Sep 11,2023 10:02

  • నేడు వర్థంతి

వందేళ్ల క్రితమే తెలుగు సాహిత్యం ఆధునిక పోకడలను సంతరించుకుంది. వీరి ఆధునిక కవిత్వం అనువదించబడి ఆరు దేశాల్లో విస్తృత చర్చ జరిగింది. ఇప్పటికీ తెలుగు సాహిత్యంలో ఈ కృషీవలుని కవిత్వం నిత్యం మధించబడుతూనే ఉంది. వారే దువ్వూరి రామిరెడ్డి. 'కవి కోకిల'గా ప్రసిద్ధిగాంచిన దువ్వూరి నిజానికి తొలితరం అభ్యుదయ కవి. వస్తు- శిల్ప సంపదకు ఎనలేని ప్రాధాన్యతనిచ్చిన కవి. కవిత్వం అంటే ఏమిటనే దానికి దువ్వూరి సాహిత్యమే చిరునామా. కవిత్వపు రహస్యాలకు పుట్టినిల్లు. ఆంగ్లంలోకి అనువాదమైన రామిరెడ్డి పద్యాలపై వివిధ దేశాల్లో చర్చలు జరిగాయి. తిక్కన ఉదాత్తమైన తెలుగుదనాన్ని అందిపుచ్చు కున్న దువ్వూరి కవిత్వంలోని సంగీత రిథమ్‌ ఆయనకు అపారమైన గుర్తింపు రావడానికి కారణమైంది.
          'నేను గృహ విద్యాలయ శిక్షితుడను' అని వినయ మనస్కుడై చెప్పుకొన్నవారు కవికోకిల దువ్వూరి రామిరెడ్డి. స్వాతంత్య్ర సమర కవితా యోధుడిగా, కవితా కృషీవలుడిగా, మానవతామూర్తిగా, జాతీయ వాదిగా విజ్ఞాన సారస్వత మూర్తిగా బహుముఖ పాటవాలను ప్రదర్శించిన వ్యక్తి దువ్వూరి. 1911 బ్రిటీష్‌ ప్రభుత్వం కొన్ని గ్రంథాలను నిషేధించింది. కానీ దీనికి ముందుగానే దువ్వూరి 'మాతృశతకం'ను నిషేధించారు. ఆనాడు బ్రిటీష్‌ ప్రభుత్వం నిషేధించిన గ్రంథాల్లో శృంగారగ్రంథాలే ఎక్కువ. తెలుగు భాషాభిమానులైన పిఠాపురం రాజా, బయ్యా నరసింహేశ్వరశర్మ, జయంతిరామయ్య, పేరి నారాయణమూర్తి మొదలైన పెద్దలు సభ జరిపి ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేశారు. శృంగార కావ్యాలపై నిషేధం వల్ల అనేక కావ్యాలు లిఖితాలుగానే నిలిచిపోయాయి. 'దువ్వూరి 'మాతృశతకం', వావిళ్ళ వెంటేశ్వరశాస్త్రి రచించిన శ్రీనాథుని వీధి నాటకాన్ని బ్రిటీష్‌ ప్రభుత్వం నిషేధించడంపై తెలుగు సమాజంలో ఎక్కువ నిరసనలు వ్యక్తమయ్యాయి. రాజాజీ మద్రాసు ముఖ్యమంత్రి అయినప్పటికీ నిషేధం వీడకపోవడం భాషాభిమానుల్లో మరింత ఆగ్రహానికి కారణం అయింది. 1947లో ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వీటికి చెర వదిలింది. ఉత్తముడైన కవి మరణించినా ఆయన సాహిత్యాన్ని గురించి కొత్త పరిశీలన, పరిశోధన, అనుశీలన సాగుతూనే ఉంటుంది. అందుకే కవికి మరణం లేదన్నది నానుడికి కవికోకిల దువ్వూరి రామిరెడ్డి సజీవ సాక్ష్యం. ఆయన రచనలు నేటికీ పరిశోధనా కావ్యాలే. ఆయన రచనలన్నీ దాదాపు తొమ్మిది సంపుటాలుగా వెలువడ్డాయి. కొన్ని ఏడెనిమిది ముద్రణలు కూడా