వర్షాకాలం వచ్చేసింది. ఇప్పుుడిప్పుడే చిన్న జల్లులు కాస్తా..వర్షాలుగా మారుతున్నాయి. వాతావరణంలో మార్పు వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. చిన్నారుల్లో ఫ్లూ, దగ్గు, జలుబు లాంటి ఇతర వైరల్ ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. వాటిని నివారించేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
పరిశుభ్రత
సరైన పరిశుభ్రత పాటించడం వల్ల వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. భోజనానికి ముందు, తర్వాత చేతులు శుభ్రంగా నీళ్లతో కడుక్కోవాలి. తుమ్మినా, దగ్గినా చేతులు అడ్డుపెట్టుకోవాలి. లేకుంటే ఇంట్లో ఉన్నవారికి, పెంపుడు జంతువులకూ వస్తుంది. బెడ్‌షీట్లు, కటన్లు తడిగా లేకుండా చూసుకోవాలి. ఎండ వచ్చినప్పుడు ఇంట్లోకి సూర్యకిరణాలు పడేలా కిటికి తలుపులు తీసి ఉంచాలి. వంట గదిలో ఎప్పటికప్పుడు చెత్త లేకుండా తీసి పారేయాలి. పొయ్యి మీద నూనె, కూర మరకలు లేకుండా వెంటనే తుడిచేయాలి. తడికి పప్పుడబ్బాలపై ఫంగస్ చేరే సమయం కూడా ఇదే. కాబట్టి తడి లేకుండా వంటగది పొడిగా ఉంచుకోవాలి. ఈ కాలంలో దోమల బెడద ఉంటుంది. వీలైనంత వరకూ ఇంటికి చుట్టు పక్కల ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
ఇంటి ఆహారం
ఈ కాలంలో వాతావరణం చల్లగా ఉందని బయట వేడి వేడిగా దొరికే పదార్థాలపై మనసు పోతుంది. కాని ఇంట్లో వండుకుని తింటే మంచిది. శరీరంలో వేడి కలిగించే ఆహారాన్ని రోజూవారి పదార్థాల్లో తీసుకోవాలి. కూరల్లో వెల్లుల్లి, మెంతులు, కాకరకాయ, పసుపు, నువ్వులు, మిరియాలు, సుగంధ ద్రవ్యాల పొడులు ఏవైనా కలుపుకొని తీసుకోండి. ఇవి అంటువ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. అధిక ఫైబర్ ఉన్న బార్లీ, గోధుమ, బియ్యం, ఉసిరి వంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి త్వరగా జీర్ణమవుతాయి. పండ్లు, పచ్చటి కూరగాయలను శుభ్రంగా నీళ్లలో కడిగి తినాలి. తేలికపాటి నూనెతో వంటలు చేసుకోవాలి. టీ, కాఫీలు ఎక్కువ తాగితే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. గోరు వెచ్చని నీళ్లు తాగాలి. చలిగా ఉందని మంచినీళ్లు తాగడం తగ్గించకూడదు. పెరుగు తప్పనిసరిగా పిల్లలకు ఆహారంలో ఉండాలి. ఇందులో మంచి బ్యాక్టీరియా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
సరిపడా నిద్ర
ఆరోగ్యకరమైన రోగనిరోధక శక్తికి మంచి నిద్ర ముఖ్యం. ఎక్కువ సమయం మేల్కొని ఉండటం, వెంటనే నిద్ర లేవడం రెండూ అనారోగ్యానికి దారి తీస్తాయి. సరిపడ నిద్ర లేకపోతే శరీరం ఒత్తిడికి లోనవుతుంది. వెంటనే అంటువ్యాధులు, వైరల్ ఫీవర్లు వచ్చే అవకాశం చాలా ఉంటుంది. అందుకే ఈ కాలంలో రాత్రుళ్లు త్వరగా తినేసి నిద్రపోవాలి.










