ఇస్లామాబాద్ : పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, నిండుకుంటున్న విదేశీ మారక నిల్వలు, ఆహార సంక్షోభం పాకిస్థాన్‌ను నానాటికీ దిగజారుస్తున్నాయి. ఆఖరికి అక్కడి ప్రజల ప్రధాన ఆహారమైన గోధుమ పిండికి కూడా దేశంలో తీవ్ర కొరత ఏర్పడింది. నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఇప్పుడు ఇంధన లేమి కారణంగా విమానాల సర్వీసులు కూడా ఆగిపోయాయి. తాజాగా పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ 48 జాతీయ, అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది.
ప్రభుత్వ ఖజానా ఖాళీ...!
ఆర్ధిక సంక్షోభం, రాజకీయ అస్థిరతతో పాకిస్థాన్ గత కొంతకాలంగా సతమతమవుతోంది. ప్రభుత్వం ఖజానా ఖాళీ అయిపోవడంతో ప్రభుత్వం-ప్రజలు అవస్థలు పడుతున్నారు. పిఎస్‌ఒ నుంచి ఇంధన సరఫరా కోసం రోజుకు రూ.100 మిలియన్లు అవసరమవుతాయి. అడ్వాన్స్ పేమెట్లు మాత్రమే అని పీఎస్‌ఓ కొత్తగా డిమాండ్ చేయటంతో పిఐఎ చేతులెత్తేసింది. భవిష్యత్తులో మరిన్ని విమానాల రాకపోకలు రద్దయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బకాయిలు చెల్లించలేదని పాకిస్థాన్ స్టేట్ ఆయిల్ నిలిపివేత...!
బకాయిలు చెల్లించని కారణంగా ప్రభుత్వ యాజమాన్యంలోని పాకిస్తాన్ స్టేట్ ఆయిల్ సరఫరాను నిలిపివేసింది. దీంతో పీఐఏకు ఇంధన కొరత ఏర్పడింది. అప్పులు పేరుకుపోవడంతో ప్రైవేటీకరణ దిశగా పిఐఎ ఆలోచిస్తోంది. ఈ దుస్థితి నుంచి బయటపడటానికి రోజూవారి కార్యాచరణకు ప్రభుత్వాన్ని రూ.23 బిలియన్లను అందించాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పిఐఎ ఇటీవల కోరింది. కానీ ఆర్ధిక సంక్షోభంలో ఉన్న ప్రభుత్వం ఇందుకు అంగీకరించలేదు. ఇక గత్యంతరం లేక ఇంధనం చాలకపోవడంతో పిఐఎ పలు విమానాలను రద్దు చేసింది.
పరిమిత ఇంధనమే ఉంది : పిఐఎ ప్రతినిధి
పిఐఎ ప్రతినిధి మాట్లాడుతూ ... రోజువారి విమానాలకు పరిమిత ఇంధనం ఉండటంతో 48 జాతీయ, అంతర్జాతీయ విమానాలను ఆపేశామన్నారు. కొన్ని విమానాల షెడ్యూల్‌ను రీషెడ్యూల్ చేశామని తెలిపారు. 13 దేశీయ విమానాలను, 11 అంతర్జాతీయ విమానాలను రద్దు చేశామని చెప్పారు. 12 విమానాలను రీషెడ్యూల్ చేశామన్నారు. రద్దు చేసిన విమానాలకు సంబంధించిన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎయిర్‌పోర్టుకు వచ్చే ముందే పీఐఏ కస్టమర్ కేర్‌ను సంప్రదించాలని స్పష్టం చేశారు. నేడు కూడా మరో 16 విమానాలను రద్దు చేయడంతోపాటు మరోకొన్ని విమానాలు ఆలస్యం కానున్నాయని వెల్లడించారు.