పుస్తకాల్లో పత్రికల్లో పెరుగు రామకష్ణ గారి పేరు చూసినా, ఇంటిపేరు చూసినా, ఆయన గంభీరమైన నిలువెత్తు రూపం చూసినా, పండువెన్నెల లాంటి ఆయన మోము చూసినా, ఆ కళ్ళలోని స్ఫురద్రూపత్వం చూసినా, వివిధ సందర్భాల్లో తను స్పందించే తీరు చూసినా, తన కవిత్వంలోని చిక్కదనం చూసినా అమ్మ తోడు పెట్టి పేరబెట్టిన కమ్మని గడ్డ పెరుగు గుర్తొస్తుంది. కవిగా ప్రాంతీయం, జాతీయమైన ఎల్లలు దాటి అంతర్జాతీయంగా కూడా 'పొయట్ లారియట్' గా సుప్రసిద్ధులైన ఆయనను పరిచయం చెయ్యక్కర్లేదు. కానీ, నేటి తరం కవుల కవిత్వంతో పోటీపడి వారి తాజా కవితా సంపుటి 'వర్ణలిపి' డా.మల్లవరపు రాజేశ్వరరావు స్మారక వార్షిక కవిత్వ పురస్కారాలు - 2023కు ఎంపికైన సందర్భంగా ఆ కమ్మని గడ్డ పెరుగులో వేలుపెట్టి రుచిచూడ్డం సందర్భోచితంగా ఉంటుంది.
వర్ణలిపి అనే పదబంధంలోనే గడుసుదనం ఉంది. అది అనేక విధాలుగా అర్థం చేసుకునేలా చేస్తుంది. ప్రపంచ భాషల్లో లిపి అనేది వర్ణ లిపి, అక్షర లిపి అని రెండు రకాలు. ఈ పదబంధాన్ని ఒక భాషాశాస్త్రవేత్త వింటే ఇది ఏదో భాషాశాస్త్ర సంబంధమైన రచన అని అనుకుంటారు. ఈ దేశంలో తెల్లని ఆర్యజాతి, నల్లని ద్రవిడ జాతి చరిత్ర స్పష్టంగా గుర్తు పట్టలేని ఆదిమ కాలంలోనే కలిసిపోయి అనేకమైన మిశ్రవర్ణ శూద్రజాతులు పుట్టుకురావడం వల్ల ఇక్కడ వర్ణం అనేది బాగా పాతబడిపోయింది. అది మనువు, మనువాదం చేసిన కుట్రల వల్ల కులంగా బలపడి చేవబారిపోయింది. అందువల్ల ఒక సామాజిక శాస్త్రవేత్తగాని, ఒక సాహితీవేత్త గాని ఈ పదబంధాన్ని వింటే ఇదేదో దేశంలోని సామాజికవర్గాల విశ్లేషణకు సంబంధించిన రచనగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కానీ, ఈ పదబంధానికీ ఈ రెండు ఊహలకూ సంబంధం లేదు. అనాది నుండి అంతర్జాతీయంగా మనిషిని విడదీస్తున్నది అతని శరీరవర్ణం... మేనిరంగు. అలెక్స్ హేలీ రచన 'రూట్స్' లోని కుంటాకింటే నుండి ఇటీవల అమెరికాలోని తెల్లజాతి పోలీసు అధికారి బూటుకాలి కింద నలిగిపోయి అసువులు కోల్పోయిన జార్జి ప్లాయిడ్ వరకూ అది చేసిన దాష్టీకం అంతా ఇంతా కాదు. ప్లాయిడ్ ఉదంతంతో పెరుగు రామకృష్ణ నిలువునా కరిగిపోయి 'వర్ణలిపి' అనే వచన పద్యంగా బయటపడ్డారు. అలాగని ఇదేమీ అదే అంశంపై దీర్ఘకావ్యం కాదు. కానీ, ఈ శీర్షిక వల్ల ఈ కవి రంగూరుచీ తెలుస్తాయి. ఆయన సామాజిక దృక్పథం, సాహిత్య నేపథ్యం తెలిసొస్తాయి.
