Oct 09,2023 07:56

రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారి రచనా స్వర్ణోత్సవం సందర్భంగా ఆయన స్నేహితులు, అభిమానులు, విద్యార్థులు కలిసి అభినందన సంచిక తీసుకురావడం సమంజసం, సముచితం. తన రచనలతో చైతన్య దీపాలు వెలిగించిన ఆయన కృషికి యాభై ఏళ్ళు అని పేరు పెట్టడం భావస్ఫోరకం. ఈ సంతోష సందర్భంలో చిరకాల మిత్రులు, విమర్శన రంగంలో ఉద్దండులు అయిన రాచపాళెంకు మన:పూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ఆయన నెప్పుడూ ఎస్‌వి రంగారావు గారిలా ఉంటారని నేను అభివర్ణిస్తుంటాను. ఎందుకంటే ఇంటిపేరు లోని గాంభీర్యం రాచపాళెంలో ఉట్టి పడుతుంటుంది. ఎప్పుడో పిహెచ్‌.డి. చేయడమే గాక తన దగ్గర 25 మందికి డాక్టరేట్‌, 20 మందికి ఎం.ఫిల్‌ సాధనలో మార్గదర్శిగా వ్యవహరించినా రాచపాళెం అచ్చమైన తెలుగు పల్లెటూరి ఇంటిపెద్దలా అగుపిస్తారు. సాహిత్యంలో ఎంత ఎదిగినా సౌజన్యం, సంయమనం, సమతుల్యతల మేళవింపులా గోచరిస్తారు. ఒక నిండైన నవ్వు, హాయిగా పలకరింపు, వన్నె తగ్గని మన్నన మర్యాద ఇవి రాచపాళెం సహజ గుణాలు.
           విశ్వవిద్యాలయాల్లో దశాబ్దాల పాటు బోధన, పట్టుదలతో పరిశోధన ప్రస్థానంలో ఎన్ని శిఖరాలు అధిరోహించినా రాచపాళెం జీవితం నిత్యశోధనగా సాగే తీరు ప్రత్యక్షంగా చాలాసార్లు చూడగలిగాను. పరిశోధన పద్ధతులు పుస్తకం రాసిన ఆయన నిజంగానే ఏ పదం, ఏ పదార్థం, ఏ పద్ధతి వీటిపై కూలంకషమైన అవగాహన కలిగి పరిపూర్ణమైన ఫలితాల కోసం తపన పడే దీక్షాదక్షుడు. సమగ్రత, స్పష్టత లేకుండా అడుగు వేయరు. ఇంత సాహిత్య కషి తర్వాత కూడా జిజ్ఞాస తగ్గక పోవడం, జ్ఞానాన్వేషణ ఆగకపోవడం రాచపాళెం వంటి కొందరిలోనే చూస్తాం. అదేం మనకు తెలియనిదా అనే ఉపేక్షాభావన ఆయనలో ఎన్నడూ చూడలేదు. తెలిసిందేదైనా చెప్పేటప్పుడు కూడా నమ్రతగానే చెబుతారు తప్ప జ్ఞాన ప్రదర్శనా కాంక్ష సుతరామూ వుండదు. మిత్రమా! అంటూ ఆయన కంఠం వినిపించిందంటే ఏదైనా రాసి పెట్టమని అడగడమో లేదంటే ఫలానా పాటలో చరణం, తర్వాతి పదం అడగడమో, కాదంటే ఏ వ్యాసంలోనో నేను ఉపయోగించిన పదం, పదబంధం గురించి మెచ్చుకోవడం, కాదంటే ఎందుకలా రాశానని తెలుసుకోవడం చాలాసార్లు అనుభవం. నేను అందరిపైనా ఏవో పదాలతో చమత్కారాలు చేస్తుంటే, ఆయన తెలకపల్లి 'తెలుగుపల్లి' అంటూ నాకూ ఒకటి తగిలించారు. టీవీ చర్చల్లో భిన్నమైంది ఏదైనా వచ్చిందంటే తప్పక స్పందిస్తారు. ఆ విధమైన నిరంతర పరిశీలన తన స్వంతం.
