జెరూసలెం : గత అయిదు రోజులుగా గాజాపై ఇజ్రాయిల్ సాగిస్తున్న భీకర వైమానిక దాడుల్లో వందలాది మంది పౌరులతో బాటు ఏడుగురు పాలస్తీనా జర్నలిస్టులు కూడా మరణించారు. సలామ్ మెమా అనే జర్నలిస్టు, ఆమె కుటుంబం మొత్తం యుద్ధంలో చనిపోయింది. ఇజ్రాయిల్ బాంబు దాడుల్లో ధ్వంసమైన భవనాలను కెమెరాలో బంధించేందుకు జర్నలిస్టు వెళ్తుండగా ఈ దాడి జరిగింది. అణు యుద్ధ విమాన వాహక నౌక యుఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్‌ను అమెరికా ఇజ్రాయిల్‌కు చేరవేసింది. ఈ నౌక ఒకేసారి 70 యుద్ధ విమానాలను అందజేసింది.
గాజాలో పాలస్తీనీయులకు మానవతా సాయం అందించేందుకు ముందుకు రావాలని ఈజిప్టు విదేశాంగ మంత్రి గురువారం తెలిపారు. ఇజ్రాయిల్ అధీనంలోని ఏకైక పవర్ ప్లాంట్ ఇంధన కొరత వల్ల మూత పడింది. దీంతో ఆసుపత్రుల పనులు నిలిచిపోయాయి. ఐరాస నిర్వహిస్తున్న ఆసుపత్రులతో సహా అనేక ఆసుపత్రుల్లో మందులు అయిపోయాయి. కొన్ని ఆసుపత్రులు మాత్రమే రెండు రోజులకు సరిపడా మందులున్నాయి. ఈ స్థితిలో ఇజ్రాయిల్ భూతల దాడులకు సిద్ధమవుతోంది. ఏ క్షణంలోనైనా గాజాలోకి చొరబడేందుకు ఇజ్రాయిలీ సేనలు కాచుక్కూర్చొన్నాయి.