- ఆరేళ్లుగా కొనసాగుతున్న అక్రమాలు
- నిందితుడు మాజీ డిజిపి సాంబశివరావు అల్లుడు అవినాష్
- గుంటూరు రేంజ్ డిఐజి వెల్లడి
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర పోలీసు శాఖలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. వాహనదారులు ఇ-చలానాలుగా చెల్లించిన 36.53 కోట్ల రూపాయలను గుట్టుచప్పుడు కాకుండా స్వాహా చూసిన ఉదంతమిది. ఆరు సంవత్సరాల నుండి కొనసాగుతున్న ఈ వ్యవహారం ప్రస్తుతం పోలీస్ అధికారుల్లో కలకలం రేపుతోంది. తెలుగు దేశం పార్టీ పాలనలో ప్రారంభమైన ఈ దోపిడి వైసిపి ప్రభుత్వ హయంలోనూ కొనసాగింది.
మాజీ డిజిపి నండూరు సాంబశివరావు అల్లుడు కొమ్మిరెడ్డి అవినాష్ కు చెందిన రేజర్ పిఇ ఖాతాకు చలానాల సొమ్ము మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఏళ్లతరబడి సాగుతున్న ఈ అక్రమాలను ఇటీవల తిరుపతి పోలీసు అధికారులు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినా ఉన్నతాధికారులు ఆలస్యంగా స్పందించారు. గుంటూరు రేంజి ఐ.జి.పాలరాజు గురువారం సాయంత్రం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం 2015లో అప్పటి ప్రభుత్వం ట్రాఫిక్ విభాగంలో ఇ-చలానాలు వసూలు బాధ్యతలను కృష్ణా సొల్యూషన్స్ అనే సంస్థకు అప్పగించింది.
2016లో డేటా సెల్యూషన్స్ అనే మరో సంస్థ సాఫ్ట్‌వేర్ సంస్థల ద్వారా తాము అవే సేవలు అందిస్తామని ముందుకు వచ్చింది. కొన్ని సేవలను ఉపయోగించుకున్న అనంతరం 2018లో ఇ-చలానాలకు సంబంధించి సాఫ్ట్‌వేర్ అందించేందుకు పోలీసు శాఖ ఓపెన్ టెండర్స్‌ను ఆహ్వానించింది.ఈ టెండర్లలో కృష్ణా సొల్యూషన్స్ రూ.కోటి 96 లక్షలు కోట్ చేయగా, కేవలం రూపాయికే సాంకేతిక పరిజ్ఞానం అందిస్తామంటూ డేటా సొల్యూషన్స్ టెండరుదాఖలు చేసింది. సాఫ్ట్‌వేర్ అందించేందుకు అందించేందుకు ప్రభుత్వం ఒపెన్ టెండర్‌లో రూ.2 కోట్లును గరిష్టమొత్తంగా పేర్కొంది. అయితే, ఒక్క రూపాయికే టెండర్ దాఖలు చేయడంతో అధికారులు దీనిపై వివరణ కోరారు. ఆంధ్రప్రదేశ్‌ను మోడల్ స్టేట్‌గా చూపించి మిగిలిన రాష్ట్రాల్లో సాఫ్ట్‌వేర్‌ను అమ్ముకుంటామని డేటా సొల్యూషన్స్ నిర్వాహకులు నమ్మించారు. . దీంతో 2018లో డేటా సొల్యూషన్స్‌కు టెండరు అప్పగించారు. ప్రతి రోజూ వాహనదారుల నుంచి వసూలు అయిన చలానాల మొత్తం డిజిపి ఖాతాల్లోకి వెళ్లకుండా వేరే ఖాతాలకు వెళ్లేలా ఆ సంస్థ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దీంతో పోలీస్ అధికారిక ఖాతాల్లో ఆ మొత్తంలో అధికభాగం జమకాలేదు. మాజీ డిజిపి నండూరు సాంబశివరావు అల్లుడుకి చెందిన కొమ్మిరెడ్డి అవినాష్, మరో డైరక్టర్ అషిత పాత్ర ఈకుంభకోణంలో కీలకంగా ఉందని గుర్తించినట్లు పోలీస్ అధికారులు గుర్తించారు. ప్రజలనుంచి మొత్తం రూ.100 కోట్లకు పైగా నిధులు ఈచలానాల రూపంలో చెల్లించగా రూ.66.47 కోట్లు మాత్రమే పోలీసు శాఖకు జమ అయ్యాయి. మిగతా రూ.33.53కోట్లు కొమ్మిరెడ్డి అవినాష్ ఖాతాల్లోకి బదిలీ అయినట్లు తేల్చారు. ఈ కుంభకోణంలో అవినాష్‌తో కలిసి పనిచేస్తున్న కొత్తపల్లి రాజశేఖర్‌ను అనే వ్యక్తిని అరెస్టుచేశామని ఐ.జి.పాలరాజ్ తెలిపారు. డేటా సొల్యూషన్స్ డైరెక్టర్స్ గా మాజీ డిజిపి సాంబశివరావు అల్లుడు అవినాష్ తో పాటు అక్షిత అనే మరో మహిళ కూడా ఉన్నారు. ఆమె పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఎవరిని వదిలి పెట్టబోమని గుంటూరు రేంజ్ డిఐజి చెప్పారు. కొమ్మిరెడ్డి అవినాష్ బినామీ పేర్లతో ఆస్తులు కొన్నట్టు గుర్తించామని వీటిని విక్రయించకుండా సంబంధిత సబ్ రిజిస్ట్రార్‌కు లేఖ రాశామని, ఈ ఆస్తులను త్వరలో అటాచ్ చేస్తామని వివరించారు. ఇప్పటికే అవినాష్‌ను సంజాయిషీ అడిగినట్టు ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు.










