Oct 13,2023 10:31

జెరూసలెం : ఇప్పటివరకు గాజా ప్రాంతం నుండి 3,38,000మందికి పైగా ప్రజలను వారి ఇళ్ల నుండి బలవంతంగా వెళ్ళగొట్టారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. పెద్ద సంఖ్యలో ప్రజలు వెళ్ళగొట్టబడుతున్నారని ఐక్యరాజ్య సమితి మానవతా సంస్థ ఒసిహెచ్‌ఎ ఒక ప్రకటనలో తెలిపింది. బుధవారానికి ఈ సంఖ్య కేవలం 75వేలుగా వుండగా, గురువారానికి ఒక్కసారిగా 3,38,934కి పెరిగిందని పేర్కొంది. నిర్వాసితులైన వారిలో దాదాపు 2,20,000మంది ఐక్యరాజ్య సమితి ఆశ్రయ కేంద్రాల్లో తల దాచుకున్నారని తెలిపింది. మరో 15వేల మంది పాలస్తీనా అథారిటీ నిర్వహించే స్కూళ్లకు వెళ్ళారని పేర్కొంది. మరో లక్ష మంది తమ బంధువులు, ఇరుగుపొరుగువారు, చర్చిలు, ఇతర షెల్టర్లలో తలదాచుకున్నారు.
 

                                                                     ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తున్న అమెరికా

గాజాపై ఆపరేషన్‌ ఐరన్‌ స్వోర్డ్‌ పేరుతో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న భీకర దాడులకు మరింత ఆజ్యం పోసేలా అమెరికా వ్యవహరిస్తోంది. ఇటువంటి చర్యలతో పరిస్థితులు మరింత దిగజారతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయినా, లక్ష్యపెట్టకుండా రెండో విమాన వాహక నౌకను మధ్య ప్రాచ్య ప్రాంతానికి పంపాలని అమెరికా యోచిస్తోంది. గురువారం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఇజ్రాయిల్‌ వెళ్లి తదుపరి కార్యాచరణ గురించి చర్చించారు. అనంతరం జోర్డాన్‌కు బయల్దేరి వెళ్తారు. పాలస్తీనాకు ఇరాన్‌, సిరియా, టర్కీ, మొరాకో, ట్యునీసియా తదితర ి దేశాలు మద్దతు ఇస్తున్నాయి. అమెరికా అగ్గిని రాజేస్తోందని షాంఘై అధ్యయన సంస్థకు చెందిన రీసెర్చ్‌ ఫెలో లీ వెజియాన్‌ వ్యాఖ్యానించారు.