల మారణహౌమమని, యుద్ధం తర్వాత మిగిలేది స్మశాన వైభవమేనని చెప్పే చైతన్యశీలురు ముందుకు రావాలి. యుద్ధోన్మాదం దేశభక్తి కాదని, రణోన్మత్త ఉత్సాహం దేశభక్తి కాదని తెగేసి చెప్పాలి. యుద్ధానికి కాదు... శాంతి స్థాపనకు సాహసం కావాలి. విశ్వమంతా శాంతి కపోతాలై ఎగరాలి.