Nov 03,2023 07:10

తాజాగా నరేంద్ర మోడీ సర్కార్‌ అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాలలో భాగంగా అక్కడ తినటానికి తిరస్కరించే కోడి కాళ్లను మన దేశం దిగుమతి చేసుకొనేందుకు, భారీగా పన్ను తగ్గించేందుకు అంగీకరించింది. అమెరికా మోజులో ఉన్న నరేంద్ర మోడీకి అక్కడి కోడి కాళ్లు, ఉత్పత్తిదారులు, వారి లాభాలు తప్ప భారతీయ కోడి మాంసం, దాని ఉత్పత్తి, మార్కెటింగ్‌లో భాగస్వాములయ్యే లక్షల మంది రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు గుర్తుకు రాలేదు. నిత్యం పారాయణం చేసే దేశభక్తి, స్వప్రయోజనాలను తుంగలో తొక్కారా లేక విశ్వగురువుగా నీరాజనాలందుకొనేందుకు అమెరికాకు దాసోహం అన్నారా ?

         ఇటీవల మన ప్రధాని నరేంద్ర మోడీ 106వ మన్‌ కీ బాత్‌ సుభాషితాల్లో 'స్థానిక వస్తువులనే కొనండి' అని మరోసారి పునరుద్ఘాటించారు. ఆ మాటలు విన్న తరువాత నీతులు ఇతరులకు చెప్పడానికేనా అన్న సందేహం రాకమానదు. ప్రపంచంలో కోడి మాంసం ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల్లో ఎఫ్‌ఏఓ సంస్థ 2021 వివరాల ప్రకారం భారత్‌ (36,70,156 టన్నులతో) ఆరవ స్థానంలో ఉంది. అమెరికా (2,06,52,971 టన్నులతో) మొదటి స్థానంలోను, చైనా (1,47,00,000), బ్రెజిల్‌ (1,46,36,478), రష్యా (46,17,338), ఇండోనేషియా (38,44,346 టన్నుల ఉత్పత్తితో) తర్వాతి నాలుగు స్థానాల్లోను వున్నాయి. తొలి పది స్థానాల్లో మన తరువాత మెక్సికో, జపాన్‌, అర్జెంటీనా, టర్కీ ఉన్నాయి. చైనా, మన దేశం జనాభాలో ఒకే విధంగా ఉన్నప్పటికీ జనాభా కొనుగోలు శక్తి ఎక్కువ గనుక చైనా ఇంకా దిగుమతి చేసుకుంటోంది. మన దగ్గర ఉత్పత్తి అవుతున్న కోడి మాంసం, గుడ్లనే పూర్తిగా విని యోగించలేని స్థితిలో ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. 2014-2019 సంవత్సరాల్లో తలసరి సగటు కోడి మాంస వినియోగం చైనాలో 12.1 నుంచి 14.9 కిలోలకు పెరగ్గా మన దేశంలో 2.49 నుంచి 3.17 కిలోలకు పెరిగింది. పాకిస్తాన్‌లో 5.11 నుంచి 6.8 కిలోలకు పెరిగింది. ప్రపంచంలో 2021లో బహమాస్‌ 70.2 కిలోలతో ప్రథమ స్థానంలో ఉంది. తాజాగా నరేంద్ర మోడీ సర్కార్‌ అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాలలో భాగంగా అక్కడ తినటానికి తిరస్కరించే కోడి కాళ్లను మన దేశం దిగుమతి చేసుకొనేందుకు, భారీగా పన్ను తగ్గించేందుకు అంగీకరించింది. అమెరికా మోజులో ఉన్న నరేంద్ర మోడీకి అక్కడి కోడి కాళ్లు, ఉత్పత్తిదారులు, వారి లాభాలు తప్ప భారతీయ కోడి మాంసం, దాని ఉత్పత్తి, మార్కెటింగ్‌లో భాగస్వాములయ్యే లక్షల మంది రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు గుర్తుకు రాలేదు. నిత్యం పారాయణం చేసే దేశభక్తి, స్వప్రయోజనాలను తుంగలో తొక్కారా లేక విశ్వగురువుగా నీరాజనాలందుకొనేందుకు అమెరికాకు దాసోహం అన్నారా? ఏడు సంవత్సరాల క్రితం మన కోళ్ల పరిశ్రమ మార్కెట్‌ విలువ రూ.యాభై వేల కోట్లు, 2022లో రూ.1,90,530 కోట్లకు పెరిగింది, 2028 నాటికి రూ.3,40,780 కోట్లకు చేరుతుందని అంచనా. లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద దెబ్బ అని భావిస్తున్నారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే కోడి మాంసం, ఇతర కొన్ని దిగుమ తుల మీద భారీగా పన్నుల తగ్గింపును అడ్డుకొ నేందుకు కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు ప్రకటిం చారు. కోర్టులో ఎవరు ఏం వాదిస్తారో చెప్పలేం. ప్రభుత్వ విధాన నిర్ణయాలను సాధారణంగా కోర్టులు సమర్ధిస్తాయి.
