Oct 03,2023 12:12
  • ఏడాదిలో లాభాలు రూ.8 కోట్లే
  • గణనీయంగా పడిపోయిన ఆదాయం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్రంలో పర్యాటకానికి ప్రాధాన్యత తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ప్రతియేటా ఆదాయంపై లక్ష్యాలను భారీగా నిర్దేశిస్తున్నప్పటికీ అనుకున్న లక్ష్యాలను మాత్రం సాధించలేకపోతున్నట్లు స్పష్టమవుతోంది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.ఎనిమిది కోట్లు మాత్రమే లాభాలు వచ్చినట్లు పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రకటించడం గమనార్హం. పలు పర్యాటక ప్రారతాలకు వెళ్లేవారు కూడా సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హోటళ్ల కన్నా ప్రైవేటు వసతి గృహాలపైనే మక్కువ పెంచుకుంటున్నట్లు కనిపిస్తోంది.
            పర్యాటక రంగంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.11.21 కోట్లు లాభాలు మాత్రమే రాగా, 2022-23లో మరింతగా తగ్గిపోయి కేవలం 8.02 కోట్లు మాత్రమే లాభాలుగా తేలాయి. సంస్థ చెబుతున్న లెక్కల మేరకు 2021-22లో రూ.145 కోట్లు ఆదాయం వచ్చింది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయం రూ.163 కోట్లుగా ఉంది. ఆదాయం స్వల్పంగా పెరిగినప్పటికీ వ్యయం కూడా పెరగడంతో లాభాలు తగ్గినట్లు తేలింది. 2021-22లో రూ.130 కోట్లు వ్యయం జరిగింది. అదే 2022-23లో రూ.150 కోట్లు వ్యయంగా గుర్తించారు. అరదుకే లాభాలు తగ్గినట్లు కనిపిస్తోందని అధికారులు అంటున్నారు.
 

                                                                               హోటళ్ల తారిఫ్‌ వల్లే..

పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యరలోని హోటళ్లలో సౌకర్యాలు మెరుగ్గానే ఉంటున్నప్పటికీ, అందులో గదులకు వసూలు చేసే ధరలు అధికంగా ఉంటున్నట్లు పర్యాటకులు భావిస్తున్నారు. అందుకే కొంతవరకు తక్కువగా టారిఫ్‌ ఉండే ప్రైవేటు హోటళ్లవైపు పర్యాటకులు మొగ్గు చూపిస్తున్నట్లు కనిపిస్తోందని అధికారులే అంగీకరిస్తున్నారు. 2021-22లో హోటళ్ల ద్వారా రూ.89 కోట్లు ఆదాయంగా లభించగా, 2022-23లో ఈ మొత్తం రూ.69 కోట్లకు పడిపోవడం గమనార్హం.
            పలు ప్యాకేజీల ద్వారా ఏర్పాటుచేసిన టూరిజం ఆదాయం మాత్రం కొద్దిగా పెరిగింది. 2021-22లో రూ.26 కోట్లు ఈ రంగంలో ఆదాయంగా లభించగా, 2022-23లో రూ.49 కోట్లకు పెరగడం విశేషం. పెరిగిన వ్యయంలో నిర్వహణ వ్యయం, సర్వీస్‌ వ్యయం బాగా పెరిగినట్లు తేలింది. గతేడాది రూ.61 కోట్లుగా ఈ వ్యయం ఉండగా, ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.71 కోట్లకు పెరిగింది. ఉద్యోగులపై చేసే వ్యయం కూడా రూ.42 కోట్ల నుంచి 52 కోట్లకు పెరిగింది.