Sep 12,2023 09:52
  • వర్షాధార పంటలకు ప్రోత్సాహం కరువు

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : నాగార్జున సాగర్‌ ఆయకట్టు పరిధిలో సేద్యం చేసేందుకు రైతులు అనేక ఇబ్బందులను చవిచూస్తున్నారు. సాగర్‌ జలాశయంలో నీటి నిల్వ పెరగకపోవడంతో వారిలో అయోమయం నెలకొంది. సాగర్‌ ఆయకట్టు పరిధిలో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో కుడి కాలువ కింద 11 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. ఇందులో సుమారు రెండు లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. ఈ ఏడాది వరి సాగుకు అనుమతి లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని మంత్రి అంబటి రాంబాబు ఇటీవల గుంటూరులో రైతులకు సూచించారు. అయితే, ఆయకట్టు పరిధిలో వరి సాగు మాగాణి భూముల్లో వరి తప్ప, ఇతర పంటలు వేసే అవకాశం లేదని రైతులు చెబుతున్నారు. సాగర్‌ ఆయకట్టులో ఈ ఏడాది ఇప్పటి వరకు 12,300 ఎకరాల్లో మాత్రమే వరి సాగులో ఉంది. మొత్తం వరి విస్తీర్ణంలో ఆరు శాతం భూముల్లోనే నాట్లు వేశారు. ఇవి కూడా ఎక్కువగా వ్యవసాయ బోర్ల కిందే ఉన్నాయి. ఈ దృష్ట్యా ఖరీఫ్‌లో ఏ పంటలు వేయాలి? అక్టోబరు, నవంబరులో తుపాన్లు వస్తే ఈ పంటల పరిస్థితి ఏమిటి? అని రైతులు మదన పడుతున్నారు. మరోవైపు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెబుతున్న ప్రభుత్వం ఇంతవరకూ ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రకటించలేదు. సబ్సిడీపై విత్తనాలు, ఎరువుల సరఫరాపై ఎటువంటి ఆదేశాలూ రాలేదని అధికారులు చెబుతున్నారు. సహజంగా వరి తరువాత రెండో పంటగా జొన్న, మొక్కజొన్న వేస్తారు. ఇందుకు మరికొంత సమయం ఉందని, రబీలోనే వీటిని సాగు చేస్తామని గురజాల ప్రాంత రైతులు తెలిపారు. సాగర్‌ ఆయకట్టులో ఈ ఏడాది మిర్చి సాగు కూడా సంక్షోభంలో చిక్కుకుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 60 వేల ఎకరాల్లో మాత్రమే వేశారు. నవంబరు తరువాత మిర్చికి తప్పనిసరిగా రెండుమూడు తడులకు నీరు అవసరం. సాగర్‌ నుంచి నీరు రాకపోతే మిర్చి దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. సాగర్‌ నుంచి నీరు రాకపోవడం, వర్షాలు ఆశాజనకంగా లేకపోవడంతో సాగు తీవ్ర జాప్యం జరుగుతోంది. సెప్టెంబరు 11 దాటినా ఇంకా 40 శాతం కూడా సాగు కాలేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 4.80 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకూ 1.80 లక్షల ఎకరాల్లోనే మాత్రమే సాగులో ఉంది. ప్రకాశం జిల్లాలో 85 వేల ఎకరాల్లో పత్తి సాగు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 35 వేల ఎకరాల్లోనే మాత్రమే వేశారు. పత్తి సాగు గడువు దాదాపు ముగిసిందని, ఈ పరిస్థితుల్లో అపరాలు తప్ప మిగతా ఏ పంటలూ వేయలేరని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఎన్‌.వెంకటేశ్వర్లు తెలిపారు. ఖరీఫ్‌ సీజన్‌ మరో 20 రోజుల్లో ముగుస్తున్నా ఇంతవరకూ ఏ పంట సాగు కూడా 40 శాతం చేరలేదు. గత రెండు నెలలుగా జలాశయాల్లో నీటి నిల్వలు పెరగలేదు. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215.80 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 91.41 టిఎంసిలు మాత్రమే నిల్వ ఉన్నాయి. సాగర్‌ జలాశయంలో గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 312.04 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 157.61 టిఎంసి నీరు నిల్వ ఉంది. పులిచింతలలో గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 45.77 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 26.98 టిఎంసిలు మాత్రమే ఉన్నాయి.