అనాదిగా ఎన్నో ఆచారాలు మహిళలను తక్కువవారిగా, అపవిత్రులుగా ముద్రవేసి, అణచివేస్తూనే ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా రుతుక్రమం సమయంలో పాటించే నిబంధనలు మరీ జుగుప్సాకరంగా ఉంటాయి. విచారించాల్సిన విషయమేమంటే.. ఆ నియమాలు, కట్టుబాట్లు సంస్కృతిలో భాగమని, ఇటువంటివి వెలుగుచూడడం తమని అవమానించడమేనని కొంతమంది మహిళలు భావించడం. తమిళనాడులోని కొన్ని మారుమూల గ్రామాల్లో రుతుక్రమం సమయంలో పాటిస్తున్న కట్టుబాట్లు మహిళల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తున్నాయో చూద్దాం.
అరియగౌదంపట్టి గ్రామంలో నాయకర్ వీధి ఊరి మధ్యలో నిర్మించిన ఇంటి మెట్లపై ఓ 13 ఏళ్ల బాలిక కూర్చొని ఉంది. ఆ రోజు తన రుతుక్రమం ప్రారంభమైన రోజు. ఐదు రోజుల పాటు తను అక్కడే ఉండాలి. 'విశ్రాంతి గృహం' అని పిలిచే ఆ ఇంటిలో శిథిలావస్థలో ఉన్న మరుగుదొడ్డి, పచ్చగా పాచి పట్టుకుపోయిన నీళ్ల తొట్టె వారి అవసరాలు తీరుస్తున్నాయి. ముగ్గురి వసతికి వీలైన ఆ ఇంట్లో ఒక్కోసారి 8 మంది వరకు తలదాచుకుంటారు. దుమ్ము, ధూళితో బూజు పట్టుకుపోయిన గోడలతో ఉన్న ఆ ఇంటిలో వారంతా ఇరుక్కుని పడుక్కోవాలి. ఆ ఐదు రోజులూ.. ఇంటి నుండి ఎవరో ఒకరు వీరికి ఆహారం తెచ్చిపెడతారు. వీళ్ల దగ్గర ఉన్న ఓ పళ్లెంలో ఆ పదార్థాలను విసిరినట్లు వేస్తారు.
'విశ్రాంతి' అంటే ఇదా ?
తమిళనాడులో చాలా గ్రామాల్లో వ్యవసాయం జీవనాధారం. మహిళలు, పురుషులు సమానంగా కష్టపడితేనే పంట చేతికొస్తుంది. అటువంటి చోట ఐదు రోజులు మహిళలు వ్యవసాయ పనులకు వెళ్లకపోతే.. ఆ ప్రభావం పంట దిగుబడిపై పడుతుంది. దీంతో రుతుక్రమంలో ఉన్నప్పుడు ఇంటిపనులకు మాత్రమే దూరం చేసి, వ్యవసాయ పనులకు మాత్రం అనుమతి ఇస్తారు. 'ఇంటికి వర్తించే కీడు పంటలకు వర్తించదా' అని ప్రశ్నిస్తే- దానికి ఆ ఊరి పెద్దల నుంచి సమాధానం దొరకదు.
నమ్మకల్, మదురై, విరుధ్‌నగర్ జిల్లాల్లో అనేక ప్రదేశాల్లో ఈ ఆచారం పాటిస్తున్నారు. పెంకులతో కప్పబడి, ఏవిధమైన అరలు నిర్మించకుండా నాలుగు గోడలను కలుపుతూ ఒక తలుపు నిర్మాణంతో ఉన్న ఈ ఇళ్లు ఊరి మధ్యలో ఉండడం వల్ల.. ఎవరు, ఎప్పుడు రుతుక్రమంలో ఉన్నారో ఊరందరికీ తెలిసిపోతుంది.
రోడ్డుపై అన్నం తినాలి !
రుతుక్రమంలో ఉన్న కోడలికి, ఆమె అత్త గారు ఇంటి బయట రోడ్డుపై అరటి ఆకులో అన్నం పెట్టడాన్ని గత జులైలో ఓ యూట్యూబర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. అది బాగా వైరల్ అయ్యింది. ఇంట్లోకి ప్రవేశం లేని ఆ మహిళ తప్పనిసరి పరిస్థితుల్లో 'ముట్టువీడు'లో తలదాచుకోవడం, ఆమెకు ఆహారం పెట్టే విషయంలో కుటుంబ సభ్యులు పాటిస్తున్న వైనాన్ని వీడియో తీసి పెట్టడాన్ని గ్రామస్తులు తీవ్రంగా ఖండించారు. 'ఇది మా రహస్యాన్ని బట్టబయలు చేయడమేన'ని ఆ యూట్యూబర్‌పై మండిపడ్డారు. ఫలితంగా కొన్ని రోజులకు ఆ వీడియో తొలగించారు. కోడలికి రోడ్డుపై అన్నం పెట్టిన అత్తను 'ఇది మీకు తగునా.. కోడలిని ఇంత అగౌరపరుస్తారా? మీ కొడుక్కి ఇలాగే రోడ్డుపై అన్నం పెడతారా?' అని ప్రశ్నిస్తే.. 'ఇది మా గ్రామ కట్టుబాటు. నా కొడుకు రోడ్డు మీద తినడానికి ఆడికేమీ రుతుక్రమం రాదు కదా?' అని గట్టిగా ఆమె సమాధానం చెప్పడం కూడా ఆ వీడియోలో కనిపిస్తుంది.
పశువులతో సమానంగా ...
