Aug 25,2023 20:18

ప్రజాశక్తి - భీమవరం : సామాన్య ప్రజానీకం గుండెల్లో బియ్యం ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా ధరలు పెరగడంతో పేదలు బెంబేలెత్తిపోతున్నారు. గతంతో పోలిస్తే 25 శాతం బియ్యం ధరలు పెరిగాయి. బస్తాపై సుమారు రూ.350 అదనంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాణ్యత బట్టి కిలో రూ.60 నుంచి రూ.65కు ఎగబాకింది. అయితే దిగుబడి తగ్గడమే దీనికి కారణమని చెబుతున్నప్పటికీ సన్న రకం బియ్యం తినుబడి పెరగడంతో బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయని రిటైల్‌ వర్తకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పేదలకు తిప్పలు తప్పట్లేదు.
ఒకప్పుడు సన్న రకం బియ్యాన్ని ఎగువ మధ్య తరగతి, సంపన్న వర్గాలే వినియోగించేవారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలూ మక్కువ చూపుతున్నారు. పౌర సరఫరాల ద్వారా ప్రభుత్వం అందించే రేషన్‌ బియ్యం నాసిరకంగా ఉండడం ఎక్కువశాతం మంది సన్న బియ్యంపై మక్కువ చూపుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. మొన్నటి వరకూ 26 కిలోల బస్తా రూ.1,200 ఉంటే, ప్రస్తుతం రూ.1500లకు పెరిగింది. నాణ్యమైన బియ్యం 20కిలోల బస్తా రూ.1,600 పలుకుతోంది. అంటే అతికొద్ది రోజుల వ్యవధిలోనే 25 శాతం మేర ధరలు పెరిగాయి.
సామాన్య, మధ్య తరగతి ప్రజల నెలవారీ బడ్జెట్‌ను పెంచాయి. దీంతో ఆయా వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఐదేళ్లలో ఉమ్మడి పశ్చిమలో బియ్యం వినియోగం గణనీయంగా తగ్గింది. 2018 అమ్మకాలతో పోలిస్తే ఇప్పుడు అమ్మకాలు సుమారు 25 శాతం తగ్గాయి. దీనికి ప్రధాన కారణం ప్రజల్లో ఆహార నియమాలు పెరగడం, సాయంత్రం పూట అధిక జనాభా అల్పాహారంతో సరిపెట్టడంతో బియ్యం వినియోగం తగ్గింది. అయినప్పటికీ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో పండిస్తున్న వరి పంట ఇక్కడ వినియోగిచడం లేదు. ఎదుకంటే ఇక్కడ ముతకరం బియ్యం ఉత్పత్తి అవుతాయి. ముతక బియ్యం ఉత్తరాది రాష్ట్రాలకు ఎగు మతవుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు లెవీ తీసుకుని రేషన్‌ డిపోల ద్వారా పేదలకందిస్తున్న ముతక బియ్యం కొంతభాగం మరలా రీ సైక్లింగ్‌ అవుతుంటే కొంత భాగం రొయ్యలు, చేపల చెరువులకు, పశువుల దాణాగా వినియోగిస్తున్నారు. స్థానికంగా పండే వరి పంట ద్వారా వచ్చే బియ్యం స్థానిక అవసరాల్లో పదిశాతం మించి వినియోగం కావడం లేదు. మిగిలిన 9 శాతం ఇతర ప్రాంతాల నుంచి దిగుమతైన సన్న బియ్యాన్నే ఉమ్మడి జిల్లాలో వినియోగిస్తున్నారు.
మూడు నెలల్లో రూ. 350 పెరుగుదల
ఈ ఏడాది మార్చిలో 25 కేజీల బియ్యం బస్తా రూ.1,200 ఉంది. ఏప్రిల్‌లో రూ.1,450, ఆగస్టులో రూ.1,500 దాటి విక్రయిస్తున్నారు. మూడు నెలల కాలంలో బియ్యం బస్తాపై రూ.350 పెరిగింది. కర్నూల్‌ సోనామసూరి బియ్యం వంద కిలోలు రూ.6,800 పలుకుతున్నాయి. వ్యాపారులు, మిల్లర్లు పెద్ద ఎత్తున ధాన్యాన్ని నిల్వచేసి కృత్రిమ కొరత సష్టించి ధర పెంచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. బిపిటి 76 కిలోల ధాన్యం బస్తా ఏప్రిల్‌లో రూ.2,350 నుంచి రూ.2,500 పలికింది. ప్రస్తుతం రూ.2,850 నుంచి రూ.మూడు వేల పలుకుతున్న పరిస్థితి.
