
నెదర్లాండ్స్‌పై 5వికెట్ల తేడాతో గెలుపు
లక్నో: ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక బోణీ కొట్టింది. హ్యాట్రిక్ ఓటములతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక జట్టు నెదర్లాండ్స్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. నెదర్లాండ్స్ నిర్దేశించిన 263 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక జట్టు 48.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సదీర సమరవిక్రమ (91), నిస్సంక(54) అర్ధసెంచరీలతో మెరిసారు. అసలంక(44), ధనంజయ డిసిల్వ(30) బ్యాటింగ్‌లో రాణించారు. తొలుత కుశాల్ పెరీరా(5), ఆ తర్వాత కెప్టెన్ కుశాల్ మెండిస్(11) నిరాశపరిచారు. ఆ తర్వాత నిస్సంకతో కలిసి సమరవిక్రమ మూడో వికెట్‌కు 52 పరుగులు జోడించాడు. ఆ తర్వాత అసలంకతోనూ 77 పరుగులు జతచేసి లంకను విజయపథంలో నడిపించాడు. ధనంజయ డిసిల్వతో ఐదో వికెట్‌కు 76 పరుగులు జోడించిన సమరవిక్రమ మ్యాచ్‌ను ముగించి ప్లేయర్ ఆఫ్ ది అవార్డును అందుకున్నాడు. అంతకుముందు నెదర్లాండ్స్ 49.4ఓవర్లలో 262పరుగులకు ఆలౌటైంది. సిబ్రండ్(70), వాన్ బీక్(59)లు డచ్ జట్టును ఆదుకున్నారు. శ్రీలంక బౌలర్లలో మధుశంక, రజితలకు నాలుగేసి వికెట్లు దక్కాయి.