Sep 08,2023 09:41

పుట్టుకతోనే అంధత్వం. కుటుంబానిది కడు పేదరికం. ఎటు నుంచీ అందని సాయం. అయినా ఆమె బెదిరిపోలేదు. ఆత్మ విశ్వాసాన్ని ప్రోదిచేసుకుని క్రీడా దివిటీగా వెలిగింది. చీకట్లను చీల్చుతూ తారకై మెరిసింది. చిన్నతనం నుంచే క్రీడల్లో రాణిస్తూ.. నేడు ప్రపంచ అంధుల క్రికెట్‌లో విజయాల పూలు పూయిస్తోంది. దేశ క్రీడా ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేస్తోంది. ఆమెనే అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన గిరి పుత్రిక వలసనైని రవణి. ఆమె క్రీడా ప్రస్థానాన్ని పరికించి చూస్తే ఎన్నో స్ఫూర్తిదాయక విషయాలు కళ్లముందు కదలాడతాయి.

         రవణి స్వస్థలం అల్లూరి జిల్లా హుకుంపేట మండలం మెరకచింత పంచాయతీ రంగసింగపాడు. తల్లిదండ్రులు గోపాలకృష్ణ, చిట్టెమ్మ. ఉన్న కొద్దిపాటి వ్యవసాయమే ఆధారం. వీరికి ఐదుగురు సంతానం కాగా, రవణి, సూరమ్మ, రవికుమార్‌ అంధులు. ఒక కుటుంబంలో ముగ్గురు అంధులైతే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇన్ని ఇబ్బందుల్లోనూ రవణిని చదివించాలని ఆ కుటుంబం అనుకుంది. ఈ క్రమంలోనే రెండో తరగతి వరకూ రవణి స్వగ్రామంలోనే చదువుకుంది. ఆ తరువాత కొద్ది మంది సలహా మేరకు విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం వారిజ నేత్ర విద్యాలయలో చేరింది. అంతవరకూ గ్రామం దాటి ఎప్పుడూ బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టని రవణి కొత్తలో నేత్ర విద్యాలయ నుంచి పారిపోవడానికి ప్రయత్నించేంది. అ తర్వాత అక్కడ ఉపాధ్యాయులు, సిబ్బంది ఆమె మనసును నెమ్మదిగా మారుస్తూ అక్కడ ఉండేలా అలవాటు చేశారు. అలా ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకున్న రవణి తన వైకల్యాన్ని మర్చిపోయి ఆటల్లో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించింది. నేడు ఆమె హైదరాబాద్‌లోని నేత్ర విద్యాలయలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతోంది.
 

                                                                   తొలుత అథ్లెట్‌గా రాణింపు

రవణికి అథ్లెటిక్స్‌ అంటే ప్రాణం. రన్నింగ్‌, షాట్‌పుట్‌, డిస్కస్‌త్రోలో విశేషంగా రాణించింది. 2018-19లో విశాఖ, విజయవాడల్లో జరిగిన జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పై మూడు విభాగాల్లోనూ బంగారు పతకాలు గెలిచింది. డిస్కస్‌త్రోలో ఆమె పాల్గొన్న ప్రతిసారీ పసిడినే ఒడిసి పట్టింది. ఈ క్రమంలోనే 2020లో సహచరులు, నేత్రాలయ సిబ్బంది సూచన మేరకు క్రికెట్‌వైపు దృష్టి మరల్చింది.
 

                                                                     క్రికెట్‌లో విశేష ప్రతిభ

రవణికి అంధుల జాతీయ స్థాయి క్రికెట్‌ క్రీడాకారుడు అజరు నుంచి ప్రోత్సాహం లభించింది. సీనియర్‌ ఆటగాడైన గోపి క్రికెట్‌లో మెళకులను నేర్పించారు. దీంతో తక్కువ సమయంలోనే రవణి క్రికెట్‌లో మెరుపులు మెరిపించింది. అనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఎంపికల్లో సెలక్ట్‌ అయింది. అక్కడి నుంచి ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఒక్కో మ్యాచ్‌లో ప్రతిభ కనబరుస్తూ 2022 నుంచి భారత జాతీయ జట్టుకు ఆడుతోంది. గత ఏడాది బెంగళూరులో జరిగిన మెగస్‌ ట్రోఫీలోనూ ఆడింది. ఆ తరువాత నేపాల్‌లో జరిగిన క్రికెట్‌ టోర్నీలోనూ రాణించింది. ప్రతి మ్యాచ్‌లో రెండు, మూడు వికెట్లు తీస్తూ, బ్యాటింగ్‌లో ప్రతిభ కనబరుస్తూ ఆల్‌ రౌండర్‌గా రాణించింది. గత నెల 18 నుంచి 27 వరకూ ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌ ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో జరిగిన ఇంటర్నేషనల్‌ బ్లైండ్‌ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ (ఐబిఎస్‌ఎ - 2023) ప్రపంచ క్రీడా పోటీల్లో రవణి భారత మహిళా అంధుల జట్టులో ఆడి విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించింది. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జట్లను భారత్‌ మట్టికరిపించడంలో ఆమెదే కీలకపాత్ర. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 52 పరుగులతో రవణి రాణించి అందరి మెప్పూ పొందింది. వెరసి ఈ ఐబిఎస్‌ఎ - 2023 టోర్నీలో ఐదుకు ఐదు మ్యాచ్‌లనూ భారత్‌ నెగ్గి టైటిల్‌ను కైవశం చేసుకుంది.
 