            శ్రీశ్రీ రారాను క్రూరమైన విమర్శకుడు అన్నారు. అందుకు పూర్తి భిన్నంగా రాచపాళెం 'సున్నితమైన విమర్శకుడు' అని ఒకసారి రాశాను. వ్యక్తిగా కొంత మొహమాటస్తుడైనా విలువలలో సిద్ధాంతాల్లో రాజీ పడకుండా ఏది ఎంతవరకో అంతే చెప్పడం ఆయన నైజం. చాలాసార్లు విమర్శకులు పాత విషయాల చుట్టూనే పరిభ్రమిస్తూ చరిత్రకారుల్లా మారిపోతుంటారు. నచ్చినవాటి చుట్టూనే తిరుగుతుంటారు. ఈయన మాత్రం నిత్య నూతనంగానూ విస్తృత వైవిధ్యం చూడడానికి ప్రాధాన్యతనిస్తారు. ఎవరో పెద్దవాళ్ళ గురించి చెప్పడం దగ్గరే ఆగిపోరు. పూస్తున్న పూలను, ప్రవహిస్తున్న నీటినీ చూపడానికి ప్రయత్నిస్తారు. అందుకే కొత్త గొంతులు తన ద్వారా ఆవిష్కరణ చేస్తారు. ఎప్పుడూ యువతను, విద్యార్థులనూ, అందులోనూ అణగారిన వర్గాల నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ప్రోత్సహించేందుకు ఆసక్తి చూపుతారు. రాయలసీమ గురించిన ప్రత్యేక అధ్యయనం, అనుశీలన సరేసరి. అభ్యుదయ సాహిత్యం మౌలిక విలువలను ఎన్నడూ వదలి పెట్టని విమర్శకులలో రాచపాళెం అగ్రగణ్యులు. ఆ విధంగా ఆయన తెలుగు సాహిత్య విమర్శలో ఒక ఖాళీ రాకుండా చేశారు. ఎక్కడెక్కడి ఎప్పటెప్పటి మంచి రచనలు సేకరించి మళ్ళీ అందించాలని తాపత్రయపడుతుంటారాయన. సాంస్కృతిక రంగంలో పరిణా మాలు, సామాజిక శక్తుల చలనాలు కూడా ఆయనకు అమితాసక్తి. తను విమర్శకుడైనా ఇతర విమర్శకులను కూడా అర్థం చేసుకోవడానికి, అందరికీ పరిచయం చేయడానికి ఆరాటపడటం ఆయనలోని వాస్తవికతకు, సహదయతకూ అద్దం పడుతుంది. భాషా ప్రయోగాలు ఉచ్ఛారణల్లో భిన్నత్వాన్ని, రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ మాండలికాలనూ ఎంతో లోతుగా అర్థం చేసుకోవడానికి ఎంతో శ్రద్ధ చూపుతారు.
             శ్రీశ్రీ సంప్రదాయ కవిత్వం నుంచి సామ్యవాదం వైపు వచ్చినట్టే, రాచపాళెం కూడా ప్రాచీన సాహిత్య విమర్శ నుంచి ప్రజాసాహిత్య పరంపరలోకి వచ్చారు. ఇరవై యేళ్ళ కిందట ప్రస్థానం మలి సంచిక కోసం నేను హరి పురుషోత్తమరావుతో కలసి తనను ఒకసారి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినపుడు ఈ విషయం సూటిగా చెప్పడం బాగా నచ్చింది. మేము తనకోసం వెళ్లడంపై ఆయన ఇప్పటికీ నొచ్చుకుంటూ వుంటారు. కానీ నాకు ఇష్టమైన తొలి ముఖాముఖి అది. 'నవ్య సంప్రదాయవాదం, ఆధునికాంతర వాదం రెండూ పునాదులు లేనివే' అని ఆ రోజు ఆయన చెప్పిన మాట నాకు చాలా నచ్చింది. అదే శీర్షికగా ఇచ్చాము. అనంతపురం, కర్నూలు హైదరాబాద్‌, ఖమ్మం, విజజవాడ, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం, బెంగళూరు, న్యూఢిల్లీ... ఒకటేమిటి? చాలా చోట్ల ప్రసంగాలు, సాహిత్య శాలలు, జనకవనాలు సంతృప్తిగా నిర్వహించడంలో తోడు నిలిచారు. విశాలాంధ్ర, ప్రజాశక్తి ప్రచురణ సంస్థలు రెండింటిలో సంపాదక వర్గాల్లో కీలకపాత్ర నిర్వహించిన గౌరవం ఆయనకే దక్కిందేమో. అరసం అధ్యక్షుడిగా వున్నా, సాహితీ స్రవంతి సన్నిహితుల్లో ప్రథములుగా వుంటారు. ఇదంతా తన విశాల ప్రజాతంత్ర స్ఫూర్తి ఫలితమే. రాచపాళెం సతీమణి శ్రీమతి లక్ష్మీకాంతమ్మ గారి ఆదరణ, ఆతిథ్యం ఆయన మిత్రులందరికీ పరిచయం. ఆయన కుటుంబ సభ్యులు కూడా తన కృషికి సదా తోడు నిలవడం ఆనందదాయకం. మా విస్తృత కుటుంబానికి ఆయన సుపరిచితులు. మా సుదీర్ఘ స్నేహంలో చాలా విషయాలు గుర్తుకు వస్తుంటాయి.
          కాలక్రమంలో ఎవరిలో ఏ మార్పులు వచ్చినా, ప్రతీఘాత శక్తులు ప్రత్యక్ష దాడి చేసినా, రాచపాళెం మాత్రం నమ్మిన విలువలకూ విశ్వాసాలకే నిబద్ధులై అచంచలంగా నిలబడ్డారు. ఆరోగ్యపరమైన సమస్యలున్నా వాటిపై పోరాడుతూనే ఆయన అభ్యుదయ శక్తులకు కొండంత అండగా నిలిచారు. ఈ యాభై ఏళ్లలో రాచపాళెం చేసిన అత్యధిక రచనలు తులనాత్మకం, మార్గనిర్దేశకం, విషయ సంపన్నం. మరిన్ని దశాబ్దాలు ఆయన ఆరోగ్యం కాపాడుకుంటూ విలక్షణ కృషి సాగాలని, తన కలంతో, గళంతో ప్రగతి ప్రస్థానం సాగించాలని కోరుకుంటున్నాను.
(ఈనెల 14న అనంతపురం ప్రభుత్వ కళాశాలలో రాచపాళెం అభినందన సంచిక 'విమర్శా పునర్నవం' ఆవిష్కరణ, రోజంతా సాహిత్య కార్యక్రమాలు జరుగుతాయి.)
- తెలకపల్లి రవి