ప్రజాశక్తి-తిరుపతి :కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై వేస్తున్న భారాలు తగ్గించాలని, నిరుద్యోగులకు ఉపాధి, కరెంట్ చార్జీలు తగ్గించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్ చేశారు. శనివారం నగరి అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో 30 నుండి సెప్టెంబర్ 4 వరకు జరుగుతున్న సమరభేరి పోస్టర్ ఆవిష్కరణ గంగరాజు ఆవిష్కరించరాఉ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి ప్రజలపై భారాలు వేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు భారీగా పెంచిందని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవర్లూమ్ కార్మికులకు ఉచిత విద్యుత్ అమలు చేస్తానని చెప్పిన వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటివరకు అమలు చేయకపోవడం దారుణం అన్నారు. ఇప్పటికైనా తమిళనాడు తరహాలో 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేలాది మంది పవర్లూమ్ కార్మికులు కూలి రేట్లు పెంచాలని పెద్ద ఎత్తున పోరాటం చేయగా అన్ని రకాల అధికారుల సమక్షంలో ఒప్పందమైన కూలు రేట్లు కూడా సంవత్సరం అవుతున్న పెంచకపోవడం దుర్మార్గమన్నారు. నగరి పర్యటన సందర్భంగా వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పవర్లూమ్ కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించే పరిస్థితి లేకుండా వీధుల పాలు చేసే పరిస్థితి ఉందని దేశవ్యాప్తంగా సిపిఎం చేస్తున్న సమరభేరి కార్యక్రమం 30 నుండి ఒకటి వరకు విస్తృత ప్రచారం నిర్వహించి ఒకటి న సమస్యలపై సచివాలయాల దగ్గర వినతి పత్రాలు సెప్టెంబర్ నాలుగున మండల కార్యాలయం వద్ద ధర్నాలు జరుగుతాయని ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నగరి సిపిఎం కార్యదర్శి పెరుమాళ్ మాట్లాడుతూ పవర్లూమ్ కార్మికుల సమస్యలపై సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జగదీష్ తదితరులు పాల్గొన్నారు