'ఈ ఆచారం మా సాంప్రదాయం. దీన్ని ఆచరించకపోతే మా కుటుంబానికి అరిష్టం. రుతుక్రమం సమయంలో ప్రత్యేక సౌకర్యాలు లేని వాళ్లే ఇక్కడికి వస్తారు. మిగిలిన వారు ఇళ్ల దగ్గరే ఉండిపోతారు. ఈ విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడమెందుకు' అని ఆ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇంట్లోనే ఉండడమంటే ఆ ఇంటి వరండాలోనో.. పశువుల దొడ్డిలోనే ఉండడమని అర్థం. రుతుక్రమంలో ఉంటే ఆ మహిళపై అంత వివక్ష చూపించాలా.. పశువుల పాకలో నివసించాలా.. ఆ జంతువులతో కలసి పడుకోవడం.. తినడమంటే.. ఆ ఐదు రోజులూ.. ఆమె కూడా... ఎంత అమానవీయం ! అని మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
విద్యావంతుల్లో వెసులుబాటు
'30 ఏళ్ల క్రితం వరకు ఈ ఆచారం ఇక్కడ అమలులో ఉంది. గ్రామంలో కొంతమంది పిల్లలు విదేశాల్లో విద్యాభ్యాసం చేశారు. ఉన్నత కొలువుల్లో స్థిరపడ్డారు. విదేశీ సాంప్రదాయంలో రుతుక్రమం పెద్ద విషయంగా పరిగణించక పోవడాన్ని మొదట వ్యతిరేకించినా ఆ తరువాత కాలంలో వారు కూడా ఆ ఆచారాన్ని ద్వేషించారు. క్రమేణా మా గ్రామంలో ఆ నియమాలు తుడిచిపెట్టుకుపోయాయి' అంటున్న ఓ గ్రామం విరుధునగర్ జిల్లాలో ఉంది. అయితే ఈ గ్రామానికి ఆనుకుని ఉన్న కొన్ని గ్రామాల్లో ఉన్నత విద్యావంతులున్నప్పటికీ ఈ ఆచారం కనిపిస్తోంది.
ప్రసవం తరువాత కూడా ...
ప్రసవానంతర సమయంలో కూడా ఇక్కడి మహిళలు ఈ 'ముట్టువీడు'లో నివసిస్తున్నారు. బాలింతతో పాటు నవజాత శిశువు కూడా ఆ అపరిశుభ్ర వాతావరణంలో ఉండడం వారి ఆరోగ్యాలకు ఎంత చేటు చేస్తుంది. అయినా అవేవీ వారికి పెద్ద విషయాలుగా కనిపించడం లేదు. పైగా 'ఈ పద్ధతులు పాటించమని మమ్మల్ని ఎవరూ బలవంతం చేయరు.. స్వచ్ఛందంగా మేమే ఇవి పాటిస్తున్నాం. మా కుటుంబాలు బాగుండాలంటే ఇలా చేయాల్సిందే.. ఈ విషయాన్ని మీడియాలో ప్రచారం చేయడం మా గౌరవాన్ని తగ్గించడమే' అని ఓ గ్రామస్తురాలు అభిప్రాయపడింది.
తప్పనిసరి పరిస్థితుల్లో..
ఇతర ప్రాంతాల నుండి ఈ ఊరికొచ్చిన కోడళ్లకి ఇది తప్పనిసరి వ్యవహారంగా మారిపోయింది. 'పెళ్లయిన తరువాత నాకు మొదటి పీరియడ్ వచ్చినప్పుడు మా అత్త నన్ను 'ముట్టువీడు'కి పంపించింది. ఊరికి దూరంగా విసిరివేసినట్లు ఉన్న ఆ ఇంట్లో ఉండడానికి నాకు చాలా భయమేసింది. మా అమ్మ వాళ్ల ఇంట్లో ఈ ఆచారం లేదు. కానీ ఇక్కడ ఇది పాటించాల్సిందే నని నియమం ఉంది. తప్పడం లేదు' అని కూవలాపురానికి వచ్చిన ఓ కొత్తకోడలు అంటోంది.
స్వచ్ఛందమన్నా, బలవంతంగానైనా ఆచారాల పేరుతో మహిళలను అగౌరపర్చడం ఇంకెన్నాళ్లు.. తమిళనాడు ఒక్కచోటే ఈ ఆచారాలు జరగడం లేదు. నగరాలు, పట్టణాలు, ఉన్నత విద్యావంతులున్న కుటుంబాల్లో సైతం నేటికీ ఈ ఆచారాలు కనిపిస్తున్నాయి. 'రుతుక్రమం ఓ జీవక్రియ' అన్న అవగాహన అందరికీ రావాలి. అప్పుడే సమాజం ముందడుగు వేస్తుంది. 'ద గార్డియన్' పత్రిక నివేదిక ప్రకారం.. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల్లో ఇప్పటికీ రుతుక్రమ రోజుల్లో దూరంగా పెట్టే ఆచారం అమల్లో ఉంది. ఊరికి దూరంగా ఒంటరిగా ఉన్న సందర్భాల్లో మహిళలు అడవి మృగాలకు బలైన సంఘటనలు కూడా ఉన్నాయి. పరిశుభ్రత పాటించకపోవడం వల్ల అనారోగ్య సమస్యలతో మరణించిన సంఘటనలు అనేకం వెలుగు చూశాయి. 2018 నుంచి నేపాల్ ప్రభుత్వం రుతుక్రమ నియ మాలను బలవంతంగా అమలుచేస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టింది. నష్ట పరిహారం, జైలుశిక్ష వంటి శిక్షలు అమలౌ తాయని హెచ్చరించింది. శిక్షలు వేయడంగా కాకపో యినా మన దగ్గరా అలాంటి గ్రామాల్లో తగిన చైతన్యం వచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక అవగా హనా కార్యక్రమాలు చేపట్టాలి.










