Jan 18,2023 08:32
  • ఒకే నెలలో 12శాతంపైగా క్షీణత
  • మార్కెట్లను వెంటాడుతున్న మాంద్యం భయం

న్యూఢిల్లీ : అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం భయాలు దేశీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా వివిధ దేశాలు సరుకుల దిగుమతులపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఫలితంగా భారత్‌ ఎగుమతులు గణనీయంగా తగ్గాయి. దీంతో వాణిజ్యలోటు పెరుగుతోంది. ఈ పరిస్థితి ఆర్థిక రంగ నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు,వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం డిసెంబర్‌ నెలలో 12.25 శాతం మేర ఎగుమతులు తగ్గాయి. సేవారంగంతో కలిపి వాణిజ్య ఎగుమతులు 2021 డిసెంబర్‌ నెలలో 65.25 బిలియన్‌ డాలర్ల మేర వివిధ దేశాలకు మన దేశం నుండి ఎగుమతులు జరిగాయి. 2022 డిసెంబర్‌లో ఈ మొత్తం 61.82 బిలియన్‌డాలర్లకు పడిపోయింది. ఇంజినీరింగ్‌, వజ్రాలు, ఆభరణాలు, పత్తి, కార్పెట్స్‌, ప్లాస్టిక్‌, లినోలియమ్‌ ఉత్పత్తులకు సంబంధించిన ఎగుమతుల్లో గణనీయ తగ్గుదల కనిపించింది. గత ఏడాది డిసెంబర్‌లో 16.6శాతం మేర ఎగుమతుల్లో తగ్గుదల నమోదైంది. ఆ తరువాత మళ్లీ డిసెంబర్‌ నెలలో భారీగా ఎగుమతులు తగ్గడం వాణిజ్యవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అమెరికా, అరబ్‌ఎమిరేట్స్‌, నెదర్లాండ్స్‌, చైనా, బంగ్లాదేశ్‌లకు చేసే ఎగుమతుల్లో తగ్గుదల నమోదైనట్లు అధికారవర్గాలు తెలిపాయి. వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్‌ భరత్వాల్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చైనా దిగుమతులను గణనీయంగా తగ్గిండంతో ప్రపంచవ్యాప్తంగానే వాణిజ్య రంగంలో తగ్గుదల నమోదైందని, దాని ప్రభావం భారతదేశం మీద కూడా పడిందని చెప్పారు. అయితే, దేశీయ సేవా రంగాల పనితీరు ఆశాజనకంగానే ఉన్నాయని ఆయన అన్నారు. మరోవైపు డిసెంబర్‌ నెలలో దిగుమతుల్లో కూడా తగ్గుదల నమోదైంది. 2021 డిసెంబర్‌లో 75.28 బిలియన్‌ డాలర్ల దిగుమతులు నమోదుకాగా, ఈ ఏడాది ఆ మొత్తం 73.80 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. పెరిగిన లోటు
          ఎగుమతులతో పాటు దిగుమతుల్లో కూడా తగ్గుదల నమోదైనప్పటికీ వాణిజ్యలోటు గణనీయంగా పెరిగింది. నవంబర్‌ నెలలో 22.6 బిలియన్‌ డాలర్ల వాణిజ్యలోటు నమోదుకాగా, డిసెంబర్‌ నెలలో 23.8 బిలియన్‌ డాలర్ల లోటు నమోదైంది. గత ఏడాది డిసెంబర్‌ నెలతో పోలిస్తే ఇది దాదాపు 13 శాతం ఎక్కువ. కరెంట్‌ అక్కౌంట్‌ డెఫిసిట్‌ (సిఎడి) 36.4 బిలియన్‌ డాలర్లకు చేరింది. జిడిపిలో ఇది 4.4 శాతం. ఈ స్థాయిలో సిఎడి ఎప్పుడూ నమోదు కాలేదని చెబుతున్నారు.

11

 

22