Aug 25,2023 16:22

రాంబిల్లి : పంచాయతీ కార్మికుల బకాయి జీతాలు చెల్లించాలని రాంబిల్లి మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో మండలంలో వివిధ పంచాయతీలో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు , గ్రీన్‌ అంబాసిడర్లు స్థానిక ఎంపీడీవో ఆఫీసులో ఏవోకి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు జి దేవుడు నాయుడు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా గ్రామపంచాయతీ కార్మికులు గ్రీన్‌ అంబాసిడర్లకు ఇస్తున్న కనీస వేతనం 6000 కూడా చెల్లించకపోతే వారు ఎలా బతుకుతారని మండిపడ్డారు. నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి కొనుక్కొని తినలేని పరిస్థితిలో ఉన్న కార్మికులకు ఇన్ని నెలలు జీతం చెల్లించకపోతే వారెలా బ్రతుకుతారని ఆలోచన చేయవలసిన అవసరం ఉందా లేదని అధికారులను నిలదీశారు. సేఫ్టీ పరికరాలు కానీ, యూనిఫారమ్స్‌ గాని ఇవ్వలేదని ఆరోపించారు. కొన్ని పంచాయితీలలో పాపులేషన్‌ తగ్గట్టుగా పంచాయతీ కార్మికుల నియమించకపోవడం వలన, పారిశుధ్య పనులు లోపించి దోమలు విపరీతంగా పెరిగిపోయి, డెంగ్యూ టైఫాయిడ్‌ మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలి ప్రజలు అనారోగ్యం పాలై, మెరుగైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం జిల్లా అధికారి యంత్రాంగం పంచాయతీ కార్మికుల కష్టాన్ని తెలుసుకొని వారి బకాయి జీతాలను వెంటనే చెల్లించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ కాశి రావు, అప్పారావు, అప్పలరాజు, ఎస్‌ దానయ్య, కే నాగేశ్వరరావు, బంగారి రమణ, అప్పారావు కసింకోట చిన్న కొండయ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.