- అత్యవసర పరిస్థితి విధించిన ప్రభుత్వం
రీక్‌జవిక్ (ఐస్‌లాండ్) : ఐస్‌లాండ్‌లో గత 24గంటల్లో 800కిపైగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. వీటిల్లో 500కి పైగా ప్రకంపనలు నాలుగు కన్నా ఎక్కువ తీవ్రతతోనే వచ్చాయని అధికారులు చెప్పారు. ఇన్నిసార్లు భూమి కంపిస్తోందంటే త్వరలోనే రాజధానికి సమీపంలో గల అగ్నిపర్వతం బద్దలయ్యే అవకాశం వుందంటూ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐస్‌లాండ్‌లో అగ్నిపర్వతాలు చాలా ఎక్కువ, మొత్తంగా 33 అగ్నిపర్వతాలు వున్నాయి, ఇది యూరప్‌లోనే అధికం. భూకంపాలు కూడా ఎక్కువే. దీంతో అక్కడ తరచూ భూమి కంపిస్తూ వుంటుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. రాజధాని రీక్‌జవిక్‌కు సమీపంలో గల చిన్న పట్టణం నుండి దాదాపు నాలుగు వేల మంది ప్రజలను రాత్రికి రాత్రే తరలించారు. ఆ గ్రామంలో వందలాదిగా ప్రకంపనలు వస్తూనే వున్నాయి. ప్రజాదరణ పొందిన పర్యాటక కేంద్రమైన బ్లూ లాగూన్ జియోథర్మల్ స్పా రిసార్ట్‌కు సమీపంలోనే ఈ గ్రామం వుంది. ముందు జాగ్రత్తగా పర్యాటక కేంద్రాన్ని కూడా మూసివేశారు. అగ్నిపర్వతం బద్దలైందంటే కొన్ని గంటలు కాదని, కొన్ని రోజులు దాని ప్రభావం వుంటుందని, శుక్రవారం రాత్రి కొన్నిచోట్ల లావా ఉబికివస్తున్నట్లు కనిపిస్తుందని, అంటే త్వరలోనే అగ్నిపర్వతం పేలుతుందని ఐస్‌లాండ్ వాతావరణ కార్యాలయం ప్రకటించింది. ఇలాంటి దశలో ఎక్కడ, ఎప్పుడు ఎలా లావా ఉబికివస్తుందో కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదని పేర్కొంది.