
- ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ద్రవ్యోల్బణం ప్రభావం
- రాజస్థాన్, తెలంగాణల్లో అత్యధికం
- పథకాలతో ఓటర్లకు పార్టీల గాలం
న్యూఢిల్లీ : అధిక ధరల ధాటికి ప్రజానీకం విలవిలలాడటం సహజం. కొన్ని సంవత్సరాలుగా దేశ ప్రజలు ఎదుర్కొంటున్న దుస్థితి ఇది. అయితే, అధిక ధరల అంశంపై ఎన్నికల వేళ ప్రజానీకం ఎలా స్పందిస్తారన్నదే ఆసక్తిదాయకం. ఈ ఏడాది మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు అధిక ధరల అంశం కూడా కారణమన్న సంగతి తెలిసిందే. గ్యాస్ సిలిండర్ ధర ఆ రాష్ట్ర ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది.
ఇదొక్కటే కాదు, దేశ చరిత్రలో ఇటువంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఉల్లిపాయ ధరలు చుక్కలు దాటడంతో 1998 ఎన్నికల్లో అప్పటి బిజెపి ప్రభుత్వం గద్దెదిగాల్సి వచ్చింది. తాజాగా ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరుగుతుండటంతో ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్న ద్రవ్యోల్బణం అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అసలు ఏ రాష్ట్రంలో ఎంత ద్రవ్యోల్బణం ఉంది ?
అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మిజోరంలలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ద్రవ్యోల్బణం ఉంది. కేంద్ర ప్రభుత్వ విధానాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలు కూడా దీనికి కారణం. సెప్టెంబరు నెల గణాంకాల ప్రకారం చత్తీస్‌గఢ్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 1.98 శాతంగా నమోదైంది. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఇదే అత్యల్పం. మధ్యప్రదేశ్‌లో 3.67 శాతంగా తెలంగాణలో 5.97 శాతంగా, రాజస్థాన్‌లో 6.53 శాతంగా ద్రవ్యోల్బణం నమోదైంది. మిజోరం గణాంకాలు అందుబాటులో లేవు. ఇండియన్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (సిపిఐ) ఆధారిత గణాంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం 5.02 శాతానికి తగ్గింది. ఇటీవల కాలంలో ఇలా ద్రవ్యోల్బణం తగ్గడం ఇది వరుసగా రెండవసారి. కొన్ని నెలల క్రితం వరకు చుక్కలు దాటి పరుగులు తీసిన ఆహార ధాన్యాల ధరలు కొద్ది మేరకు తగ్గుముఖం పట్టడం దీనికి ఒక కారణం. అయినా, ఎన్నికలు జరుగుతున్న తెలంగాణ, రాజస్థాన్‌లలో ద్రవ్యోల్బణం దేశవ్యాప్త సగటుకన్నా ఎక్కువగానే నమోదుకావడం గమనార్హం.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా
వినియోగ విధానాలను బట్టి ద్రవ్యోల్బణం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా నమోదవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, సరుకుల సరఫరా, డిమాండ్, మౌలిక సదుపాయాలు తదితర అంశాలు కూడా దీనిలో కీలకం. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా తక్కువ ధరకు సరుకులు సరఫరా చేసే రాష్ట్రాల్లోనూ ద్రవ్యోల్బణం తక్కువగానే నమోదు అవుతుంది. ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అధిక సబ్సిడీలను ఇస్తే ప్రజలకు ఆ మేరకు ఉపశమనం లభిస్తుంది. అందువల్ల ఆ రాష్ట్రంలో ద్రవ్యోల్బణం తక్కువగానే నమోదవుతుంది. అధిక సబ్సిడీలు ఇచ్చే రాష్ట్రాల్లో తక్కువ ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటానికి ఇదే కారణం. పెట్రోలియం ఉత్పత్తులపై అధిక పన్నులు విధించే రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటుంది. సరుకుల రవాణాతోపాటు, ప్రజా రవాణా వ్యవస్థ కూడా పెట్రో ధరలతో ముడిపడి ఉండటమే దీనికి కారణం.
'ఆ' రెండు రాష్టాల్లోనే అధికం...
తాజాగా ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లోనే అధిక ద్రవ్యోల్బణం నమోదైంది. రాజస్థాన్‌లో 6.53 శాతం, తెలంగాణలో 5.97 శాతంగా సెప్టెంబరు నెలలో ద్రవ్యోల్బణం ఉంది. ఈ రెండు రాష్ట్రాల ఆదాయంలో వ్యవసాయ ఉత్పత్తులే కీలకం కావడం గమనార్హం. అయినప్పటికీ పప్పు ధాన్యాలను ఇతర రాష్ట్రాల నుండి అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రెండు రాష్ట్రాల్లోనూ నెలకొంది. దీనితో పాటు పెట్రో ఉత్పత్తులపై ఈ రెండు రాష్ట్రాలు అధిక పన్నులు వసూలు చేయడంతో రవాణా భారంగా మారింది. ఫలితంగా ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది.
ఎన్నికలపై ప్రభావం...?
కులం, మతం, అధికార పార్టీపై వ్యతిరేకత, నగదు పంపిణీ వంటి అంశాలు కూడా ఓటర్లను ప్రభావితం చేస్తున్నప్పటికీ అధిక ధరల ప్రభావం కూడా ఎన్నికల ఫలితాలపై గణనీయంగా ఉంటోంది. దీనిని దృష్టిలో ఉంచుకునే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉచిత బియ్యం, ఉచిత విద్యుత్, మహిళలకు నెలవారి ఆర్థిక సాయం వంటి పథకాలను ప్రకటించింది. ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన విజయం వెనుక ఈ పథకాల ప్రభావం గణనీయంగా ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ బరిలో ఉన్న పార్టీలు పోటాపోటీగా పథకాలను ప్రకటిస్తున్నాయి. ఓటర్లు ఎటువైపు మొగ్గుతారో వేచి చూడాల్సి ఉంది. నెలకొంది. దీనితో పాటు పెట్రో ఉత్పత్తులపై ఈ రెండు రాష్ట్రాలు అధిక పన్నులు వసూలు చేయడంతో రవాణా భారంగా మారింది. ఫలితంగా ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది.