
- సెప్టెంబర్ మధ్యకొచ్చినా ప్రభుత్వంలో కనీస కసరత్తు లేదు
- సహాయం కోసం కేంద్రానికి అభ్యర్థనల్లేవు
- 9 జిల్లాలు... 323 మండలాల్లో వర్షాభావం
- 30 లక్షల ఎకరాల్లో సాగు ప్రశ్నార్ధకం
- ఇప్పటికి 21 లక్షల ఎకరాల్లో తక్కువ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : రుతుపవనాల వైఫల్యం, ఎల్నినో ప్రభావాలతో ఈ మారు ఖరీఫ్‌లో కరువు పరిస్థితులు నెలకొనగా, నివారణా చర్యలపై సెప్టెంబర్ మాసం సగం గడిచినా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఖరీఫ్ కాలం సెప్టెంబర్ చివరాఖరు తర్వాత కరువు మండలాలను ప్రకటించడం ఆనవాయితీ. అయినప్పటికీ జులై రెండవ వారం నుంచే పరిస్థితులను బేరీజు వేసుకొని అవసరమైన కంటింజెన్సీ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తారు. కాగా ఆగస్టు వెళ్లిపోయి, సెప్టెంబర్‌లో రెండు వారాలు గడిచినా కరువు గుర్తింపు, ప్రత్యామ్నాయ పంటలు, అత్యవసర ప్రణాళికలపై ప్రభుత్వంలో అసలు చర్చే లేదు. కేంద్రానికి సహాయం కోసం వినతిపత్రం సమర్పించడంపై కనీస కసరత్తు లేదు. రాష్ట్ర కేంద్రం జిల్లా కలెక్టర్లను నివేదికలు సైతం ఇప్పటి వరకు అడగలేదని సమాచారం. వైసిపి సర్కారు వచ్చాక నాలుగేళ్లలో ఒక్క కరువు మండలం కూడా ప్రకటించలేదు. వర్షాలు దండిగా పడటం వలన ఆ అవసరం రాలేదని సర్కారు చెబుతోంది. అయితే అక్కడక్కడ తీవ్ర వర్షాభావం, డ్రైస్పెల్స్ ఉన్నా సాధారణ సగటు లెక్కలతో కరువు ప్రకటనను దాట వేసింది. నిరుడు ఖరీఫ్ ముగిసే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 273 మండలాల్లో వర్షాభావం, డ్రైస్పెల్స్, పంటల సాగులో లోటు, పంట నష్టాలు నెలకొన్నాయి. కాగా అనంతరం కురిసిన వానలతో పరిస్థితి సాధారణ స్థితికొచ్చిందన్న సాకుతో కరువును ప్రకటించలేదు. ఈ తడవ కూడా అదే ఆలోచనతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తున్నట్లు తెలుస్తోంది.
350 మండలాలు...
రాష్ట్ర వ్యాప్తంగా 679 మండలాలుండగా కరువు ప్రకటనకు సుమారు 300-350 మండలాలు అర్హత సాధిస్తాయని యంత్రాంగం అంచనా వేసింది. సెప్టెంబర్ 14 నాటికి 323 మండలాల్లో వర్షాభావం ఉంది. కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య, తిరుపతి.. ఈ తొమ్మిది జిల్లాల్లో తక్కువ వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 16.6 శాతం మైనస్ వర్షపాతం నమోదైంది. సగటు లెక్కల్లో పరిస్థితి బాగున్నట్లు కనిపించినా క్షేత్ర స్థాయిలో వర్షాభావం సమస్య తీవ్రంగా ఉంది. ఎపిలోనే కనిష్టంగా నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో మైనస్ 75.6 శాతం వర్షపాతం నమోదైంది.
34 శాతం బీడే
ఖరీఫ్ సీజన్ సాధారణ సాగులో 30 లక్షల ఎకరాల్లో సాగు తగ్గుదల కనిపిస్తోంది. 34 శాతం విస్తీర్ణంలో సేద్యం ప్రశ్నార్ధకంగా మారింది. సీజన్ నార్మల్ 85.97 లక్షల ఎకరాలు కాగా 56.62 లక్షల ఎకరాల్లోనే పంటలు వేశారు. సెప్టెంబర్ 14 వరకు కావాల్సిన సాగులో 21 లక్షల ఎకరాల్లో (26 శాతం) సాగు లేదు. ఈపాటికి 76.70 లక్షల ఎకరాల్లో పంటలు వేయాలి. అన్ని పంటలూ తగ్గాయి. ఇప్పటి వరకు చూసుకుంటే వరి 4.25 లక్షల ఎకరాలు, తృణధాన్యాలు 20 వేల ఎకరాలు, పప్పుధాన్యాలు 2.30 లక్షల ఎకరాలు, మొత్తం ఆహార ధాన్యాలు 6.78 లక్షల ఎకరాలు, వేరుశనగ 8 లక్షల ఎకరాలు, మొత్తం నూనెగింజలు 7.90 లక్షల ఎకరాలు, పత్తి 4.73 లక్షల ఎకరాల్లో తగ్గింది. ఈ ఏడాది ప్రధాన ప్రాజెక్టులలో నీటి నిల్వలు అడుగంటడంతో వరి తగ్గింది. ఆరుతడి పంటలకు సైతం అనుమానంగానే ఉంది. వర్షాభావం వలన మెట్ట సేద్యం సాగలేదు. అదనుకు వానలు పడక వేసిన పంటలు దెబ్బతిన్నాయి. ఈ నెల మొదటి వారంలో కురిసిన వానలు కొంత వరకు మెట్ట పంటలకు ఊపిరి పోశాయి. ఈ వానలు కొత్తగా పంటల సాగుకు ఏ మాత్రం అనుకూలం కాదని, అదను తప్పిందని రైతులు చెబుతున్నారు.

