ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ టిడిపి నాయకులు శనివారం భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి బైపాస్ రోడ్డులో గల ఎన్టీఆర్ విగ్రహం వరకు నల్లజెండాలతో ర్యాలీగా వెళ్లి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాతీయ రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులు, నిరసనకారుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. టిడిపి నాయకులు, కార్యకర్తలను బలవంతంగా ఆటోలలోనూ, మినీ వ్యాన్లలోనూ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు గన్నే సుబ్బ నరసయ్య నాయుడు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు, మహిళా నాయకురాలు అనసూయమ్మ, మిరియాల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.










