ఇస్లామాబాద్ : వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో పాక్ సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు పాక్ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. నవంబరులోనే ఎన్నికలు జరగాల్సి వున్నాయని, నియోజకవర్గాల పునర్విభజన కారణంగా ఆలస్యమైందని పాక్ ఎన్నికల కమిషన్ తన ప్రకటనలో పేర్కొంది. నవంబరు 30కల్లా కొత్త నియోజకవర్గాల తుది జాబితా ప్రచురిస్తారు. జనవరి చివరి వారంలో ఎన్నికల నిర్వహణ వుంటుంది. నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి, అప్పీళ్లు, ప్రచారానికి మొత్తంగా 54 రోజుల సమయం వుంటుందని తెలిపింది. ఆగస్టుతోనే పాక్ పార్లమెంట్ ఐదేళ్ల కాలపరిమితి ముగిసింది. దాంతో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరుగుతాయి. పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక, రాజకీయ, భద్రతా సంక్షోభాలను ఎదుర్కొంటున్న సమయంలో ఈ ఎన్నికల ప్రకటన వెలువడింది.