                                                                       పలువురి ప్రశంసలు

ఐబిఎస్‌ఎ వరల్డ్‌ గేమ్స్‌లో టైటిల్‌ను నెగ్గిన భారత అంధుల క్రికెట్‌ జట్టును ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు, వారి విజయం పట్ల దేశం గర్వంగా ఉందని కితాబులిచ్చారు. రంగసింగపాడులో ఉంటున్న రవణి తల్లిదండ్రులతో ఆ జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ మాట్లాడి గెలుపుపై సంతోషం వ్యక్తం చేశారు. రవణి ప్రతిభను కొనియాడారు. ఒక విధంగా చెప్పాలంటే ఆగస్టు చివరి వారంలో రవణి ఇంట సంబరం నెలకొంది. గ్రామస్తులు మిఠాయిలు పంచుకున్నారు. సిపిఎం వైస్‌ ఎంపిపి సుడిపల్లి కొండలరావు, బాకూరు ఎంపిటిసి నైని సత్తిబాబు, మెరకచింత సర్పంచ్‌ దూసూరు వెంకటరావు, మెరకచింత మాజీ సర్పంచ్‌ వలసనైని లక్ష్మణరావు, రాప సర్పంచ్‌ కొప్పుల లక్ష్మయ్య, మత్స్యపురం సర్పంచ్‌ పూజారి సుబ్బారావు గన్నేరుపుట్టు మాజీ సర్పంచ్‌ సుడిపల్లి లక్ష్మీ ప్రమీల, తదితరులు రవణిని అభినందించారు. ఈ నెల 9న రవణి తన స్వగ్రామానికి వస్తున్న సందర్భంగా ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వంతాడపల్లి చెక్‌గేటు నుంచి పాడేరు - హుకుంపేట వరకూ ర్యాలీ నిర్వహించనున్నారు.
 

                                                            గెలిచినప్పటికీ ప్రోత్సాహం ఏదీ ?

అంతర్జాతీయ స్థాయిలో సాధారణ క్రీడాకారులు గెలిస్తే పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు, నగదు నజరానాలు ప్రకటించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగ క్రీడాకారుల పట్ల మాత్రం ఆ తీరున వ్యవహరించడం లేదు. అంధ మహిళా క్రికెటర్ల విషయంలోనూ అదే జరిగింది. ప్రధాని ప్రశంసలకే పరిమితమయ్యారు. ఇంతటి పేదరికంలోనూ క్రికెట్‌లో విశేషంగా రాణిస్తున్న రవణికి ప్రభుత్వాలు ఏ విధంగానూ సాయం అందించలేదు.
 

                                                                  అంధుల క్రికెట్‌ పూర్తి భిన్నం

క్రికెట్‌ అంటేనే బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌. మైదానంలో చిరుతల్లా కదలాలి. అలాంటిది అంధులు ఎలా క్రికెట్‌ ఆడతారనేది ఎక్కువ మందిలో సందేహం. అందుల క్రికెట్‌ జట్టులో మూడు విభాగాలుగా క్రీడాకారులు ఉంటారు. ప్రతి జట్టులో బి 1 కేటగిరీలో నలుగురు, బి 2లో ముగ్గురు, బి 3లో నలుగురు ఉంటారు. బి 1లో పూర్తిగా చూపు కనిపించని వారే ఉంటారు. బి 2లో 2 - 3 మీటర్లు కనిపించేవారు, బి 3లో 3 - 6 మీటర్లు కనిపించేవారు ఉంటారు. మ్యాచ్‌లో బి 1 వారే కీలకపాత్ర పోషిస్తారు. వీరు చేసే ప్రతి పరుగుకూ మరో పరుగును అదనంగా కలిపి లెక్కిస్తారు. బౌలర్‌ బంతి వేసేముందు రెడీ అని, చేతి నుంచి బాల్‌ విడిచాక ప్లే అని కచ్చితంగా అరవాల్సి ఉంటుంది. ఇదే ఈ క్రీడలో అత్యంత కీలకం. బ్యాటింగ్‌ చేసే వారు బాల్‌ శబ్దాన్ని బట్టి సమయోచితంగా షాట్‌ కొట్టాల్సి ఉంటుంది. మహిళా అంధ క్రికెటర్ల జట్టులో రవణి బి1 కేటగిరీలో ఉంది. ఆల్‌రౌండర్‌గా రాణిస్తోంది.
 

- కోడూరు అప్పలనాయుడు
94915 70765