Oct 17,2023 09:59
  • పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి : వివిధ సంఘాలు సంయుక్తంగా లేఖ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు, జర్నలిస్టులు నిర్భయంగా పనిచేసేందుకు, జీవించే పరిస్థితులను కల్పించేందుకు జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును వివిధ సంఘాలు సంయుక్తంగా అభ్యర్థించాయి. 'ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభానికి సంకెళ్లు వేసిన చీకటి కాలం దేశంలో నెలకొంది. రహస్యంగా ఇప్పుడు అదే పరిస్థితి అనుభవిస్తున్నారు. జర్నలిస్టులకు వ్యతిరేకంగా క్రూరమైన చట్టాలు ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి. వారిలో ఎక్కువ మంది ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారు' అని లేఖలో పేర్కొన్నాయి. 'ఇటీవల ఇలాంటి కేసుల్లో జర్నలిస్టుల ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌ డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు. జర్నలిస్టులకు నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద జైలుశిక్ష విధిస్తున్నారు. ప్రజాస్వామ్యం మనుగడకు, పురోగమనానికి స్వేచ్ఛా మీడియా అవసరం. దేశంలోని అత్యున్నత రాజ్యాంగ హోదా కలిగి ఉన్న రాష్ట్రపతి పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు జోక్యం చేసుకోవాలి' అని కోరారు. సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు న్యూఢిల్లీ ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఉమెన్స్‌ ప్రెస్‌ కార్ప్‌, ప్రెస్‌ అసోసియేషన్‌, ఢిల్లీ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌, కెయుడబ్ల్యుజె, డిజిపబ్‌, ఫారిన్‌ కరస్పాండెంట్స్‌ క్లబ్‌, వెటరన్‌ జర్నలిస్ట్‌ గ్రూప్‌, ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్లు సంయుక్తంగా లేఖ రాశాయి. న్యూస్‌క్లిక్‌పై కేంద్ర ప్రభుత్వ దాడికి నిరసనగా ప్రెస్‌క్లబ్‌ ఆఫ్‌ ఇండియా (పిసిఐ) నిరసన సభ, ధర్నా నిర్వహించింది. ప్లకార్డులు చేబూని నిరసన హోరెత్తించారు. సీనియర్‌ జర్నలిస్టులు ప్రేమశంకర్‌ ఝా, సతీష్‌ జాకబ్‌, నీనా వ్యాస్‌, సుజాత మధోక్‌, ఎంకె వేణు, పరంజోరు ఠాకుర్తా, కెయుడబ్ల్యుజె ఢిల్లీ యూనిట్‌ కార్యదర్శి ధనసుమోద్‌ మాట్లాడారు.