
- రాష్ట్ర సర్కారు కసరత్తు
- కేబినెట్‌లో నిర్ణయం ?
ప్రజాశక్తి - యంత్రాంగం : జిల్లాల పునర్ విభజన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై గుట్టుచప్పుడు కాకుండా కసరత్తు చేస్తోంది. అక్కడక్కడ ప్రజల స్పందన తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేస్తోంది. ప్రస్తుతమున్న 26 జిల్లాల సంఖ్యను పార్లమెంటు స్థానాలకు సమానంగా 25కు తగ్గించడం ఈ కసరత్తు సారాంశమని తెలిసింది. దీనిలో భాగంలో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో జిల్లాల సంఖ్య తగ్గనుండగా, మరికొన్ని చోట్ల పెరిగే అవకాశం ఉందని తెలిసింది. అయితే, ఖచ్చితంగా 25 జిల్లాలకు పరిమితం చేస్తారా, అంతకన్నా తగ్గిస్తారా అన్న విషయమై స్పష్టత లేదు. త్వరలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. మూడవ తేది (శుక్రవారం) జరగనున్న మంత్రివర్గ సమావేశంలోనే ఈ విషయం చర్చకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాష్ట్రంలో పార్లమెంటు స్థానాల కన్నా జిల్లాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, తగ్గించాలంటూ చేసిన సూచన మేరకు ఈ కసరత్తు జరుగుతోందని తెలిసింది. పనిలో పనిగా ఎన్నికల ప్రయోజనాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే, ఈ కసర త్తును అధికారులు ధృవీకరించలేదు. వివరణ తీసుకోవ డానికి ప్రజాశక్తి ప్రయత్నించగా 'మాకు తెలియదు' అన్న జవాబు వారి దగ్గర నుండి వచ్చింది.
'అన్నమయ్య' అంతర్ధానం..
అన్నమయ్య జిల్లా ఏర్పాటు వల్ల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న కడప జిల్లా చేజారిపోతుందన్న అభిప్రాయం అక్కడి నాయకుల్లో వ్యక్తమవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అన్నమయ్య జిల్లా ఏర్పాటును రద్దు చేసి పాత కడప జిల్లాను పునరుద్దరించాలని వారు కోరుతున్నారు. కడప జిల్లాను అలానే ఉంచి, మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లి నియోజక వర్గాలను చిత్తూరు జిల్లాలో కలపాలని భావిస్తున్నట్లు తెలిసింది. కోడూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలిపే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సైతం ఒకరిద్దరు మంత్రులతో చర్చించినట్లు తెలిసింది.
పూర్వస్థాయికే అనంతపురం...
అనంతపురం జిల్లాను తిరిగి పూర్వస్థాయికి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీనిలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేసిన సత్యసాయి జిల్లాను రద్దు చేసే అవకాశం ఉందని సమాచారం. పాలనపరంగా వీలుకాకపోవడంతో పాటు, విభజన తరువాత మారిన రాజకీయ పరిస్థితులు కూడా దీనికి కారణం. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధుల వద్ద ఈ విషయమై అభిప్రాయ సేకరణ చేసినట్లు తెలిసింది.
'మన్యం'మాయం ?
గిరిజన ప్రాంతాలతో ఏర్పాటైన పార్వతిపురం మన్యం జిల్లా ఏర్పాటు నుండి కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గనున్నట్లు సమాచారం. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన ప్రాంతాలతో ఈ జిల్లాను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, చిన్న జిల్లా కావడం, పాలనాపరంగా అసౌకర్యంగా ఉండటం వంటి కారణాలతో పార్వతిపురం మన్యం జిల్లాను రద్దు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.
కొత్తగా పోలవరం ?
పోలవరం కేంద్రంగా కొత్తగా మరో గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ ప్రతిపాదనకు గ్రీన్‌సిగల్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటి వరకు పోలవరం ప్రాంతం ఏలూరు జిల్లా పరిధిలో ఉండగా, మరో గిరిజన ప్రాంతమైన రంపచోడవరం నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. ఆయా ప్రాంత గిరిజనులు ప్రస్తుతం జిల్లా కేంద్రమైన పాడేరుకు కార్యాలయ పనుల కోసం రావాలంటే కనీసం 200 కిలో మీటర్లకు పైగా ప్రయాణించాల్సి రావడం కష్టమవుతోంది. దీనిపై పలు విజ్ఞప్తులు అందడంతో నూతన జిల్లా ఏర్పాటు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీనితో పాటు పోలవరం ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులవుతున్న వారికి పునరావాస పనులకు పరిపాలన సౌలభ్యం సులభమవుతుందని భావిస్తున్నట్లు తెలిసింది. మన్యం జిల్లాను రద్దు చేసినా పోలవరం జిల్లా ఏర్పాటు ద్వారా గిరిజన జిల్లాల సంఖ్యలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు.