
తెలంగాణ : వన్డే ప్రపంచకప్ 2023లో రెండో మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానంలో జరగనుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఉప్పల్ వేదికగా పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్ల మధ్య ఆట ఆరంభం కానుంది. మెగా టోర్నీలో ఫేవరెట్‌గా ఉన్న పాక్.. రెండు వార్మప్ మ్యాచుల్లోనూ ఓడిపోవడంతో ప్రధాన టోర్నీలో నెదర్లాండ్స్‌పై విజయాన్ని సాధించాలని సిద్ధపడుతోంది. నసీమ్ షా గాయం కారణంగా ప్రపంచకప్‌కు దూరమవ్వడంతో పాక్ బౌలింగ్ టీంలో కాస్త ఆందోళన ఉన్నప్పటికీ బ్యాటింగ్ విభాగం పటిష్టంగానే ఉంది. ఇదిలా ఉండగా ... క్వాలిఫయర్స్‌లో అద్భుతంగా ఆడిన డచ్ టీమ్.. ప్రధాన టోర్నీలోనూ సత్తాచాటేందుకు సన్నద్ధమవుతోంది.
బీసీసీఐ ఆందోళన..!
ప్రపంచంలోనే అతి పెద్దదైన నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మ్యాచ్ ప్రేక్షకాదరణ పొందలేదు. మ్యాచ్ ఆరంభంలో సుమారు 10 వేల మంది ప్రేక్షకులే కనిపించారు. 1.32 లక్షల సామర్థ్యం ఉన్న నరేంద్ర మోడి స్టేడియంలో మ్యాచ్ చివరి వరకూ 47వేల మంది మాత్రమే వచ్చారు. దాదాపు 40 వేల వరకు టికెట్లను మహిళలకు ఉచితంగా ఇచ్చారని తెలుస్తోంది. దీంతో నేడు ఉప్పల్ వేదికగా జరిగే మ్యాచ్‌కు ఎంతమంది హాజరవుతారో అని బీసీసీఐ ఆందోళన చెందుతోంది. ఎందుకంటే.. ఉప్పల్ మైదానంలో ఒక్క భారత్ మ్యాచ్ కూడా జరగలేదు.
ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు...
పాకిస్థాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్‌లో ఉచితంగా ఆటను చూడవచ్చు. ఇక మధ్యాహ్నం 12 గంటల నుంచి అభిమానులకు ఉప్పల్ మైదానంలో ప్రవేశం ఉంటుంది. మ్యాచ్ జరిగే ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మ్యాచ్ కోసం 1200 మంది పోలీసులతో భారీ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. క్రికెట్ అభిమానుల కోసం అర్థరాత్రి వరకు మెట్రో రైల్వే సేవలు అందుబాటులో ఉండనున్నాయి.
తుది జట్లు :
పాకిస్తాన్ : ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, అఘా సల్మాన్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వాసిం, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్.
నెదర్లాండ్స్ : విక్రమజీత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, వెస్లీ బరేస్సీ, బాస్ డి లీడే, తేజా నిడమనూరు/కోలిన్ అకెర్‌మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్, లోగాన్ వాన్ బీక్, సాకిబ్ జుల్ఫికర్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, పాల్ వాన్ మీర్కెరెన్, ఆర్యన్ దత్.