Nov 12,2023 15:48

శ్రవణ్‌ తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి భాగ్యమ్మ నానాకష్టాలు పడి, వాణ్ని పెంచి పెద్ద చేసింది. చిన్నతనంలోనే కష్టం విలువ తెలిసిరావడంతో శ్రవణ్‌ కూడా తల్లి మనసు కష్టపెట్టకుండా బుద్ధిగా పెద్ద చదువులు చదివి, నగరంలో పెద్ద జీతంతో ఉద్యోగం సంపాదించాడు. ఊళ్ళో ఉన్న పొలాన్ని కౌలుకిచ్చి, తల్లితోసహా మకాం నగరానికి మార్చాడు శ్రవణ్‌. కొడుకుకు పెళ్లీడు రావడంతో భాగ్యమ్మ, వైశాలి అనే అమ్మాయితో వివాహం జరిపించి, తన బాధ్యత నెరవేర్చుకుంది.
వైశాలి కాపురానికి వచ్చాక కొంతకాలం వారి జీవనం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా నడిచింది. ఆ తర్వాత భాగ్యమ్మకు మెల్లగా కష్టాలు మొదలయ్యాయి. వైశాలి మనస్తత్వం చాలా విచిత్రమైనది. చిన్నచిన్న విషయాలకు అత్తతో గొడవ పెట్టుకొని, ఆ తర్వాత వాటిని చిలువలు పలువలు చేసి, భర్తకు ఫిర్యాదు చేసేది.
భాగ్యమ్మ, కోడలుది చిన్నతనం అనీ, తెలిసీ తెలియని చేష్టలని కొంతకాలం ఏమీ అనక భరించింది. కానీ కాలం గడిచే కొద్దీ కోడలు ప్రవర్తనలో ఎలాంటి మార్పూ రాకపోవడంతో ఆమె కూడా కోడలు గురించి కొడుకుతో చెప్పింది. ఆ రోజు మొదలు ప్రతిరోజూ సాయంత్రం శ్రవణ్‌ ఇంటికి రాగానే తల్లీ, భార్య వేరువేరుగా ఫిర్యాదు చేయడం మొదలు పెట్టారు. ఇద్దరి వాదనలూ విన్న శ్రవణ్‌కు దాదాపు పిచ్చెక్కిపోయింది.
రెండ్రోజుల తరువాత, పల్లెలో కౌలు వసూలు చేయడానికి వెళ్తున్న తల్లి వెంట శ్రవణ్‌ కూడా ఊరు వెళ్లాడు. అప్పుడు తనకు చిన్నప్పుడు చదువు చెప్పిన రమణయ్య పంతులును చూడటానికి వెళ్లి మాటల సందర్భంలో ఆయనకు తనకు వచ్చిన సమస్యను వివరించాడు. ఇద్దరూ నాకు రెండు కళ్ళలాంటి వారు. వాళ్ళిద్దరూ పరస్పరం కలసిమెలసి వుంటే నాకు ఆనందం. వాళ్ళ మనసు గాయపరచ కుండా నన్ను ఏం చేయమంటారో చెప్పండి.' అన్నాడు.
రమణయ్య చిన్నగా నిట్టూర్చి చెప్పాడు. 'చూడు శ్రవణ్‌ నీవు చాలా తెలివైనవాడివి. నీకు ప్రత్యేకించి చెప్పవలసిన పనిలేదు. నేను పాఠాలు చెప్పేటప్పుడు అప్పుడప్పుడు కథలూ, కొన్ని చిక్కు లెక్కలు చెబుతూ వుండేవాడిని. ఒక చిక్కు లెక్క నిన్ను బాగా ఇబ్బంది పెట్టింది. ఒక మనిషి పులిని, మేకను, గడ్డిమోపును తీసుకొని నది దాటడం..'
శ్రవణ్‌కు గుర్తుకొచ్చింది, తాను నాలుగో తరగతిలో ఉండగా పంతులుగారు ఆ లెక్క చెప్పారు. ఆ మనిషి పడవలో తనతో ఏదైనా ఒకదాన్ని మాత్రమే తీసుకు వెళ్ళగలడు. పులిని తీసుకు వెళ్తే మేక గడ్డిని తినేస్తది. గడ్డిని తీసుకెళ్తే పులి మేకను తినేస్తుంది. అందుకని ముందు మేకను తీసుకువెళ్ళాలి. తిరిగి వచ్చి రెండింట్లో ఏది తీసుకువెళ్ళి వదిలేసి వచ్చినా ఇబ్బందే! రెండు మూడు రోజులు ఆలోచించాక పంతులు ఇంటికి వెళ్లి, 'మీరు సమాధానం లేని ప్రశ్న' ఇచ్చారు అంటూ ఆయన మీద ఉడుక్కున్నాడు.
అప్పుడు పంతులు 'పరిష్కారం లేని సమస్యలు ప్రపంచంలో ఉండవు. ప్రతి సమస్యకు తప్పకుండా పరిష్కారం ఉంటుంది. కాకపోతే కొన్నింటిని సులభంగా సాధించవచ్చు, కొన్నింటిని సాధించడానికి ఓపిక, యుక్తి అవసరం' అన్నాడు.
'లెక్కను ఒకసారి బాగా మననం చేసుకో, ఆ మనిషి ముందుగా పులిని తీసుకుపోలేడు, గడ్డినీ తీసుకుపోలేడు. కానీ మేకను తీసుకు వెళ్ళగలడు. అక్కడే నీ సమస్యకు పరిష్కారం మొదలయింది. మనిషికి ఎప్పుడూ ముందు చూపే కాదు అప్పుడప్పుడు వెనుక చూపు కూడా అవసరం.' అన్నాడు రమణయ్య 'వెనుక చూపు' అనేది వత్తి పలుకుతూ.
ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళిన శ్రవణ్‌, ఆ అర్ధరాత్రి మళ్ళీ రమణయ్య పంతులు ఇంటి తలుపు తట్టాడు. 'పంతులుగారూ! నాకు సమాధానం తెలిసింది. మనిషి రెండోసారి పులిని తీసుకు వెళ్ళాక దాన్ని అక్కడ వదలి మేకను తనతో పాటు మళ్ళీ వెనక్కు తీసుకువచ్చి ఈ సారి గడ్డిమోపును తీసుకువెళ్ళాలి..' గడగడ అప్పజెప్పుతూ పోతున్నాడు.
రమణయ్య పంతులు ప్రేమగా శ్రవణ్‌ జుట్టు నిమిరి మెచ్చుకుని 'నీకు సమస్యను విశ్లేషించడం వచ్చింది. వెళ్లి పడుకో. బాగా పొద్దు పోయింది' అన్నాడు.
ఆలోచనల్లోంచి తేరుకున్న శ్రవణ్‌ 'ఆ లెక్క ఇప్పుడు నాకు ఎందుకు గుర్తు చేశారో చూచాయగా అర్థమైంది' అన్నాడు.
రమణయ్య పంతులు చిన్నగా నవ్వి 'నీకు తల్లీ, భార్యా రెండు కళ్ళన్నావు. కళ్ళు పక్క పక్కనే వున్నా జీవిత కాలంలో ఎప్పటికీ ఒక దాన్నొకటి చూసుకోవు. అయినా రెంటికీ ఒకటే మనసు ఒకటే చూపు.' అన్నాడు.
ఆయన అంతరంగం శ్రవణ్‌కు బోధపడింది. ఎప్పుడూ ముందు చూపే కాదు. కొంచెం వెనుక చూపు ఉండాలంటే తల్లిని కొంతకాలం భార్యకు దూరంగా ఉంచాలి. ఆలోచిస్తూ ఇంటికి వచ్చాడు. భాగ్యమ్మ, కొడుకు రాగానే, 'ఈ కౌలు వాళ్ళ మాటలు నమ్మేట్టు లేదురా! పంటలు సరీగా పండలేదంటున్నారు. కొంతకాలం ఇక్కడే వుండి, నేనే పొలం పనులు చేయించాలని అనుకుంటున్నాను' అన్నది.
తల్లిని ఊళ్లోనే వదలడానికి ఏం కారణం చెబుదామా అని ఆలోచిస్తున్న శ్రవణ్‌కు అది మంచి అవకాశంగా అనిపించి, 'సరేనమ్మా! నీ ఇష్టం' అన్నాడు.
మరునాడు రమణయ్య పంతులును కలసి, విషయం చెప్పి, 'కొంతకాలం మా అమ్మను ఇక్కడే ఉండనిచ్చి, తర్వాత వచ్చి తీసుకెళ్తాను' అన్నాడు.
'నీవు కాదు. నీ భార్య వచ్చి మీ అమ్మను తీసుకువెళ్ళాలి. అదే ఈ సమస్యకు పరిష్కారం.' అన్నాడు రమణయ్య.
అలా జరుగుతుందా అనుకుంటూ, శ్రవణ్‌ తల్లిని పల్లెలోనే వదిలి, ఆమెకు అన్ని ఏర్పాట్లు చేసి, తాను తిరిగి నగరం చేరుకున్నాడు. తనకు అత్తపోరు తప్పినందుకు వైశాలి చాలా సంతోషించింది. అయితే ఆ సంతోషం ఆమెకు ఎంతోకాలం నిలబడలేదు. ఇంట్లో ఏదో వెలితిగా అనిపించసాగింది. అన్ని పనులకూ మనుషులను పెట్టుకున్నా, ఎవరూ సంతృప్తిగా పనిచేసేవారు కాదు. అందుకే వైశాలి స్వయంగా చేసుకోసాగింది. ఇంటిపని, వంటపని పూర్తిగా మీద పడేసరికి వైశాలి తానూ బాగా అలసిపోతున్నట్టు గ్రహించింది. శ్రవణ్‌ రోజూవారీ ప్రవర్తనలో బాగా మార్పు వచ్చింది. మొఖంలో ఏదో బాధ గమనించింది. ఒకరోజు వైశాలి తీరికగా కూచొని ఆలోచించింది. తమ జీవనంలో... జీవం పూర్తిగా లోపించినట్టు, ఆ ఇంట్లో కేవలం రెండు యంత్రాలు మసలుతున్నట్టు, ఆమె గ్రహించింది. ఇప్పుడే ఇలా ఉంటే రేపు తనకు ఒక కొడుకో, కూతురో పుడితే ఏమిటి పరిస్థితి? ఆ దృశ్యం తలుచుకునేసరికి వైశాలికి కళ్ళు తిరిగాయి. సంవత్సరం తిరిగేసరికల్లా ఊరు చూసే నెపంతో వెళ్లి, అత్తగారిని వెంటబెట్టుకొని వచ్చింది.
కోడలి ప్రవర్తనలో వచ్చిన మార్పుకు భాగ్యమ్మ ఆశ్చర్యపోయింది.
తల్లిని చూడగానే భర్త ముఖంలో వెలుగును చూసి వైశాలి ఆనందపడింది.
ఇద్దరినీ ఒకటిగా చూసిన శ్రవణ్‌ సంతోషపడ్డాడు.

డా. దాసరి వెంకటరమణ
90005 72573