కేంద్రం నిర్ణయంతో ధరలు పెరుగుదల
పన్నుల ఉపశమనం పొందడానికి 26 కిలోలు, 30 కిలోల బస్తాలను అందుబాటులోకి తెచ్చాయి. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం 25 కేజీల వరకూ బ్రాండ్లతో అమ్ముతున్న బియ్యానికి పన్ను వసూలు చేస్తున్నారు. 26 కిలోలు దాటితే పన్ను ఉండదు. దీన్ని దష్టిలో ఉంచుకొని వ్యాపారులు 26 కేజీల బస్తాలను విక్రయిస్తున్నారు. 26 కిలోల సన్న బియ్యం బస్తా ఏప్రిల్‌లో రూ.1400 ఉంది. డీమార్ట్‌లో రూ.1750 పలుకుతోంది. ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడం వల్ల ధాన్యం దెబ్బతిందని, నిల్వలు లేవని వ్యాపారులు చెబుతున్నారు. పదేళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి ధరలు పెరిగాయి.
రేషన్‌ బియ్యం తినేందుకు విముఖత..
పౌర సరఫరా శాఖ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ బియ్యం పేద ప్రజానీకం తింటున్నప్పటికీ ఎక్కువ శాతం విముఖత చూపుతున్నారు. ఇవి తినడం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని రేషన్‌ లబ్ధిదారులు చెబుతుండంతో తినుబడి తగ్గుతున్న పరిస్థితి. విచిత్రం ఏంటంటే కిలో రూపాయి బియ్యం కొనుక్కున్న పౌరులు సైతం కోటా బియ్యాన్ని రిటైల్‌ దుకా ణాల్లో మార్పిడి చేసుకుంటున్న పరిస్థితి. కోటా బియ్యం బ్లాక్‌ మార్కెట్లో కిలో రూ.12లకు విక్రయిస్తున్నారు. ఈ బియ్యం 50 శాతం మరలా రిటైల్‌ బియ్యం వర్తకుల ద్వారా రైస్‌ మిల్లులకు చేరి కొత్త సంచుల్లో ప్యాకింగ్‌ చేసి మరలా ప్రభుత్వ చౌకధరల దుకాణాలకు వస్తున్నాయి. ఈ విధానంలో దళారులకు కిలోకు ఖర్చులు పోనూ ఎనిమిది రూపాయలు మిగులుతున్నట్లు చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో కోటా బియాన్ని మార్పిడి చేసుకోవడం లేదా అమ్మకాలు జరుగుతుంటే గ్రామీణ ప్రాంతాల్లో కోటా బియ్యాన్ని పశువులకు, చేపల, రొయ్యల చెరువుల్లో మేత గా వినియోగిస్తున్న పరిస్థితి ఉంది.
ప్రమాదం మాటను ఆరోగ్యం
పాలిష్‌ పట్టిన బియ్యం, సన్నరకాల బియ్యంలో చెక్కర శాతం ఎక్కువుగా ఉంటుందని, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆ బియ్యం తినడం వల్ల మరింతగా ఆరోగ్య సమస్యలు ఎదువురతాయని వైద్యులు హెచ్చరిస్తున్నప్పటికీ వాటివైపే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. పట్టు తక్కువ బియ్యం, బ్రౌన్‌ రైస్‌, ముతక బియ్యం, రంగుమారిన బియ్యం, దంపుడు బియ్యం తినడం ద్వారా మధుమేహం కొంతమేరకు అదుపు అయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
రేషన్‌ బియ్యంలో పోషక విలువలు
జిల్లా అధికార యంత్రాంగం అవగాహన
రేషన్‌ బియ్యంలో పోషక విలువలు దాగి ఉన్నాయని జిల్లా అధికార యంత్రాంగం ఇటీవల పెద్ద ఎత్తున అవగాహన కల్పించింది. ఆగస్టు 8వ తేదీన డిఆర్‌డిఎ, మెప్మా, సిడిఎస్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో రేషన్‌ బియ్యంతో 108 వంటకాలు తయారీ పోటీలను ఏర్పాటు చేసి అవగాహన చేపట్టింది. జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌ రెడ్డి సంయుక్తంగా వంటకాల పోటీలను పరిశీలించి రుచి చూశారు. రేషన్‌ బియ్యాన్ని తక్కువగా భావించడం సరికాదని, ప్రస్తుతం పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యంలో పోషక విలువలతో కూడిన ఫోర్టిఫైడ్‌ కెర్నల్స్‌ను కలపడం ద్వారా ఈ బియ్యం వినియోగించే లబ్ధిదారులకు ఐరన్‌, విటమిన్‌ బి12, పోలిక్‌ యాసిడ్‌ సంపూర్ణంగా అందుతాయని అవగాహన కల్పించారు.