ప్రజాశక్తి-పలమనేరు : కుప్పం ప్రాజెక్టులో అంగన్వాడీలను వేధిస్తున్న సిడిపిఓ ను సస్పెండ్ చేయాలని జిల్లా వ్యాప్త ఉద్యమంలో భాగంగా గురువారం పలమనేరు ప్రాజెక్ట్ అధికారి కి సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు, అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు పద్మలు మాట్లాడుతూ కుప్పం ప్రాజెక్టులో రోజురోజుకీ వర్కర్లపై వేధింపులు తీవ్ర స్థాయికి చేరాయి. వీటిని ప్రశ్నిస్తున్న నాయకురాలు ప్రమీలను మరో కార్యకర్త కవితలను విధుల నుంచి తొలగించడం దుర్మార్గమన్నారు. అక్రమంగా తొలగించిన కార్యకర్తలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిడిపిఓ అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ వర్కర్లను నానా బూతులు తిడుతూ మానసికంగా ఇబ్బందులు గురి చేస్తున్నది. ఉద్దేశపూర్వకంగానే రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నది. తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్‌ఆర్‌ఎస్ రద్దు చేయాలని పోరాటం చేస్తుంటే కుప్పం ప్రాజెక్ట్ అధికారి వర్కర్లను బెదిరింపులకు పాల్పడం ఏమిటి అని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కారం కోసం పోరాటం చేసే హక్కు కూడా లేకుండా చేయడం దారుణం. ప్రతి చిన్న విషయానికి అధికార పార్టీ నాయకుల దగ్గర అడుక్కోండి అని స్వయంగా ప్రాజెక్టు అధికారి చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయాలపై ఎప్పటికప్పుడు జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నప్పటికీ వారు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అందుకే జిల్లాలోని అంగన్వాడీలందరూ నేడు కుప్పం లో అంగన్వాడీలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపడుతున్నామని ఈ కార్యక్రమానికి అందరూ మద్దతు ఇచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కుప్పం సిడిపిఓ పై చర్యలు తీసుకోకపోతే పోరాటాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉదఅతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం సంఘం జిల్లా కార్యదర్శి ఓబుల్ రాజు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, పలమనేర్ సిఐటియు నాయకులు గిరిధర్ గుప్తా, సుబ్రహ్మణ్యం, అంగన్వాడీ యూనియన్ నాయకులు పద్మ తదితరులు పాల్గొన్నారు