వర్ణలిపిలో రామకృష్ణ 30 పద్యాలతో స్వీయ కవిత్వం, 23 పద్యాలతో అనువాద కవిత్వం కలిపి తన వాదం, అనువాదం వినిపించారు. ఆయన మానవ సంబంధాలను సంఘటనా ముద్రలుగా గుర్తుంచుకుంటారు. వాటిని 'బుగ్గమీద అమ్మ పెట్టిన ముద్దు/ ఎప్పుడు బుగ్గ తుడుచుకున్నా అమృత మధురం' 'నువ్వు పలకరించిన చిరునవ్వు పూలు/ మనసువాడలో వాడనేలేదింకా' లాంటి వాక్యాలుగా అభివ్యక్తం చేసి పాఠకుణ్ణి తన జ్ఞాపకాలు తడుముకునేలా చేస్తారు. తన చెమటోడ్చి మనిషికి ప్రాథమిక అవసరమైన అన్నం పెట్టే రైతంటే ఆయనకు ఎనలేని ప్రేమ. 'సింహపురి రైతు' పత్రికలో ప్రముఖపాత్ర వహిస్తూ రైతు రుణాన్ని తీర్చుకుంటున్న కవి ఆయన. మూడు రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ ఉత్తర భారతంలో అన్నదాతలు ఉద్యమిస్తున్నప్పుడు ఆయన 'విత్తును నాటి ప్రాణ ప్రతిష్ట చేసే/ పచ్చని సంజీవని చేతులు/ ఆ చేతులంటే నాకు ఎంతో ఇష్టం', 'తడినేల మీద గాయాల మొలకలెత్తక ముందే/ ఆ చేతులు గెలవాలి' అని కోరుకున్నారు. రైతుని పొలం పత్రంలో పంటల కవిత్వం పండించే కవిగా చూసే రామకృష్ణకి రైతన్నా, సేద్యం అన్నా అలవిమాలిన అభిమానం.
పెరుగు ఎప్పుడూ గడ్డకట్టి ఉంటుంది. కానీ, దానికి కరిగే గుణం ఎక్కువ. కవుల్లో కూడా పెరుగు రామకృష్ణ కూడా అంతే! సమకాలంలో జరుగుతున్న ప్రతి ఘటనకీ, ప్రతి ప్రతిఘటనకీ ఆయన కలం స్పందిస్తుంది. వాటితో ఆయన గళం మమేకమౌతుంది. ప్రపంచంలో ఒక వింత ధోరణి ఉంది. నల్లజాతి అణగారిన వర్గాల్ని తెల్లజాతి ఆధిపత్య వర్గాలు కావలిసినంత వాడుకుంటాయి. వాళ్ళ కష్టార్జితాన్ని కడుపునిండా మెక్కుతాయి. కానీ వాళ్ళ అస్తిత్వాన్ని ఒప్పుకోవు. అలాంటి సందర్భంలో నల్లజాతి ఔన్నత్యాన్ని చాటిచెప్పే బాధ్యతని కవిగా రామకృష్ణ తీసుకుంటారు. ''మనం చూసే కన్ను నలుపు/ మన చూపులెప్పుడూ తెలుపే/ నలుపు వినా తెలుపు విలువ సున్నా/ తెల్లని మేఘాలు నలుపెక్కితేనే గానీ/ నేల తల్లికి పురుడు సాధ్యం కాదు/ నల్లని రాత్రి తెల్లవారితే కాని సూర్యబింబానికి గగనాన చోటుండదు/ నలుపు - తెలుపుల మేలిమి సమ్మేళనం జీవితం'' అని కళ్ళు తెరిపిస్తారు. ప్రపంచ అస్తిత్వానికి రెండు జాతుల అవసరాన్ని నొక్కి చెబుతారు.
