Sep 27,2023 16:48
  •  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి
  •  హెల్మెట్‌ లేకపోయినా, సెల్‌ఫోన్‌ మాట్లాడినా భారీ జరిమానా

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో రహదారి భద్రతకు సంబంధించి రూ.50 కోట్ల రివ్వాలింగ్‌ ఫండ్‌ నిధులతో ప్రత్యేకంగా రహదారి భద్రతా నిధిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో రహదారి భద్రత, డ్రాఫ్ట్‌ ఆడిట్‌ నివేదిక అంశాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న రహదారి ప్రమాదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, దీనివల్ల ఆయా కుటుంబాలు రోడ్డునపడి ఇబ్బందులకు గురువుతున్నాయని తెలిపారు. మద్యం తాగి, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలను నడిపే వారిపై నూతన మోటారు వాహన చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాహనాల అధిక వేగ నియంత్రణకు స్పీడ్‌ గన్స్‌ను అందుబాటులో ఉంచాలని చెప్పారు. హెల్మెట్‌ ధరించడం, సీటుబెల్టు వినియోగంపై అవగాహన కల్పించాలని పోలీసు, రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. కొత్తగా చేపట్టే వివిధ రహదారి ప్రాజెక్టు అంచనాల్లో రెండుశాతం నిధులు రహదారి భద్రతా నిధికి జమయ్యేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. మానవ తప్పిదం లేదా మానవ నిర్లక్ష్యంతో జరిగే ప్రమాదాలను పూర్తిగా నివారించేలా పెద్దయెత్తున చర్యలు తీసుకోవాల్సి ఉందని జవహర్‌రెడ్డి అన్నారు. వివిధ జాతీయ, రాష్ట్ర ఇతర ముఖ్యమైన రహదారులపై జంక్షన్లను మెరుగుపర్చడంతోపాటు బ్లాక్‌ స్పాట్‌ను తక్షణం సరిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బి, జాతీయ రహదారుల విభాగాల అధికారులను ఆదేశించారు. నగరాలు, పట్టణాల్లోని ముఖ్య కూడళ్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు సిగల్‌ వ్యవస్థతోపాటు సిసి కెమెరాలను సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రార్థనా మందిరాలు సరిసరాల్లో రహదారులపై ప్రత్యేకంగా సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆర్‌అండ్‌బి కార్యదర్శి ప్రద్యుమ్న సమావేశపు అజెండాను రోడ్డు సేఫ్టీ ఆడిట్‌కు సంబంధించిన సిఫార్సులు వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎమ్‌టి కృష్ణబాబు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్‌ గుప్తా, శాంతి భద్రతల అదనపు డిజి ఎస్‌ బాగ్చి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ పాల్గొన్నారు.