''పునుగుంటపాలెం'' ఎస్టి, బిసి లకు 2013 చట్ట ప్రకారం పరిహారం ఇవ్వాలి : వ్య.కా.సంఘం
చిల్లకూరు (తిరుపతి) : ''పునుగుంటపాలెం'' ఎస్టి, బిసిలకు 2013 చట్ట ప్రకారం పరిహారం ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. శుక్రవారం వ్య.కా.సంఘం నేతలు వివరాలను తెలిపారు.
నేతలు తెలిపిన వివరాల ప్రకారం ... తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని మోమిడి పంచాయితి ''పునుగుంటపాలెం'' లో ఏస్టి, బిసి లకు సంబంధించిన భూములు గత 70 సంవత్సరాలుగా ఐదు కుటుంబాలు గిరిజనులు, 25 కుటుంబాలకు పైగా బిసి.లు సర్వేనెంబర్ 451 లో వేరుశనగ వేసుకుంటూ ఆ 30 కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. అయితే గత సంవత్సరం నుండి ఆ భూములపై ''సింహపురి హాస్పిటల్ చైర్మన్'' అయిన రవీంద్రారెడ్డి కన్నుపడి ఆ భూములను మైనింగ్ కి ఉపయోగించుకోవాలని తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఆ 30 ఎకరాలు భూమిని కాజేయాలని ఎస్‌టి, బిసి లను బయటపెట్టి స్వాధీన పరచుకోవాలని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ భూమి తప్ప వేరే ఆధారం లేని ఆ పేద రైతులు రవీంద్రారెడ్డికి ఎదురు నిలబడి నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. ఆ పోరాటంలో భాగమే ఆ భూములను స్వాధీన పరచుకోవాలని వచ్చిన రవీంద్రారెడ్డిని ఆ భూములను ఇవ్వబోమని చెప్పడమే వీళ్ళు చేసిన పాపం. దానిని జీర్ణించుకోలేని, రవీంద్రారెడ్డి వీళ్ళని భయపెట్టి బెదిరించి భూములను కాజేయడానికి ''నలుగురు'' పై అక్రమ కేసులు బనాయించడం జరిగింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు గుర్తించి ఇలాంటి అసత్యకరమైనవారికి తావు ఇవ్వకుండా పేదలకు న్యాయం చేయాలని, ఒకవేళ నిజంగా వాళ్లకి ప్రభుత్వమే స్వాధీనపరిచి ఉంటే, వాటికి సంబంధించిన డిటెయిల్స్ అన్ని ప్రజలకు తెలియపరచాలని, ఏ ప్రాతిపదిక పైన వాళ్లకి కేటాయించారో, ఇంత మంది రైతులకు లేకుండా వారికి స్వాధీనపరచడంలో అంతర్యం ఏమిటో గ్రామసభ పెట్టి గ్రామంలో తెలియచేయాలని, ఒకవేళ అత్యవసరమై మైనింగ్ కు ఇవ్వాల్సి వస్తే సాగులో ఉన్న రైతులందరికీ ప్రత్యామ్నయం చూపాలని, అలా చూపని పక్షంలో 2013 చట్ట ప్రకారం పంటలు పండే భూములను, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టకూడదని, ఒకవేళ ఆ కట్ట పెట్టాల్సి వస్తే, 2013 చట్ట ప్రకారం ఆ రైతులు అందరికీ పరిహారం చెల్లించిన తర్వాతే వారిని భూముల్లో నుంచి తొలగించాలని ఇందులో పోలీసుల జోక్యం తగ్గించాలని, ఇది సివిల్ మ్యాటర్, కనుక పోలీస్ వారు చేయగలిగితే పేద రైతులకు న్యాయం చేయాలి కాని, పరిశ్రమాధిపతులవారి పక్షాన చేరి, పేదలకు అన్యాయం చేయాలని చూస్తే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని, ఆ పేద రైతుల పక్షాన గూడూరు వ్యవసాయ కార్మిక సంఘంవారికి అండగా నిలుస్తుందని వారు చేసే పోరాటానికి తమ మద్దతు పూర్తిగా ఉంటుందని వెంటనే వారికి న్యాయం చేయాలని వ్య.కా.స నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జోగి శివకుమార్, చిల్లకూరు మండల నాయకులు యస్.ముత్యాలయ్య, సి.ఐ.టి.యు నాయకులు బి.వి.రమణయ్య, బి.గోపినాథ్, బాధిత రైతులు ఆకుల జయరామయ్య, ఆకుల వెంకయ్య, యు.సుబ్బయ్య, యు.మహేష్, వి.హేమంత్, ఎక్కువ సంఖ్యలో గ్రామ రైతులు పాల్గొన్నారు.










