ఏ హీరో అయినా తన అభిమానులకు సాయం చేయడం సహజం. కానీ హీరో విజరు దేవరకొండ అందుకు భిన్నం. తనను అభిమానించే వారినే కాదు.. సాధారణ మధ్యతరగతి కుటుంబీకులకు, చిన్నారులకు సాయం చేస్తూంటారు. ఈ మధ్య వంద కుటుంబాల వారికి లక్ష చొప్పున కోటి రూపాయలు సాయం చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. విజయ్, సమంత కలిసి నటించిన 'ఖుషి' సినిమా విజయవంతం అయిన సందర్భంగా ఆయన ఈ కార్యక్రమం చేపట్టారు. జయాపజయాల గురించి ఆలోచించకుండా వరసగా సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్న విజరు దేవరకొండ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
పూర్తి పేరు : విజయ్ దేవరకొండ సాయి
పుట్టిన తేది : 1989 మే 9
(వయసు 34)
చదువు : డిగ్రీ
వృత్తి : నటుడు, నిర్మాత
తమ్ముడు : ఆనంద్ దేవరకొండ
విజయ్ దేవరకొండ హైదరాబాద్‌లో పుట్టి, పెరిగారు. తల్లిదండ్రులు దేవరకొండ గోవర్థనరావు, మాధవి. తెలంగాణాలోని నాగర్‌కర్నూలు జిల్లా, తుమాన్పెట్ గ్రామానికి చెందినవారు. తండ్రికి సినిమాలపై ఉన్న మక్కువతో హైదరాబాదుకు వచ్చారు. సినిమాల్లో నటుడు అవ్వాలనుకున్నాడు కానీ అది సాధ్యం కాకపోవడంతో దర్శకత్వ శాఖలో ప్రవేశించారు. విజరు పుట్టపర్తి శ్రీసత్యసాయి ఉన్నత పాఠశాలలో హాస్టల్లో ఉండి, చదువుకున్నారు. స్కూలు దశలో ఉన్నప్పుడే తాను కథా రచన, నటనపై ఆసక్తి పెంచుకున్నానని చెబుతుండేవారు.
'నాకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు. ''లైగర్'' సినిమా ఫ్లాప్ అయినప్పుడు ''నెక్ట్స్ మూవీ హిట్ కొట్టాలి అన్నా'' అనేవారు. వాళ్ల ముఖాల్లో సంతోషం చూసేందుకు ''ఖుషి''తో హిట్ కొట్టా. ''ఎవడే సుబ్రహ్మణ్యం'' సినిమా చూసేందుకు నా ఫ్రెండ్స్‌తో కలిసి ఓ థియేటర్‌కు వెళ్లా. అప్పటికి నేను ఎవరికీ తెలియదు. నా సీన్స్ వచ్చేటప్పుడు ఆడియెన్స్ బాగా ఎంజారు చేయడం చూశా. సినిమా పూర్తయ్యాక నన్ను గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చారు. ''పెళ్లిచూపులు'' సినిమా చూస్తున్నప్పుడు ఆ థియేటర్ నవ్వులతో ఊగిపోవడం చూశా. ఆ సినిమా రిలీజైన నెక్ట్స్ డే నా ఫోన్ కంగ్రాట్స్ మెసేజ్‌లతో నిండిపోయింది. లైఫ్‌లో కొద్దికాలం తర్వాత యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకుని, డైరెక్షన్ చేయాలని అనుకుంటున్నా. కానీ నా దగ్గరకు వచ్చే స్క్రిప్ట్స్ చదువుతుంటే నటించడం ఆపలేను అనిపిస్తుంటుంది. ఫ్యూచర్‌లో మాత్రం తప్పకుండా డైరెక్షన్ వైపు వెళ్తా. నాకు ఆర్కిటెక్చర్ ఇష్టం. మా ఇంట్లో డెకరేషన్ ఎలా ఉండాలో నేనే సెలెక్ట్ చేశా. ఫ్యూచర్‌లో ఒక ఫామ్ కొని, దాన్ని నాకు నచ్చినట్లు డిజైన్ చేయించుకోవాలని అనుకుంటున్నా. ఫేవరేట్ ఫుడ్స్ చాలా ఉన్నా.. హైదరాబాద్ బిర్యానీ, దోశ, బర్గర్, ఛీజ్ కేక్ ఇష్టంగా తింటాను. ఇవన్నీ తిన్నా వర్కవుట్స్ బాగా చేస్తా. అలా బరువు పెరగకుండా చూసుకుంటా. ప్రయాణాలు చేయడం, క్రీడలు అంటే ఇష్టం. ఆ మధ్య మాల్దీవ్స్ వెళ్లాను. హెవెన్‌లా అనిపించింది. మా ఫ్రెండ్స్‌తో కలిసి బాస్కెట్‌బాల్ ఆడుతుంటా. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం ఇష్టం. అలాగే బిజినెస్ ఆలోచనలూ ఉన్నాయి. ఈ విషయంపై మా ఫ్యామిలీ, నా టీమ్‌తో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాను' అంటున్నారు విజయ్.
సేవా కార్యక్రమాలు చేయడంలో విజరు ఎప్పుడూ ముందుంటారు. ప్రతి ఏడాది తన పుట్టినరోజు నాడు చిన్నారుల కోసం ఏదోఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. అలాగే 'దేవర శాంతా' పేరుతో క్రిస్మస్‌కు సర్‌ప్రైజ్ గిఫ్టులు ఇస్తుంటారు. ఇటీవల తన స్వంత ఖర్చులతో కొంతమందిని పర్యాటక ప్రదేశాలకు పంపించారు. ఇలా ప్రతి ఏడాది పంపిస్తూ ఉంటానని హామీ కూడా ఇచ్చారు.
శివ నిర్మాణ దర్శకత్వంలో విడుదలైన 'ఖుషి' చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి టాక్ అందుకుంది. ఈ నేపథ్యంలోనే వంద కుటుంబాలను ఎంపిక చేసి, తన సంపాదన నుంచి రూ. కోటిని పంచారు. 'నాకు ఇంత ప్రేమ పంచుతున్న మీ కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఇలా ఎవరైనా మనకు హెల్ప్ చేస్తే బాగుండు అని అనుకున్న వాడినే. చదువుకునే రోజుల్లో స్నేహితులంతా వెకేషన్‌కు వెళ్తే నేను డబ్బులు ఇంట్లో అడిగి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, ఉండిపోయేవాడిని. తమ్ముడి ఇంజినీరింగ్ ఫీజు కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరైనా కొంత డబ్బు ఇస్తే బాగుండు అనిపించేది. కానీ ఎవర్నీ అడగడానికి ఇష్టం ఉండేది కాదు. అవన్నీ దాటుకుని, ఈ స్థాయికి చేరుకున్నా. ఇవాళ మీకు ఈ హెల్ప్ చేయగలుగుతున్నాను అంటే అది నా వ్యక్తిగత కోరిక. ఈ లక్ష రూపాయలు అందిన తర్వాత మీకు ఆనందంగా అనిపిస్తే నాకు అదే సంతృప్తినిస్తుంది. ఈ చిన్న సాయం మీకు ఉపయోగపడితే నాకు హ్యాపీ. నాకు థ్యాంక్స్ చెప్పకండి!' అని ఎంతో నమ్రతగా చెప్తున్నాడు విజయ్.