Nov 22,2023 10:01
  • విచారణ అనంతరం నోటీసు ఇచ్చి విడుదల

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : సోషల్‌ మీడియాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబసభ్యులపై అసభ్యకరంగా పోస్టులు పెట్టారంటూ గుంటూరు జిల్లా పెదవడ్లపూడి గ్రామానికి చెందిన ఐటి ఉద్యోగి జి.రాము (25)ను సిఐడి అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. విదేశీ ఐటి కంపెనీకి ఇంటి వద్ద నుంచి విధులు నిర్వహిస్తోన్న ఆయన ఈ ఏడాది ఫిబ్రవరి 16 (మహాశివ రాత్రి రోజు)న పోస్టింగులు పెట్టారు. దాదాపు ఎనిమిది నెలల తరువాత రామును మంగళవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకొని మంగళగిరిలోని సిఐడి ప్రధాన కార్యాలయా నికి తరలించారు. రాత్రి వరకు విచారించి అనంతరం విడిచి పెట్టారు. వచ్చే మంగళవారం తిరిగి విచారణకు రావాలంటూ 41 'ఎ' కింద సిఐడి అధికారులు ఆయనకు నోటీసులు అందజేశారు. సిఐడి అధికారి డి.చంద్రశేఖర్‌ నేతృత్వంలో విచారించారు. అంతకు ముందు పెదవడ్లపూడిలో అరెస్టు చేసిన రామును ఎక్కడ ఉంచిందీ తెలియక ఆయన కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చెందారు. టిడిపి లీగల్‌ సెల్‌ విభాగం న్యాయవాదులు ఆరా తీసి మంగళగిరిలో ఉన్నట్టు కనుగొనడంతో ఊపిరిపీల్చుకున్నారు.