Sep 01,2023 06:35

       నిరుపేదలపై నిత్యం కపట ప్రేమ ఒలకబోస్తూ...అపర కుబేరులకు సర్వం దోచిపెడుతున్న మోడీ సర్కారు ఉపాధి హామీ ఉసురుతీసేందుకు రకరకాల ఎత్తులు వేస్తోంది. వామపక్షాల ఒత్తిడితో యుపిఎ హయాంలో ప్రారంభమైన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్‌) పట్ల ఆది నుంచీ కాషాయ పార్టీ కక్షపూరిత వైఖరిని కొనసాగిస్తోంది. అన్నింటిలోకీ ప్రైవేటురంగాన్ని అనుమతించాలని, ప్రభుత్వ వ్యయంలో కోత పెట్టాలని చెబుతున్న నయా ఉదారవాద సిద్ధాంతాన్ని కేంద్రంలోని మోడీ సర్కారు తూ.చా. తప్పక అమలుచేస్తోంది. అందులో భాగంగా తీసుకొచ్చిన ఆధార్‌ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ (ఎబిపిఎస్‌)ను ఆగస్టు 31లోపు ఉపాధి హామీకి అనుసంధానం చేసి, తప్పనిసరిగా చెల్లింపులు చేయాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను మరోసారి కేంద్రం డిసెంబర్‌ 31 వరకూ పొడిగించింది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఈ గడువు పొడిగించారనేది వాస్తవం. నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సర్వీస్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) పేరుతో మొబైల్‌ యాప్‌ తీసుకొచ్చి, ఈ యాప్‌ ద్వారానే కార్మికులు హాజరు నమోదు చేసుకోవాలని నిబంధన విధించింది. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని పని ప్రదేశాల్లో ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీ సరిగా లేకపోవడంతో కార్మికులు తమ హాజరు నమోదు కోసం గంటల తరబడి వేచివుండాల్సి వస్తోంది. ఈ యాప్‌ ద్వారా నమోదు చేసుకోకపోతే వేతనం చెల్లించకపోవడంతో ఇది వారికి జీవన్మరణ సమస్యగా మారింది. ఆన్‌లైన్‌లో హాజరు, ఆధార్‌ కార్డు ఆధారంగా చెల్లింపులు తప్పనిసరి వంటి హైటెక్‌ నిబంధనలు పెట్టి నిర్వీర్యం చేయబూనుకోవడం దారుణం.
ఉపాధి కావాలని కోరే ప్రతి ఒక్కరికీ వంద రోజులు పని కల్పించాలని చట్టం చెబుతుండగా, ప్రస్తుత సగటు పని దినాలు 35.4 రోజులే. మంత్రిత్వశాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ ఏడాది కేటాయించిన నిధుల్లో ఇప్పటికే 91 శాతం నిధులు ఖర్చయిపోయాయి. ఏటా బడ్జెట్‌లో ఉపాధి హామీకి కేటాయింపులు కునారిల్లుతున్నాయి. 2021-22లో రూ.98,467.85 కోట్లు ఈ పథకానికి ఖర్చు పెట్టారు. 2022-23లో బడ్జెట్‌లో రూ.73 వేల కోట్లే కేటాయించారు. రూ.89,400 కోట్లు వ్యయం చేశారని సవరించిన అంచనాలు పేర్కొంటున్నాయి. అంటే అంతకుముందు ఏడాదితో పోలిస్తే పది శాతం కోత పెట్టారు. 2023-24 బడ్జెట్‌లో కేవలం రూ.60 వేల కోట్లే కేటాయించారు. గత ఏడాది సవరించిన కేటాయింపుల్లో 33 శాతం కోత పెట్టారు. ఈ పనుల్లో పాల్గొనే పేదలను తగ్గించేందుకు పలు రకాల కొర్రీలు పెడుతున్నారు.
            ఉపాధి హామీ చట్టం ప్రకారం పని చేసిన 15 రోజుల్లో కార్మికులకు వేతనం చెల్లించాల్సి ఉండగా, వేల కోట్ల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. సగటు వేతనం రూ.217.87 మాత్రమే ఉంది. మహిళలకు మరింత తక్కువ వేతనం అందుతోంది. ఆంక్షలు, అతి తక్కువ వేతనాలు, సకాలంలో అందకపోవడం, సరిపడినన్ని నిధులు లేకపోవడం... తదితర కారణాల వల్ల ఈ పథకం కింద పని దొరుకుతున్న కుటుంబాల సంఖ్య ఏటా తగ్గిపోతూ వస్తోంది. ఆ సంఖ్యను మరింతగా తెగ్గోసేందుకే ఆధార్‌ ఆధారిత చెల్లింపు వ్యవస్థను ముందుకుతెచ్చింది. ప్రస్తుతం దేశంలో ఉన్న 26 కోట్ల జాబ్‌కార్డు హోల్డర్లలో 41.4 శాతం మందికి ఇప్పటికీ ఎబిపిఎస్‌ అనుసంధానం కాలేదు. నాలుగుసార్లు గడువు పొడిగించినా... నేటికీ ఆ పరిస్థితి ఉంది. తాజాగా పొడిగించిన నాలుగు నెలల్లో ఈ 41.4 శాతం మందికి అనుసంధానమవుతుందా? ఉపాధి హామీ పనులు అత్యధికంగా చేసే ఐదు రాష్ట్రాల్లో కోటీ 20 లక్షల మందికి నేటికీ అనుసంధానం కాలేదు. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, నాగాలాండ్‌లలో 61.2 శాతం, 80 శాతం మందికీ నేటికీ ఎబిపిఎస్‌తో లింక్‌ అప్‌ కాలేదు. కొన్ని చోట్ల అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మొత్తం పేదలకు పనిని తిరస్కరించే హక్కు ఎవరిచ్చారు ?
          పట్టుబట్టి ఉపాధి హామీని చట్టం రూపంలో తీసుకొచ్చిన వామపక్షాలు తాము అధికారంలో ఉన్నచోట ఎంతో సమర్థంగా అమలు చేశాయి. త్రిపురలో తొలిసారి పట్టణ ఉపాధి హామీ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చాయి. ప్రస్తుతం కేరళలో ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం 'అయ్యంకాళి పట్టణ ఉపాధి హామీ పథకం' ఆదర్శవంతంగా అమలు చేస్తోంది. వంద రోజుల పని పూర్తిచేసిన ఉపాధి హామీ కార్మికులందరికీ వెయ్యి రూపాయల చొప్పున ఓనం బోనస్‌గా ఇటీవల అందజేసింది. వేతనాలు, పనిదినాలు పెంచుతూ పట్టణ ప్రాంతాలకు విస్తరించాల్సిన ఉపాధి హామీని నిర్వీర్యం చేసే మోడీ సర్కారు ఎత్తుగడలకు చెల్లుచీటీ పలికేందుకు ప్రజలు సిద్ధం కావాలి.