
అవయవ మార్పిడి కోసం వేచి ఉండే వారి సమాచారం, స్వచ్ఛందంగా దానం చేస్తామని ముందుకు వచ్చే వారి వివరాలు నమోదు చేస్తున్నారే తప్ప జంట దానాల గుర్తింపు, చైన్ దాతల వివరాల నమోదును ప్రోత్సహించే ఏర్పాట్ల కోసం జాతీయ స్థాయిలో ఒక రెగ్యులర్ వ్యవస్థ అంటూ లేదు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో నిబంధనలను సరళతరం చేయడంలోను, అలాగే డోనర్ల (దాతల) సంఖ్యలోనూ ముందున్నాయి. దేశం మొత్తం మీద చూస్తే అవయవ దానాన్ని ప్రోత్సహించటం, ప్రజల్లో చైతన్యాన్ని పాదు కొల్పడం వంటి విషయాల్లో చెప్పుకోదగ్గ చర్యలు లేవు.
దేశంలో అవయవ దాన వారోత్సవాలు ఇటీవల (సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 2 వరకు) జరిగాయి. అవయవ దానాలకు సంబంధించి ఎక్కువగా జరిగేవి కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు. ఈ సందర్భంగా కిడ్నీ దానం, మార్పిడి గురించి పరిశీలిద్దాం.
దేశంలో ఈ సమస్య తీవ్ర రూపంలో ఉంది. 2022లో 2 లక్షల మంది కిడ్నీ మార్పిడి కోసం నిరీక్షిస్తున్న వారు దేశంలో ఉండగా కేవలం 7500 మార్పిడి ఆపరేషన్లు మాత్రమే జరిగాయి. అంటే సుమారు 3.4 శాతం మందికే ఊరట లభించింది. మధుమేహం, పౌష్టికాహార లోపం, పారిశుధ్య లేమి, అధిక జన సాంద్రత తదితర కారణాల వల్ల క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సి.కె.డి) దేశంలో ఎక్కువగా ప్రబలుతోంది. దేశ జనాభాలో 17 శాతం మేరకు సి.కె.డి వ్యాధిగ్రస్తులు ఉంటారని ఒక అంచనా. సాధారణంగా ఇలాంటి వ్యాధితో ఉన్నవారు 'ఎండ్-స్టేజ్ కిడ్నీ వ్యాధి' (ఇ.ఎస్.ఆర్.డి) దశకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి కేసుల్లో పేషెంట్ ప్రయోజనాల రీత్యా ఇతర ప్రత్యామ్నాయ చికిత్సా విధానాల కన్నా కిడ్నీ మార్పిడి ఉత్తమ ఎంపిక అవుతుంది. శేష జీవితం ఫలవంతంగా ఉండేందుకు గాని, ఖర్చు రీత్యా గాని కిడ్నీ మార్పిడే మంచిదని అనుభవాలు చెబుతున్నాయి. అమెరికా తదితర అభివృద్ధి చెందిన దేశాల్లో 20 శాతం మేర అవసరమైన కేసుల్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారు. మన దేశంలో బాగా తక్కువగా జరుగుతుండడానికి ఆరోగ్య వ్యవస్థలో లోటుపాట్లు కంటే నిబంధనల సంక్లిష్టత ప్రధాన కారణంగా ఉంటున్నది.
కిడ్నీ లభించే మార్గాలు
1. మరణించిన వ్యక్తి నుండి సేకరణ. అందుకు మరణించిన వ్యక్తి లేదా వారి కుటుంబీకుల సమ్మతి అవసరం. అలానే మరణ కారణాలు, మరణించిన వ్యక్తి ఆరోగ్య స్థితి. ఇవన్నీ అనుకూలించినా, అవయవాన్ని సకాలంలో సేకరించి నిల్వ ఉంచగల సాంకేతిక సదుపాయాల లభ్యత. కిడ్నీ మార్పిడి వీటన్నింటిపై ఆధారపడి ఉంటుంది.
2. బంధువులో, మిత్రులో కిడ్నీ దానం చేయడానికి సిద్ధపడి ముందుకు వచ్చినా రక్త నమూనా, టిష్యూ నమూనాలు, పేషెంట్ నమూనాలతో వైద్యపరమైన అనుసంధానం (కంపాటిబిలిటీ) ఉండాలి. ఇవన్నీ కుదరడం అరుదుగా మాత్రమే జరుగుతుంది.