రామకృష్ణ ప్రజల పక్షాన నిలబడే కవి. ''చూపులతోనే ఐస్ క్రీం చప్పరిస్తూంది అనాధపిల్ల'' అన్నప్పుడు, క్యాపిటలిస్టు సంస్క ృతికి ప్రతినిధి ఐన ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నప్పుడు కూడా ''నువ్వు రావాలంటే సముద్రం రోడ్డవ్వాలి/ చీకటి నవ్వుతూ ఆహ్వానించాలి'' అన్నప్పుడు రామకృష్ణ ఎవరి పక్షాన ఉన్నాడో లోతుగా ఆలోచిస్తే తెలుస్తుంది. గతాన్ని అందులోని అమానవీయతల్ని తలచుకుని కన్నీరు పెడతారాయన. 'రహస్యముద్ర' కవితలో దేవదాసీ వ్యవస్థని సృష్టించి, వాడుకుని వదిలేసిన సమాజంపై సుతిమెత్తని చురకలేస్తారు. 'ఓ కలల వేకువ'లో ''గతం విసరిన విషవాయువుల నుండి/ నూతన శ్వాస పీల్చుకోవడమే కదా ఉగాది'' అంటారు. విశాఖ ఉక్కు విషయంలో తెలివిడి లేని ప్రభుత్వం ''చెట్టు విరగకాచినప్పుడు అమ్ముకుని/ ఆకులు రాల్చినప్పుడు గొడ్డలి పట్టుకుని'' నరికే న్యాయం పాటిస్తున్నదనీ విమర్శిస్తారు. ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే ''తెలుగుగడ్డపై మళ్ళీ ఎగసిన చేతులు/ జనఘోషై మరోసారి ఉప్పెనగా మారుతుంటే/ కబోది పాలకులకు తపోభంగం కాక తప్పదు..!'' అని హెచ్చరించారు.
ప్రపంచీకరణ అకృత్యాలను రామకృష్ణ కవిత్వం ఎండగడుతూ ఉంటుంది. ప్రపంచీకరణ లాభాల రూపంలో దోపిడీ చెయ్యడమే కాదు ప్రకృతిని కోలుకోలేని విధంగా ధ్వంసం చేస్తున్నది. దాని పుణ్యమా అని చెట్లు పోయి ఇనుపచెట్లు మొలుచుకొచ్చాయి. జీవ వైవిధ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. ఇప్పుడు ''శూన్యం నిండా ఇనుపచెట్ల దర్శనం/ సాలెగూడులా నగరానికి అల్లుకున్న టవర్ల పైన/ క్రూరపు గద్దల కాపురం'' అని వాపోతారు ఆయన. ''మానవజాతి అభివృద్ధి కోసం/ జీవవైవిధ్యాన్ని నాశనం చేస్తున్న విధ్వంసకారుడిలా/ ఆ బొమ్మ ముందు మోకరిల్లిన నేరస్తుణ్ణి నేను...!'' అని మానవుడిగా తనపై నేరారోపణ చేసుకుని ముద్దాయిలా నిలబడే రామకృష్ణ ఎంత నిబద్ధత కలిగిన మనిషో అర్థమవుతుంది. బడా షాపింగ్ మాళ్ళు వచ్చి చిల్లరంగళ్ళు చతికలబడిపోతున్నాయి. ''పేదోడి పొట్ట కొట్టి/ పెద్దోళ్ళకు దోచి పెట్టడమే/ ఇదో బహుళ రాజకీయం'' ''వ్యాపారం వాడిదే, దోపిడీ వాడిదే/ లూటీ చేయబడ్డ వాడే గరీబు/ సిరి వాళ్ళింటి ఆడపడుచు/ చిన్నకొట్టు వాడు మట్టి కొట్టుకుపోతున్నాడు'' అని బహుళజాతి కంపెనీల గుట్టు రట్టు చేస్తారు. ''మాల్‌ను చూస్తుంటే పూర్వపు పాలెగాళ్ళు గుర్తుకొస్తున్నారు/ చిల్లర రేటుకు కొనబడుతున్న చెమట గుర్తుకొస్తున్నది/ ఇప్పుడు మాల్ కన్ను పొలం పంటపై పడింది/ అమ్మో, దేశం అమ్మకానికి సిద్దమౌతున్నట్టుంది..!'' అని భవిష్యత్తు భయాలు చెప్పి జాగృతం చేస్తున్నారు. ప్రపంచీకరణ వల్ల మానవ సంబంధాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ''ఇప్పుడు రెండు హృదయాల మాట దేవుడెరుగు../ ఆ యింటి గాలి ఈ యింటికి/ ఈ యింటి గాలి ఆ యింటికి సోకరాదని'' అన్నట్టు పరిస్థితి తయారైందని బాధపడతారు కవి.
