Aug 22,2023 07:25

           సెప్టెంబర్‌ మొదటి వారంలో రాజధాని ఢిల్లీలో జరిగే జి-20 దేశాల శిఖరాగ్ర సమావేశాల్లో ప్రపంచ వ్యాప్త ప్రజల ఈతిబాధలపై చర్చించాలన్న పౌర సంస్థల 'విరు 20' పీపుల్స్‌ సమ్మిట్‌ డిమాండ్‌ సహేతుకమైనది. కేవలం మార్కెట్‌ శక్తుల ప్రయోజనాల కోసమే జి-20 భేటీ అయితే నిష్ప్రయోజనమన్న 'విరు 20' అభిప్రాయం సమర్ధనీయమైనది. మోడీ నేతృత్వంలోని రాజ్యం కల్పించిన పలు అవాంతరాలు, నిరంకుశ చర్యల మధ్య 'జి 20' నెత్తికెత్తుకున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలకు ప్రత్యామ్నాయాలపై చర్చించేందుకు దేశంలోని పలు పౌర, ప్రజాతంత్ర సంస్థలు, మేధావులు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలోని హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ భవన్‌లో 'విరు 20' పేరిట సమావేశమయ్యారు. చివరి రోజు ఆదివారం డిక్లరేషన్‌ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎక్కడోక్కడ జి 20 దేశాల అధినేతలు కూర్చొని చర్చిస్తున్నదంతా ధనిక దేశాల మార్కెట్‌, ఆర్థిక వ్యవస్థల రాజకీయ ప్రయోజనాల ప్రాతిపదికనే. ప్రపంచబ్యాంక్‌, ఐఎంఎఫ్‌, ఎడిబి, డబ్ల్యుటిఓ ప్రతిపాదిస్తున్న ఆర్థిక విధానాలను ముందుకు తీసుకుపోవడమే లక్ష్యంగా చర్చలు, నిర్ణయాలు జరుగుతున్నాయి. ప్రజలను విస్మరిస్తున్నాయి. జి 20 దేశాధినేతలు తమ గొంతు వినాలన్నదే ప్రజల కోరిక. వారి ఆకాంక్షను 'విరు 20' సెమినార్‌ ప్రపంచం ముందుంచింది.
          ప్రజల ఎజెండా లేకుండా జి 20 సదస్సులో చర్చించడమే పెద్ద దగా. పెట్టుబడిదారీ విధానమొక్కటే విశ్వమానవాళికి ఏకైక మార్గమన్న సూత్రాన్ని ఆ విధానంలో తరచు సంభవిస్తున్న సంక్షోభాలు పటాపంచలు చేస్తున్నాయి. 2008 నాటి ఆర్థిక మాంద్యం అప్పటికి తాత్కాలికంగా సమసిపోయిందనిపించినా ఆ ఛాయలు తొలగిపోలేదు సరికదా మరింత విస్తరిస్తున్నాయి. కోవిడ్‌ విలయంతో పరిస్థితులు తిరోగమనంలో పడ్డాయి. ప్రజల్లో ఆర్థిక, సామాజిక అసమానతలు మరింతగా పురివిప్పాయి. వ్యవసాయం, ఆహారం, జీవనోపాధి, వాతావరణ సమతుల్యత, పర్యావరణం, మానవ హక్కుల ఉల్లంఘనలు సంభవిస్తున్నాయి. ప్రజాస్వామ్యానికి హాని కలుగుతోంది. ఈ సమస్యలను, సంక్షోభాలను పరిష్కరించడంలో దేశాల ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ప్రజా ఉద్యమాలు, పౌర సమాజ సంస్థలు, మానవ హక్కుల కార్యకర్తలు, అన్ని రకాల ప్రగతిశీల శక్తుల మధ్య పూర్తి స్థాయి ఐక్యత, సంఘీభావం సాధించినప్పుడే ప్రభుత్వాలు దిగి వస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజానీకానికి సమ్మిళిత, పారదర్శక న్యాయంతో కూడిన సమానత్వ సాధన లక్ష్యాన్ని విరు 20 తన డిక్లరేషన్‌లో ఆవిష్కరించింది.
        జి 20 సదస్సుకు అధ్యక్షత వహించే భాగ్యం మన దేశానికి దక్కింది ప్రధాని మోడీని చూసేనని బిజెపి మంత్రులు, ఇతర నాయకులు ఊరూవాడా టముకు వేసుకుంటున్నారు. నిజానికి జి 20 లోని అన్ని దేశాలకు మల్లే భారత్‌కూ అధ్యక్షత అవకాశం వచ్చింది తప్పితే ప్రత్యేకతేమీ లేదు. ప్రస్తుతం దేశం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. అసమానతలు పెరుగుతున్నాయి. పేదరికం, నిరుద్యోగం, పారిశ్రామిక మందగమనం, అధిక ధరలూ రాజ్యమేలుతున్నాయి. దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, రైతులు, కార్మికులు, మహిళలపై దాడులు, మతఘర్షణలు, ప్రజాతంత్ర, పౌర హక్కుల హననానికి అడ్డు అదుపు లేదు. పార్టీలకతీతంగా, మేధావులు, పౌర సంస్థలు ఏర్పాటు చేసుకున్న ఇండోర్‌ మీటింగ్‌ 'విరు 20' సమ్మిట్‌. జరగనీకుండా పోలీసులతో అడ్డుకోవడాన్ని బట్టి మోడీ ప్రభుత్వంలో అసమ్మతిపై అసహనం స్థాయిని, నిరంకుశాన్ని, అణచివేత ధోరణిని, ప్రజాస్వామ్య హననాన్ని తెలుపుతుంది. జి 20 కోసం ఢిల్లీలో, చివరికి మన విశాఖపట్నంలో సైతం పేదలను ఏ విధంగా దూరంగా తరిమేశారో, ఇళ్లను బుల్డోజర్లతో నేలమట్టం చేశారో చూశాం. జి 20 సదస్సు మణిపూర్‌లో జరిపితే మోడీ ప్రభుత్వ అసలు రంగు ప్రపంచానికి తెలిసొచ్చేది. జి 20 అడ్వర్టయిజ్‌మెంట్ల కోసం మోడీ సర్కారు వందల కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తోంది. మోడీ ప్రభుత్వమైనా, ఇతర జి 20 దేశాధినేతలైనా ప్రజలు ఏం కోరుకుంటున్నారో వారికేం కావాలో చర్చించి చర్యలు తీసుకున్నప్పుడే జనానికి ప్రయోజనం, లేదంటే ప్రజలకు ఒనగూరేదేమీ ఉండదు.