3. కిడ్నీ మార్పిడి కుటుంబీకుల మధ్యనే అయితే సాధ్యపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది రెండు రకాలు. మొదటిది- పేషెంట్, తన జీవిత భాగస్వామి ఒక జంట అనుకుంటే అటువంటి రెండు జంటల మధ్య మార్పిడి. ఉదాహరణకు సునీతకు కిడ్నీ కావాలి. భర్త ఇవ్వడానికి సిద్ధమే. కానీ వైద్య పరీక్షలు అందుకు సమ్మతించలేదు. విజయలక్ష్మికి కూడా అదే అనుభవం. అప్పుడు సునీత భర్త విజయలక్ష్మికి, విజయలక్ష్మి భర్త సునీతకు కిడ్నీల మార్పిడి కోసం ముందుకు వచ్చి, అవి కుదిరితే...దాన్ని స్వాబ్ విధానం అంటారు. రెండవది- చైన్ విధానం. సురేష్ స్వచ్ఛందంగా కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చిన వ్యక్తి. పైన చెప్పిన సునీతకు సురేష్ కిడ్నీ మార్పిడి కుదిరింది అనుకుందాం. అపుడు సునీత భర్త విజయలక్ష్మికి విజయలక్ష్మి భర్త ఇంకొకరికి కిడ్నీ దానం చేస్తారు. దీన్నే చైన్ విధానం అంటారు. ఇంతకీ మన దేశంలో గణాంకాలు చూస్తే స్వాబ్ కేసులు అత్యంత అరుదుగా మాత్రమే ఉన్నాయి. చైన్ కేసులు అసలు లేనే లేవు. చట్టపరమైన కఠిన నిబంధనలే ఇందుకు కారణం. దీని వల్ల ఎంతో నష్టం జరుగుతున్నది. స్వాబ్ విధానానికి మన చట్టాలు అనుమతిస్తాయి. కానీ దాతలు సమీప బంధువుల జంటలు అయి ఉండాలి అనే షరతు ఉంది. కేరళ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు దీనికి మినహాయింపు. అక్కడ హైకోర్టులు సమీప బంధువులు కాని జంటలు అయినాసరే అనుమతిస్తూ తీర్పులిచ్చాయి. జాతీయ స్థాయిలో అవయవ దాతల రిజిస్టర్ ఉన్నట్లు, జంట దాతల సమాచారం సేకరించే ఏర్పాటు లేనందువల్ల కూడా ఎంతో నష్టం జరుగుతున్నట్లే! స్వచ్ఛందంగా కిడ్నీని దానం చేయడం చట్ట విరుద్ధం. కేరళ రాష్ట్రం మాత్రమే దీనికి మినహాయింపు. ఆ కారణంగా ఒక జంట దాతల కోసం ప్రయత్నమే జరగదు. చైన్ దాతల ఆలోచనే రాదు! జంట దాతలు, చైన్ దాతల వివరాల సేకరణ ఏర్పాట్లు జాతీయ స్థాయిలో నిర్వహించినట్లయితే అనవసర వెతుకులాట, వ్యక్తుల మనో వ్యధ, ఆసుపత్రి ఖర్చులు గణనీయంగా తగ్గి, కిడ్నీ మార్పిడి చికిత్సలు సరళతరంగా జరిగేందుకు సాధ్య మవుతుంది. అవేవీ లేనందువలన జరగాల్సిన మేలును... సమాజం నేడు కోల్పోతోంది.
కిడ్నీ దాన ప్రక్రియలో ఉన్న కఠినతర నిబంధనల పర్యవసానంగా కిడ్నీ అమ్మకాలకు బ్లాక్ మార్కెట్ ద్వారాలు తెరుచుకుంటున్నాయి. అత్యవసర ఆర్థిక ఒత్తిళ్ల వల్ల జరిగే కిడ్నీ అమ్మకాలు ఈ కోవకే చెందుతాయి. ఇలాంటి సందర్భాల్లో జరిగే ఆపరేషన్లు రికార్డుల్లో నమోదు కావు, అవి కూడా వైద్య ప్రమాణాలకు లోబడి జరగకపోవచ్చు.
మానవ అవయవాల, టిష్యూల మార్పిడిని క్రమబద్ధం చేస్తూ 1994లో కేంద్ర చట్టం వచ్చింది. 2011లో జంట దాతల విధానాన్ని అనుమతిస్తూ సవరించబడింది. వీటి అమలు కోసం చేసిన నిబంధనలు సమీప బంధువుల మధ్యనే జంట మార్పిడిని అనుమతిస్తున్నాయి. అవయవ మార్పిడి కోసం వేచి ఉండే వారి సమాచారం, స్వచ్ఛందంగా దానం చేస్తామని ముందుకు వచ్చే వారి వివరాలు నమోదు చేస్తున్నారే తప్ప జంట దానాల గుర్తింపు, చైన్ దాతల వివరాల నమోదును ప్రోత్సహించే ఏర్పాట్ల కోసం జాతీయ స్థాయిలో ఒక రెగ్యులర్ వ్యవస్థ అంటూ లేదు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో నిబంధనలను సరళతరం చేయడంలోను, అలాగే డోనర్ల (దాతల) సంఖ్యలోనూ ముందున్నాయి. అవయవ దానాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది. అవయవ దాతలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి గౌరవించాలని నిర్ణయించింది. దేశం మొత్తం మీద చూస్తే అవయవ దానాన్ని ప్రోత్సహించటం, ప్రజల్లో చైతన్యాన్ని పాదుకొల్పడం వంటి విషయాల్లో చెప్పుకోదగ్గ చర్యలు లేవు.
ఈ అంశంలో భారతదేశం ఇతర దేశాల నుండి గ్రహించాల్సింది చాలా ఉంది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, నెదర్లాండ్స్, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో వేలాదిగా అవయవ మార్పిడి చికిత్సలు జరుగుతూ ఉండడమే కాక, ఆ దేశాల మధ్య ఈ అంశంలో అంతర్జాతీయ సహకారం కూడా ఉంటున్నది. వాటి అనుభవాలు తెలుసుకోవడం, వాటిని మన పరిస్థితులకు అన్వయించుకోవడం ద్వారానే మన పౌరుల జీవితాలను మెరుగు పరుచుకోగలం.
( జే మెహతా, ఉత్కర్ష్ అగర్వాల్ 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అహ్మదాబాద్' పూర్వ విద్యార్థులు. జీవంత్ రాంపాల్ అహ్మదాబాద్ లోని 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్'లో ఎకనామిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్.)
జే మెహతా
ఉత్కర్ష్ అగర్వాల్
జీవంత్ రాంపాల్