
నేడున్న సమాజంలో ఆడ పిల్లలంటే ఏదో ఒక చులకనభావం... వాళ్లు ఏమీ చేయలేరనీ, సాధించలేరనే పురాతన భావజాలం నేటికీ కొనసాగుతోంది. అలాంటి యుగయుగాల భావజాలం సరికాదనీ, మేమూ అన్ని రంగాల్లోనూ రాణిస్తామని మహిళలు అనేక సందర్భాల్లోనూ చాటిచెబుతున్నారు. ఇంట్లో కుటుంబ పెద్దయిన తండ్రి ఉంటే పిల్లల ఆలనాపాలనా చూస్తారు. తండ్రి అనారోగ్యం కారణంతోనే మరే ఇతర కారణంతోనైనా చనిపోతే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో కకావికలమైపోవటం ఖాయం. సరిగ్గా ఇలాంటి ఘటనే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. చిన్నవయస్సులోనే తండ్రిని కోల్పోవటంతో ఓ యువతి తన కుటుంబాన్ని తొమ్మిదిమందితో వ్యవసాయాన్నే నమ్ముకుని అద్భుతాలు చేయటం తాజాగా ప్రశంసనీయంగా మారింది.
నాన్నే నాకు స్ఫూర్తి...
'వ్యవసాయంలో ఎంత శ్రమ ఉన్నా. నాన్న చాలా ఓర్పుగా చేసేవారు. ప్రయత్నిస్తే ఏ రంగంలోనైనా విజయం సాధించొచ్చునని చెబుతుండేవారు. అతని దృఢ సంకల్ప శక్తి, కృషితో నేను ఎప్పుడూ ప్రేరణ పొందాను' అని బబిత తన తండ్రి గురించి చెబుతూ చెప్పింది. '13 సంవత్సరాల వయస్సులో, నేను పొలంలో నాగలి పట్టుకుని పరిగెత్తినప్పుడు, నేను ఎప్పుడూ అలసిపోలేదు. ప్రతి రోజూ పని ముగిసే సమయానికి, నాలో ఒక కొత్త శక్తి ఉంది, అది నన్ను ఈ రోజు విజయవంతమైన దశకు తీసుకొచ్చింది. 'వ్యవసాయ ఆదాయం మా ఇంటి ఖర్చులను తీరుస్తున్నప్పుడు అది నా కుటుంబ సభ్యుల ముఖాల నుండి ద్ణుఖాన్ని దూరం చేసింది. ఇది నాకు చాలా సంతృప్తినిచ్చింది' అని బబిత చెప్పారు.
ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌లోని సౌద్ ఉమ్రేలా గ్రామానికి చెందిన సురేంద్ర సింగ్ రావత్‌ది చిన్నపాటి వ్యవసాయ కుటుంబం. ఆయనకు భార్య, ఎనిమిది మంది కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయంతోనే కుటుంబపోషణ. ఆ గ్రామం పూర్తిగా కొండిపాంతంలో ఉంది. తన శక్తియుక్తులను జోడించి ఉన్న కొద్దిపాటి పొలంలో వివిధ పంటలు, కూరగాయలు వంటివి పండిస్తే రావత్ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 2009లో ఆయన మృత్యువాత పడ్డారు. పెద్ద కుమార్తె బబిత రావత్. ఆమె వయస్సు అప్పటికి 13 సంవత్సరాలే.. ఇంటర్మీడియట్ చదువు పూర్తయ్యింది. పై చదువులకు వెళ్లే పరిస్థితి లేదు. ఏడుగురు తోబుట్టువులతో సహా తల్లితో కలిపి తొమ్మిది మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేయబడింది. ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి! తండ్రి బతికున్నప్పుడు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని సాకేవాడు. ఆయన మరణించాక వ్యవసాయం మూలన పడింది.
వ్యవసాయమే ఆధారంగా...