          తమ కోళ్ల ఉత్పత్తులను మన దేశంలో కుమ్మరించేందుకు అమెరికా చాలా కాలం నుంచి చూస్తోంది. బెదిరింపు, ఒత్తిడి వంటి అనేక రూపాల్లో అది ప్రయత్నించి చివరికి అనుకున్నది సాధించింది. 2007లో మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్న నాటి యుపిఏ ప్రభుత్వం అమెరికా కోళ్ల ఉత్పత్తులపై నిషేధం విధించింది. అది చెల్లదంటూ అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థలో కేసు దాఖలు చేసింది. అమెరికా తన కోళ్ల ఉత్పత్తుల్లో 15 నుంచి 20 శాతం వరకు ఎగుమతులు చేస్తున్నది. 2014లో అమెరికా కేసు గెలిచింది. అధికారానికి వచ్చిన తొలి రోజులు గనుక మోడీ సర్కార్‌ ఆ తీర్పును అమలు చేసేందుకు భయపడింది. ప్రపంచ వాణిజ్య సంస్థ ద్వారా భారత్‌ మీద ఆంక్షలను విధింపచేయిస్తామని అమెరికా బెదిరించటంతో కేంద్ర ప్రభుత్వం చికెన్‌లెగ్స్‌ దిగుమతులకు అనుమతిస్తున్నట్లు 2017లో తెలిపింది. నిజానికి మన దేశంలో ఉత్పత్తి అవుతున్న చికెన్‌ మాంసం, గుడ్లు అవసరాలకు మించి ఉండటంతో 2016-17 లోనే రూ.532 కోట్ల మేరకు వివిధ దేశాలకు ఎగుమతి చేశాము. నరేంద్ర మోడీ రెండవసారి విజయం సాధించిన తరువాత నాటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఒకవైపు మోడీని పొగడ్తలు, ఆలింగనాలతో ముంచెత్తుతూనే మరోవైపు మరింత ఒత్తిడి పెంచాడు. అప్పటి వరకు మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి చేస్తున్న వస్తువుల మీద జిపిఎస్‌ పేరుతో 600 కోట్ల డాలర్ల మేర ఇస్తున్న దిగుమతి పన్ను రాయితీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. దానికి ప్రతిగా మన దేశం కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న యాపిల్స్‌ వంటి 28 రకాల వస్తువులపై దిగుమతి పన్ను పెంచింది. మన మార్కెట్‌ను మరింతగా తెరవాలని డిమాండ్‌ చేస్తున్న అమెరికా ఇంతవరకు జిపిఎస్‌ను పునరుద్ధరించలేదు. ట్రంప్‌ పోయి బైడెన్‌ వచ్చినా జరిగిందేమీ లేదు గానీ మన దేశం మాత్రం అమెరికా వస్తువుల మీద విధించిన పన్నులను మోడీ సర్కార్‌ తాజాగా తగ్గించింది. అమెరికా-చైనా వాణిజ్య పోరుతో మన దేశం లబ్ధి పొందవచ్చని కొందరు ఆశించారు. అది కార్యరూపం దాల్చలేదు. తొలి రోజుల్లో అమెరికా మీద మోడీ సర్కార్‌ చూపిన పరిమిత ప్రతిఘటన తరువాత నీరుగారింది. ఇప్పుడు పూర్తిగా లొంగిపోయింది. నిజానికి నరేంద్ర మోడీ జూన్‌ నెలలో అమెరికా వెళ్లినపుడే పన్నుల తగ్గింపు నిర్ణయం తీసుకున్నారు, సెప్టెంబరులో వెల్లడిం చారు.