పొందాయి. ఆయన డైరీలు, ఉత్తరాలు, జాబులు ఒక చిన్న సంపుటిగా కూడా వెలువడింది. ఆయన జీవితం, సాహిత్యంపై ఒక పెద్ద గ్రంథమే అచ్చయింది. కవికోకిల అముద్రిత గ్రంథాలు అలాగే నిలిచిపోవడం ఒక చారిత్రక విషాదం. అభ్యుదయ కవిత్వం గురించి శ్రీశ్రీ ఒక వ్యాసం రాస్తూ ... ఆధునిక కాలంలో మొట్టమొదటి వచన గేయం రాసింది దువ్వూరి రామిరెడ్డి అని అన్నారు. గ్రంథరూపంలో రావల్సిన, రాదగిన కవి కోకిల అముద్రిత గ్రంథాలు ఇంతవరకూ వెలుగు చూడకపోవడం దురదృష్టకరం. ప్రారంభ రచనలు, పరిమిత రచనలు ఇంకా ఎన్నో ఉన్నాయంటే సాహితీ కారులకు ఆశ్చర్యమే మరి! 'గుడివాడ రత్నం' అనే ఒక కథ, 'నా దేశాటనం డైరీ' అనే బయోగ్రాఫికల్‌ వ్యాసం పాత భారతిలో అచ్చయ్యాయి.
          1917లో 'కవి సొంత అక్షరాలతో రాసిన 'కర్షక విలాసం' అనే నాటకం అదృష్టవశాత్తూ ప్రతి భద్రపరచి ఉంది. ఈ నాటకాన్ని 1917లో నెల్లూరు టౌన్‌హాల్లో ప్రదర్శించారు. ఇది ఇప్పటికీ గ్రంథస్థం కాలేదు. 'ధృవ' అనే మరో నాటకం కూడా అముద్రితమే. రేబాల లక్ష్మీనరసారెడ్డి మరణించిన సందర్భంగా దువ్వూరి రాసిన పద్యాలు, తనకు తెలుగు చెప్పిన అయ్యవారి స్మ ృతి సూచికగా రాసిన పద్యరచన, విలువిద్యలో నిపుణుడైన కలియుగార్జుడిపై రాసిన పద్యాలు, మరికొన్ని పద్య ఖండికలు, కొన్ని ఇంగ్లీషు జాబులు, రచనలు, వ్యాసాలు, ఇలా అన్నింటిని కెవి రమణారెడ్డి ప్రెస్‌ కాపీని అప్పట్లో సిద్ధం చేశారు.
           దువ్వూరి అముద్రిత రచనలు ఇంకా వెలుగుచూడాల్సి ఉన్నాయని శ్రీవాత్సవ అనేకసార్లు ప్రస్తావించారు. 1927లో నెల్లూరులో పెద్ద గాలివాన వచ్చినపుడు, దువ్వూరి 'తుఫాన్‌' కథ ఆంధ్రదినపత్రికలో అచ్చయినట్లు చెబుతుండేవారు. ఎంతో బాధ్యతగా చెప్పిన ఈ కథ విషయం ఎంత గాలించినా పత్రికలో పరిశోధకులకు దొరకలేదు. ఇంకా వెలుగు చూడాల్సిన కవి కోకిల ఇంగ్లీషు అనువాదిత గేయ రచనలు 'వాయిస్‌ ఆఫ్‌ ద రీడ్‌' ఆచ్చయిన తరువాత రామిరెడ్డి 'ఫలిత కేశం' కావ్యాన్ని ఇంగ్లీషులోకి అనువదించారు. మరికొన్ని చిన్న గేయాలు కూడా ఇంగ్లీషులో రాసి పెట్టారు. వీటన్నింటిని లండన్‌ ప్రెస్‌ వారిచే అచ్చు వేయించేందుకు ఒక ప్రయత్నం జరిగింది. పి.వి. రాజమన్నార్‌, కవికోకిల 'కళ పత్రిక రోజుల్లో రాసిన జాబుల కట్ట ఉందన్నారు. ఆ సంపుటం కూడా తయారు కావలసి ఉన్నది. దువ్వూరి అముద్రిత, గ్రంథ రూపంలో రాని రచనలను ఒక పుస్తకంగా తీసుకురావల్సిన అవసరం ఉంది.
 

(దువ్వూరి రామిరెడ్డి జననం : నవంబరు 9, 1895. మరణం : సెప్టెంబరు 11, 1947)
- ఈతకోట సుబ్బారావు
94405 29785