Nov 13,2023 13:05

ప్రొద్దుటూరు (కడప) : టిడిపి ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్చార్జి జీవి ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు పోలీసులు తరలిస్తుండగా... తన ఇంటి వద్ద నుండి పాదయాత్రగా ప్రవీణ్‌ కుమార్‌ పోలీస్‌ స్టేషన్‌కు బయలుదేరారు.

గత అక్టోబర్‌ నెలలో ... వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో గాంధీ రోడ్డులోని మెడినోవా సర్కిల్‌ వద్ద వైసిపి నేత అనుచరుడు బెనర్జీపై టిడిపి నాయకుడు భరత్‌ కుమార్‌ రెడ్డి కత్తితో దాడికి పాల్పడ్డారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జ్‌ జి.ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి ముఖ్య అనుచరుడు, తెలుగు యువత నాయకుడు భరత్‌ కుమార్‌ రెడ్డికి, బెనర్జీకి మధ్య వ్యక్తిగత విబేధాలు ఉన్నాయి. ఈ క్రమంలో మెడినావో సర్కిల్‌ వద్ద ఉన్న బెనర్జీతో భరత్‌ కుమార్‌ రెడ్డి గొడవ పడ్డారు. కొద్ది సేపటి తర్వాత బెనర్జీపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో బెనర్జీ కుప్ప కూలి పడిపోయారు. మెయిన్‌ రోడ్డులో ఈ సంఘటన జరుగుతున్నా ఎవరు అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. బెనర్జీ తల, శరీరంపై తీవ్ర రక్తగాయాలు అయ్యాయి. నిందితుడు భరత్‌ కుమార్‌ రెడ్డి సంఘటనా స్థలంలోనే కత్తి పడవేసి బుల్లెట్‌లో పారిపోయాడు. తీవ్రం గాయపడిన బెనర్జీని చికిత్స నిమిత్తం స్థానికంగా ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అక్కడి నుంచి కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ప్రొద్దుటూరు పట్టణంలో వైసిపి నాయకులు 'సామాజిక సాధికారిత బస్సు యాత్ర' నిర్వహిస్తున్న క్రమంలో ఈ సంఘటన జరగడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకొంది. ఈ సంఘటనపై ప్రొద్దుటూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈక్రమంలో ఈరోజు ఉదయం టిడిపి ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్చార్జి జీవి ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.