Oct 08,2023 07:11

         నిత్య జీవితంలో ఆదాయాలు పెరుగుతున్నట్లుగా కనిపించినా... ఖర్చులు అంతకు రెట్టింపవుతున్నాయి. పెద్దపెద్ద షాపింగ్‌ మాల్స్‌ వచ్చి...చిన్న షాపులనే కాదు... చిన్న కుటుంబాలనూ మింగేస్తున్నాయి. డిస్కౌంట్‌ల పేరుతో ఊరిస్తూ...మనసును ప్రలోభపెడుతుంటాయి. అవసరమున్నా లేకున్నా...జేబులో డబ్బులు, మన బడ్జెట్‌ ఎంత? అన్న లెక్కలన్నీ తారుమారైపోతున్నాయి. మనిషి బలహీనతను మాల్స్‌ రూపంలో వున్న తిమింగలం మింగేస్తున్నది. నట్టింట్లో టీవీ, అరచేతిలో స్మార్ట్‌ఫోన్‌ వుంటే చాలు....కార్పొరేట్‌ ప్రపంచంలోని రకరకాల ప్రకటనలు ప్రలోభపెడుతూనే వుంటాయి. డిస్కౌంట్లు, ఇఎంఐలు, క్రెడిట్‌ కార్డులు మన నియంత్రణను పరీక్షిస్తుంటాయి. బైక్‌, కారు, ఇల్లు, బంగారం, ఫ్రిజ్‌, టీవీ... ఇలా ఆర్థిక స్థితిని మించి కొనేయడం, వాటికి ఏళ్ల తరబడి వాయిదాలు కడుతూనే వుంటాం. ఈ పద్ధతే అవసరాలకు, ఆర్థికానికి మధ్య తీవ్రమైన అంతరాన్ని మిగుల్చుతున్నది. ఈ రెండిటి మధ్య తేడాను తెలుసుకోగలిగితే పొదుపు అలవాటు చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, అదే పెద్ద కష్టం.
          ప్రతి ఒక్కరి జీవితంలో అవసరాలు, అత్యవసరాలు, ఆనందాలు వుంటాయి. అవసరం వేరు, ఆర్భాటం వేరు. డబ్బే జీవితం కాదు. కానీ, ప్రతి అవసరానికీ, ఆనందాలకీ, సరదాలకీ డబ్బు కావాల్సిందే. అదే సందర్భంలో నిత్యం పెరిగే ధరలు, నిలకడలేని ఉద్యోగాలు, అనుకోని అనారోగ్యాలు-అన్నీ మనిషిని ఇబ్బంది పెట్టేవే. దేనికి ఖర్చు చేయాలి, దేనికి అవసరంలేదు అనే నియంత్రణ మనిషికి అవసరం. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పొదుపు చేయడం ప్రారంభిస్తే...జీవితంలో ఆర్థిక లోటు ఏర్పడదు. అయితే- భారతీయుల్లో తక్కువ పొదుపు...ఎక్కువ రుణాలు పెరిగాయని, 2022-23లో నికర గృహ ఆర్థిక పొదుపు జిడిపిలో 5.1 శాతానికి పడిపోయిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది. కరోనా తర్వాత బ్యాంకుల దూకుడు రుణ వ్యూహాల కారణంగా 30 కోట్లకు పైగా భారతీయ కుటుంబాల రుణ స్థాయిలు పెరిగాయి. 2021-22 చివరి నాటికి రూ.1.48 లక్షల కోట్లున్న క్రెడిట్‌ కార్డుల బకాయిలు 2022-23 నాటికి రూ.1.94 లక్షల కోట్లకు పెరిగాయి. ఆస్తుల స్థాయిలు పడిపోవడంతో... ఆర్థిక భారాలు పెరగడం అనేది పెరుగుతున్న అసమానతలకు సంకేతం. 'నీ మనసుని, శరీరాన్ని ఆరోగ్యంగా అట్టేపెట్టని ఖర్చు ఒక్క దమ్మిడీ చెయ్యకు' అంటాడు కొడవటిగంటి. ఇది వ్యక్తులకే కాదు....పాలకులకు, ప్రభుత్వాలకూ వర్తిస్తుంది. నయా ఉదారవాద ఆర్థిక విధానాల పుణ్యమాని... ప్రపంచంలో వినిమయదారీ సంస్కృతి విపరీతంగా పెరిగింది. చేతిలో నయాపైసా లేకపోయినా, మధ్యతరగతి జీవితాలను ఆశల పల్లకిలో విహరింపజేస్తూ... క్రెడిట్‌ కార్డులు, ఇఎంఐ ల రూపంలో వున్నదంతా ఊడ్చేస్తున్నారు. 'అప్పు తెచ్చి వేసిన మిద్దెల్లో/ కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది' అంటాడు చెరబండరాజు. ఇలాంటి ప్రతి సందర్భాన్నుంచీ బయటపడేసేదే పొదుపు. అలాంటి పొదుపు పట్ల ప్రజల్లో స్పృహ కలిగించడం కోసం ప్రతి ఏడాది అక్టోబర్‌ 12న 'జాతీయ పొదుపు దినోత్సవం' జరుపుకుంటున్నారు.
       మన ఆర్థిక అలవాట్లను పునరాలోచించుకోవడానికి, వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి...సురక్షితమైన, సుసంపన్నమైన భవిష్యత్‌ కోసం పొదుపు పాటించడం అవసరం. పొదుపు కేవలం వ్యక్తిగత ప్రయోజనమే కాదు... సామాజిక బాధ్యత అని ఈ రోజు గుర్తు చేస్తుంది. పొదుపు అలవాటు ప్రారంభంలో కొంత కష్టమనిపించినా... తినగ తినగ వేము తీయనుండు అన్నట్టుగా తర్వాత్తర్వాత సులభమవుతుంది. 'ఇదమే వహి పాండిత్యం/ ఇదమే వహి శూరత/ ఇదమే వహి వైదగ్ధ్యం/ ఆదాదల్పతరో వ్యయ:' అన్నారు. ఆదాయం కన్నా చాలా తక్కువ ఖర్చుపెట్టడమే...ఏ మనిషి విజ్ఞానానికైనా, శూరత్వానికైనా, నేర్పుకైనా నిదర్శనం-అని ఈ శ్లోకం చెబుతుంది. పొదుపు ఒక్క డబ్బు విషయంలోనే కాదు-కాలం, వనరులు, నీరు, చెట్టు, విద్యుత్‌, ఆహారం వంటి అన్నిటిలోనూ అవసరమే. డబ్బుతో పాటు ప్రకృతి వనరులు ఏ ఒక్కటి వృధా అయినా... దాని ఫలితం భవిష్యత్తరాలు ఎదుర్కోవాల్సి వుంటుంది. పొదుపు అనే దివిటీని చేపట్టి... ఆర్థికంగా సుస్థిరమైన భవిష్యత్తు వైపునకు అడుగులు వేద్దాం.