సింగపూర్ : సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి విజయం సాధించారు. మాజీ ఉపప్రధానమంత్రి ధర్మన్ షణ్ముగరత్నం శుక్రవారం సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. 66 ఏళ్ల షణ్ముగరత్నం విజయాన్ని ఎన్నికల కమిటీ ధ్రువీకరించింది. 2011 తర్వాత సింగపూర్‌లో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ఇద్దరు చైనా సంతతికి చెందిన అభ్యర్థులను ఓడించి షణ్ముగరత్నం నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2011 నుంచి 2019 వరకు సింగపూర్ ఉప ప్రధానిగా పనిచేసిన షణ్నుగరత్నానికి 70.4శాతం ఓట్లు రాగా.. ఆయన ప్రత్యర్థులు ఎంగ్ కోక్‌సోంగ్, టాన్ కిన్ లియాన్‌లకు వరుసగా 15.7 శాతం, 13.88శాతం ఓట్లు వచ్చినట్టు ఎన్నికల కమిటీ అధికార ప్రతినిధి వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ధర్మన్‌కు సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ అభినందనలు తెలిపారు. సింగపూర్ ప్రస్తుత అధ్యక్షురాలు హలీమా యాకూబ్ పదవీకాలం ఈనెల 13న ముగియనుంది. షణ్ముగరత్నం సింగపూర్‌లో 2011 నుంచి 2019 మధ్యకాలంలో ఆర్థిక, విద్యాశాఖ మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా సేవలందించారు. రాజకీయాల్లోకి రాకముందు ఆర్థికవేత్తగా, పౌర సేవకుడిగా ఉండేవారు.