చదువును పూర్తి చేయడంతో పాటు, కుటుంబ బాధ్యతను తన చిన్న భుజాలపై వేసుకొంది బబిత. కుటుంబ పోషణ కోసం వ్యవసాయం చేయాలని నిర్ణయించుకుంది. తొలుత కుటుంబ సభ్యులు, చుట్టుపక్కలవాళ్లు కూడా 'నీ వల్ల అవుతుందా?' అంటూ నిరుత్సాహపరిచారు. అయినా వెనుకంజ వేయలేదు. నాగలి పట్టింది. అరక దున్నింది. పంటలు పండించింది. దిగుబడులు ఆశించిన వాటికంటే మెరుగ్గానే వచ్చాయి. ఆమెలో నమ్మకం మరింత పెరిగింది. సొంతంగా ఉన్న పొలానికి తోడు మరికొంత పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసింది. వాటిలోనూ మంచి ఫలితాలను సాధించింది.
చావా?.. సాగా..!
తండ్రి చనిపోయినప్పుడు బబిత రావత్ కన్నీటి పర్యంతమైంది. తరువాత బాధ్యత గుర్తొంచింది. తపన ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ప్రపంచానికి నిరూపించాలని అనుకుంది. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగింది. అనతికాలంలోనే వందలాది మందికి ఉపాధి కల్పించే స్థాయికిచేరింది.
ప్రస్తుతం 27 ఏళ్ల వయసున్న బబిత, భారతీయ కుటుంబంలో పురుషుడు మరణించిన తర్వాత కుటుంబ బాధ్యతలను నిర్వహించడానికి పురుష సభ్యులు మాత్రమే అర్హులనే పాత అపోహను తొలగించాలని కోరుతోంది.
ఐదుకిలోమీటర్లు వెళ్లి పాలుపోసేది
బబిత జీవితం తన వయస్సులో ఉన్న ఇతర పిల్లల లాగా ఎప్పుడూ సుఖంగా లేదు. కానీ ఆమె ఎప్పుడూ నిరుత్సాహం పొందలేదు. ప్రతిరోజూ సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగింది. రోజూ ఉదయం పొలానికి వెళ్లి పనులు పూర్తయ్యాక ఐదు కిలోమీటర్లు నడిచి రుద్రప్రయాగ వెళ్లి ఖాతాదారులకు పాలు పోసి ఇంటికి వచ్చేది.
సవాళ్లతో స్వయం ఉపాధి దిశగా పయనం
పర్వత ప్రాంతంలో వ్యవసాయం ఏమాత్రం ఆషామాషీ కాదు. వర్షాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు వాటిలో భాగమే. ఇవే కాకుండా సమాజం నుంచి ఒత్తిళ్లు, జీవనయాన సమస్యలు వంటివి అనేక జీవిత సవాళ్లను ఎదుర్కొన్నారు. ప్రకృతి అడుగడుగునా పరీక్షిస్తున్నా వాటి విషయ పరీక్షలను తట్టుకుని వ్యవసాయంలో రాటుతేలింది. తన పొలాల్లో దాదాపు అన్ని రకాల కూరగాయలను ఉత్పత్తి చేయిస్తోంది. గత రెండేళ్లుగా ఆమె పుట్టగొడుగుల పెంపకంలోనూ ప్రావీణ్యత సాధించారు. సరికొత్తగా వ్యవసాయం చేస్తూ పత్యక్షంగానూ, పరోక్షంగా మరో 100 మందికి ఉపాధి అవకాశం కల్పిస్తున్నారు. ఇతర ఆదాయ మార్గాలను చూపిస్తున్నారు. జీవనోపాధి అవకాశాలపై అవగాహన కల్పిస్తున్నారు.
పలువురి ప్రశంసలు
వ్యవసాయం ద్వారా కుటుంబపోషణతో పాటుగా పలువురికి ఉపాధి కల్పిస్తున్నందుకు బబితారావత్ కృషి జిల్లా నుంచి రాష్ట్రానికి వ్యాపించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమెను 'సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు'తో సత్కరించింది.
సంజరుచౌహాన్ ప్రోత్సాహం
చమోలి నివాసి సంజరు చౌహాన్ కూడా బబిత కృషికి సహకరించారు. 'సంజరు ఎప్పుడూ నాకు గైడ్‌గా సహాయం చేశాడు. అతను నాకు ధైర్యాన్ని పెంచాడు. విజయాన్ని చేరుకోవడానికి నాకు సహాయం చేశాడు' అని బబిత రావత్ పేర్కొన్నారు.