ప్రజాశక్తి-తిరుపతి : పరిశ్రమలలో భద్రత ప్రమాణాలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డి.ఐ.ఈ.పి.సి). సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి ఉపాధి కార్యక్రమం (పి.ఎం.ఈ.జి.పి.) క్రింద కే.వి.ఐ.సి.లను సమీక్షిస్తూ లక్ష్య సాధనలో పురోగతి మెరుగుపడాలని, ఎల్.డి.ఎం. వాటికి అనుబంధ బ్యాంకులు లోన్లు ఇచ్చేలా సత్వరమే గ్రౌండింగ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సింగిల్ డెస్క్ విధానంలో జిల్లా ఏర్పడిన నాటి నుండి 541 పరిశ్రమలకు గాను 514 అనుమతులు ఇచ్చామని మరో 16 పరిశీలనలో ఉన్నాయని అన్నారు. పరిశ్రమల పరిశీలన కమిటీకి అందిన మేరకు 51 పరిశ్రమలకు ప్రోత్సాహకాలు రూ.5.12 కోట్లు అందించడానికి నేడు ఆమోదం తెలిపారు. పెట్టుబడి సబ్సిడీ 30, విద్యుత్ సబ్సిడీ 14, వడ్డీ రాయితీ 2, స్టాంప్ డ్యూటీ 1, ల్యాండ్ కాస్ట్ 1, సేల్స్ టాక్స్ 3 యూనిట్లకు ఆమోదించారు. క్లస్టర్ అభివద్ధి కార్యక్రమం ఏర్పేడు మండలం మధవమాల కింద వుడ్ కార్వింగ్ క్లస్టర్, కాపర్ వేజెల్స్ క్లస్టర్ ఎర్రమరెడ్డి పాలెం, రేణిగుంట మండలం, వెంకటగిరి శారీ ప్రింటింగ్ మరియు డైయింగ్ క్లస్టర్, నారాయణవనం పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు చేపట్టిన చర్యల పురోగతిపై సమీక్షించారు. తిరుపతి జిల్లా నుండి పరిశ్రమల ఉత్పత్తుల ఎగుమతులు జనవరి2023 నాటికి దాదాపుగా రూ. 14176 కోట్లుగా ఉందని వివరించారు. జిల్లాలో పరిశ్రమలు భద్రత ప్రమాణాలు అమలు చేయాలని, ప్రమాదాల నివారణకు తరచూ సంబందిత అధికారులు సేఫ్టీ మెజర్మెంట్ పై అవగాహన కల్పించి తప్పని సరిగా అమలు చేసేలా చూడాలని ఆదేశించారు. డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వివరిస్తూ 35 పరిశ్రమలు తనిఖీ చేపట్టడం జరిగిందనీ తెలిపారు. పరిశ్రమలకు సంబందించిన అనుమతులు వివిధ శాఖల అధికారుల వద్ద ఉన్న పెండింగ్ అంశాలు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. తిరుపతి, నాయుడుపేట ఏ పి ఐ ఐ సి కి సంబంధించి మొత్తం 2 పరిశ్రమల స్థాపనకు గల కాలపరిమితిని పొడిగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి ప్రతాప్ రెడ్డి, జోనల్ మేనేజర్ ఏపిఐఐసి తిరుపతి సుహానా సోని, లీడ్ బ్యాంకు మేనేజర్ సుభాష్, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామ కష్ణ రెడ్డి, జిల్లా ఫైర్ ఆఫీసర్ రమణయ్య, కాలుష్య నియంత్రణ మండలి ఈ ఈ నరేంద్ర, ఉప కార్మిక లేబర్ కమిషనర్ బాలు నాయక్ వివిధ పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.