కోళ్ల పరిశ్రమలో మార్కెట్‌ను మరింత తెరిచారు. రైతాంగ స్పందన చూసిన తరువాత అమెరికా, ఐరోపా, ఇతర దేశాల నుంచి పాల ఉత్పత్తులను అనుమతించి పాడి పరిశ్రమకూ మంగళం పాడేందుకు చూస్తున్నారు. అన్నీ ఒకేసారి చేస్తే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుంది గనుక దశలవారీ నిర్ణయాలు తీసుకుంటారు. మన దేశంలో పాల పదార్ధాల ధరల్లో సగానికి దిగుమతి చేసుకున్న వాటిని విక్రయిస్తారని గతంలోనే అనేక మంది చెప్పారు. 2020లో మన దేశంలో పాల పొడి ధర కిలో రూ.130 నుంచి 150 వరకు ఉండగా 30 శాతం దిగుమతి పన్నుతో సహా అమెరికా నుంచి రూ.70కే దిగుమతి చేసుకోవచ్చని తేలింది. ఇప్పుడు కూడా ధరల్లో మార్పులు ఉండవచ్చు తప్ప విదేశాలు ఇచ్చే సబ్సిడీలు భారీ ఎత్తున ఉంటాయి. చైనాతో అమెరికా 2018లో ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అందువలన అమెరికన్లు తమ వస్తువులకు కొత్త మార్కెట్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
           అమెరికా ఒత్తిడిని అడ్డుకొనేందుకు మనసుండాలేగానీ మార్గం దొరక్కపోదు. గతంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం అమెరికాలో వ్యాపించిన బర్డ్‌ ఫ్లూను పేర్కొంటూ కోళ్ల ఉత్పత్తుల దిగుమతులను నిషేధించింది. నరేంద్ర మోడీ ఆంక్షలను, దిగుమతి పన్నులను సడలిస్తున్న సమయంలో అమెరికాలోని వాణిజ్య పౌల్ట్రీ ఫారాల్లో ఫ్లూ కనిపించింది. 2022 నుంచి ఇప్పటి వరకు ఈ వ్యాధికి అక్కడ 5.88 కోట్ల కోళ్లు, టర్కీ కోళ్లు మరణించినట్లు 2023 అక్టోబరు పదవ తేదీన రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కొన్నది. అమెరికాలో అతి పెద్ద గుడ్ల ఉత్పత్తి సంస్థ కాల్‌ మైన్‌ ఫుడ్స్‌ విక్రయించే గుడ్ల ధర గత ఏడాది కాలంలో 48 శాతం పడిపోయింది. సెప్టెంబరు రెండవ తేదీ నాటికి అంతకు ముందు నాలుగు నెలల్లో అమ్మకాలు 30 శాతం పడిపోయినట్లు పేర్కొన్నది. బర్డ్‌ ఫ్లూ మనుషుల్లో కూడా సులభంగా వ్యాప్తి చెందవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్ధ, ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ కూడా జులై నెలలో హెచ్చరికలు జారీచేశాయి. 2022లో 67 దేశాల్లో వ్యాధి కారణంగా 13 కోట్ల కోళ్లను వధించటం లేదా మరణించినట్లు లెక్కలు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు మరో 14 దేశాల్లో వ్యాధి కనిపించింది. అందువలన ఈ కారణంగా కూడా అమెరికా ఉత్పత్తులను అడ్డుకోవచ్చు.
          భారీ మొత్తాలు సబ్సిడీ ఇస్తున్న అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న చికెన్‌ లెగ్స్‌ మన దేశంలో ప్రస్తుతం ఉన్న ధరల కంటే తక్కువకే దొరుకుతాయని, అది మన పరిశ్రమకు తీరని దెబ్బ అని సంయుక్త కిసాన్‌ మోర్చా హెచ్చరించింది. అమెరికాలో చికెన్స్‌ లెగ్స్‌ ఉత్పాదన ఖర్చు టన్నుకు 700 నుంచి 800 డాలర్లు ఉంటుందని, వంద శాతం పన్ను విధిస్తే 1,500 నుంచి 1,600 డాలర్లకు దిగుమతి చేసుకోవచ్చని, మన దేశంలో టన్ను ఉత్పత్తి ఖర్చు 1,800 డాలర్లుగా ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నది. అదే ఐదు, పది శాతం పన్ను మాత్రమే విధిస్తే ఎంత చౌకగా మన మార్కెట్‌ను ముంచెత్తుతారో ఊహించుకోవాల్సిందే.
- సత్య