రామకృష్ణ ప్రగతిశీల కవి. కరోనా కాలంలో బంధు మిత్రులు కనీస మానవత్వం కూడా మరిచిపోయి మొహం చాటేసినపుడు ముస్లిం సోదరులు ఎంతో సాహసించి ఎందరికో అంతిమ సంస్కారాలు చేశారు. వాళ్ళని సరిహద్దు సైనికులతో పోల్చి సలాం అంటారాయన. ''ఓం అల్లానమస్సలామ్..!'' పద్యంలో దేశంలో హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా ఉంటారని, రాజకీయాలే వాళ్ళని విడదీసి ఐక్యతని దెబ్బదీస్తుంటాయని బాధపడతారు. మానవులు అందరిలాగే రామకష్ణ గారికీ గతకాలం పట్ల అభిమానం ఉంది. 'ఒకనాటి ఎన్జీవో' పద్యంలో ఆయన ఆనాటి ఎన్జీవోలు ఎంత నిస్వార్థంగా పనిచేశారో గుర్తుచేసుకుని నిట్టూరుస్తారు. మే నెల అంటే మేడేతో ప్రారంభం అవుతుందని ఆయన గుండె సందడి చేస్తుంది. రామకృష్ణ హృదయమున్న కవి. అందుకే ఆయనలో యుద్ధవిముఖత ఉంది. 'యుద్ధచరిత్ర' పద్యంలో ''సైనికుడా! ప్రపంచంలో యుద్ధం వొక్కటే/ పరిష్కారం కాదని నీ ఆత్మకు తెలుసు/ తెలిసే చేస్తున్న తప్పుకు/ యుద్ధవిరమణే ప్రాయశ్చిత్తం కాదు/ రక్తంతో తడిసిన ఆ నేలలో/ నాలుగు స్నేహహస్తాలు నాటిపో'' అని పిలుపునిస్తున్నారు.
అనువాద కవిత్వ విభాగంలో కొంత ప్రగతిశీలత్వం, అధికంగా స్త్రీలోని స్వచ్ఛమైన ప్రేమ పట్ల ఆరాధనా భావం కనిపిస్తాయి. గంభీరమైన శరీరాకృతి దృష్ట్యా చూసినా, సాహిత్య నేపథ్యం దృష్ట్యా చూసినా, సాహిత్యాన్నీ, సాహితీ పిపాసువులను ఆదరించే గుణం దృష్ట్యా చూసినా ఆయనకు తెలంగాణా సోదరకవి మువ్వా శ్రీనివాసరావు గారితో పోలికలు కనబడతాయి. 'ఆమె మనసు' పద్యం చదివితే ఆయన నిత్యం సామాజికోద్యమాల్లో పాల్గొంటూ తన స్వజీవితాన్ని కోల్పోయిన అసంతృప్తి కొంచెం కనబడుతుంది. ''జీవితానికి నిర్వచనం సర్దుబాటు/... పెళ్ళంటే రెండు హృదయాల అఖండ జ్వలిత దీపం'' దంపతులు అది గుర్తించి నడుచుకోవాలని ఆయన అంటారు. పెరుగు రామకృష్ణ ఉబుసుపోక కవి కాదు. ''ఉదయపు కోడికూత కవిత/... కవిత చప్పట్ల మోత కాదు/ కవిత పుస్తకాల దొంతర కాదు/ కవిత శాలువల సన్మానం కాదు/ కవిత గాయపడ్డ నిస్సబ్ద హదయానికి సజీవస్పర్శ..!'' అని ఆయన అన్నట్లు సామాజిక నిబద్ధత కలిగిందే కవిత్వం అన్న అవగాహన, ఆ నమ్మకం ఉన్న సీరియస్ కవి. ఆయన కవిత్వం జున్ను లాగా పసందుగా ఉంటుంది. పెరుగన్నం లాగా హాయిగా ఉంటుంది. ఆయనది గడ్డపెరుగు లాంటి కవిత్వం.
- కవితశ్రీ
94946 96990