
ఇటీవల కేంద్ర సాహిత్య అకాడెమీ వారిచే ప్రతిష్ఠాత్మక 'భాషా సమ్మాన్' పురస్కారం పొందిన సందర్భంగా ఆచార్య బేతవోలు రామబ్రహ్మంతో సంభాషణ టూకీగా ...
కేంద్ర సాహిత్య అకాడమీ వారి భాషా సమ్మాన్ పురస్కారాని ఎంపికవడంపై మీ అనుభూతి ...
'భాషా సమ్మాన్' ఆనందాన్ని, సంతప్తిని పుష్కలంగా కలిగించిందన్న మాట వాస్తవం. ప్రాచీన-మధ్య యుగాల సాహిత్యాన్ని (క్రీ.శ 11 నుంచి 18వ శతాబ్ది) ఆధునిక పాఠకులకు చేరువజేస్తున్న కషికి గుర్తింపు. దక్షిణ భారతీయ భాషల్లో ఎవరో ఒకరికి మాత్రమే ఇచ్చే పురస్కారం. 'దేవీభాగవతం' అనువాదానికి అకాడమీ పురస్కారం వచ్చినప్పటికన్నా, ఇప్పటి ఆనందం మిన్న. మునుపు 'ప్రెసిడెంట్స్ సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్సు' పొందినప్పటి ఆనందంతో సరిసమానమైన సంతప్తి, ఆనందం కలిగాయి.
హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రంలో తెలుగుకు మీరు చేసిన కషి ?
ఈ కేంద్రాన్ని యూజీసి నుంచి ప్రత్యేకంగా మంజూరు చేయించి మరీ నాకు అప్పజెప్పారు. ఈ కేంద్రంలో దాసరి లక్ష్మణస్వామి గారు సంకలనం చేసిన ఏడు వేల పద్యాల గ్రంథానికి 'పాఠకమిత్ర వ్యాఖ్యానం'తో 'వర్ణన రత్నాకరం' పేరుతో 23 సంపుటాలు ప్రచురింపజేయడం. నేను, అద్దంకి శ్రీనివాస్, నరాల రామారెడ్డి, ఆర్వీఆర్కే శాస్త్రి ... ఇలా ఎంతోమంది కలిసి వ్యాఖ్యానం సమకూర్చాం. నా పదవీకాలం పొడిగించి మరీ ఆ 23 సంపుటాలను పూర్తిచేయడానికి అవకాశం కల్పించారు.
మీరు తెలుగుపై కాక ఎక్కువ సంస్క త కావ్యాల మీదనే ఫోకస్ పెట్టడానికి కారణం ?
అలా అని ఏమీ లేదు. తెలుగు పద్య కావ్యాలను ఆధునిక పాఠకులకు అందించే విషయానికే అగ్రతాంబూలం ఇచ్చాను. ఆ కోవలో హరివంశము, కేయూరబాహు చరిత్రము, రాజశేఖర చరిత్ర, వరాహపురాణం, ఉత్తర రామాయణం, పధ్వీ భాగవతం వంటి ఎన్నో తెలుగు గ్రంధాలకు వ్యాఖ్యానం రాశాను. అలా నా వ్యాఖ్యాన స్రవంతి తెలుగు, సంస్క తాలు రెండింటిలోనూ సాగుతూ ఉంది.
పద్య ప్రక్రియ ఇప్పుడెలా ఉంది ?
వచనమైనా, పద్యమైనా అందులో కవిత్వం లేకపోతే ఎవరిని ఆకర్షించదు. కవిత్వం జీవధాతువులాగా ఉండాలి. ఏ ప్రక్రియైనా ప్రజలు నెత్తిమీద పెట్టుకోవడానికి కానీ, నేలకు విసిరి కొట్టడానికి గాని, ఆయా కవులే కారణమని నా అభిప్రాయం. ఇప్పుడు అన్ని ప్రక్రియలూ నువ్వా నేనా అన్నట్టు హౌరెత్తుతున్నాయి. అందుకని పద్యమైనా, వచన కవిత్వమైనా దేనికీ ఢోకా లేదు.
యువ కవులకు మీ సందేశం ఏమిటి ?
నా సందేశం ఒక్కటే - ప్రాచీన సాహిత్యంలో కూడా ఎంతో కవిత్వ పటుత్వ సంపద దాగి ఉంది. మీ కోసం మేమందరం శ్రమపడి రాస్తున్న వ్యాఖ్యానాలను శ్రద్ధగా చదవండి. లబ్ధి పొందండి. మా శ్రమ వథా కానివ్వకండి.
- డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య
94904 00858